ఇదేం హెచ్చరిక?!

తన వద్ద శిష్యరికం పూర్తిచేసి వెళ్లిపోయే సందర్భంలో జెన్‌ గురువు ఒక పరీక్ష పెట్టేవారు. ఆశ్రమ ప్రాంగణంలోని పెద్ద చెట్టు చిటారు కొమ్మకు చేరి, కిందికి దిగడమే పరీక్ష. అందులో సఫలమయ్యేవారు బహు తక్కువ.

Published : 06 Jun 2024 00:14 IST

న వద్ద శిష్యరికం పూర్తిచేసి వెళ్లిపోయే సందర్భంలో జెన్‌ గురువు ఒక పరీక్ష పెట్టేవారు. ఆశ్రమ ప్రాంగణంలోని పెద్ద చెట్టు చిటారు కొమ్మకు చేరి, కిందికి దిగడమే పరీక్ష. అందులో సఫలమయ్యేవారు బహు తక్కువ. ఒకసారి ఓ శిష్యుడు మాత్రమే వేగంగా చెట్టు ఎక్కాడు. అతడలా ఎక్కుతుంటే చూస్తూ నిల్చున్నాడే తప్ప గురువు హెచ్చరించలేదు, అభినందించలేదు. శిష్యుడు లక్ష్యం ముగిసి, కిందికి దిగుతున్నాడు. వంకర కొమ్మలను, ముళ్ల రెమ్మలను అధిగమిస్తున్నాడు. గురువు ఏకదీక్షగా శిష్యుణ్ణే చూస్తూ ‘జాగ్రత.. జాగ్రత్త..’ అంటున్నారు. ఆయన మాటలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. కష్టపడి చిటారు కొమ్మకు చేరేటప్పుడు మౌనంగా ఉన్న గురువు.. సునాయాసంగా దిగుతుంటే ఇదేం హెచ్చరిక- అనుకున్నారు. నిగ్రహించుకోలేక అడిగారు కూడా. ‘పైకి చేరటం సులభం. ఎందుకంటే మీ ముందు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరితే అందరూ అభినందిస్తారని తెలుసు. అందుకే నైపుణ్యమంతా ప్రదర్శించి ఎక్కుతారు. నేను ప్రత్యేకంగా చెప్పకున్నా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. దిగేటప్పుడు అలా కాదు. గెలిచామన్న గర్వం ఉంటుంది. ఎక్కడమే కష్టం, అదే సాధించాను. ఇక దిగడంలో ఏముంది- అన్న తేలిక భావంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దాంతో పట్టు జారే ప్రమాదముంది. అందుకే అప్రమత్తంగా ఉండమని చెప్పాను. ఒకవ్యక్తి ఉన్నతస్థాయికి చేరడం చాలా కష్టం. కానీ పతనమయ్యేందుకు క్షణం పట్టదు. ఎంతో ఘనత వహించినవారు సైతం తమ ప్రాభవం కోల్పోయి, దయనీయ స్థితికి చేరిన ఉదంతాలున్నాయి’ అంటూ వివరించారాయన.

తరిగొప్పుల విఎల్‌ఎన్‌ మూర్తి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని