దీపారాధన ఎందుకంటే..

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు.

Published : 02 May 2024 00:26 IST

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారమూ ఉంది. దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం.

చీకటి అజ్ఞానానికి, కాంతి జ్ఞానానికి గుర్తు. భగవంతుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, పోషించేవాడు కాబట్టి జ్యోతి రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తాం. వెలుగు చీకటిని తరిమేసినట్లు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని తరగని, చౌర్యంకాని అపురూప సంపదగా భావించి జ్యోతి వెలిగించి నమస్కరిస్తాం. జ్ఞానస్వరూపమైన కాంతిని శుభసూచనగా భావించి పెళ్లి, పేరంటం లాంటి సందర్భాల్లో జ్యోతిప్రజ్వలన చేస్తారు. దీపానికి వాడే తైలం, నెయ్యి మనలోని వాసనలు, స్వార్థపూరిత సంస్కారాలకు సంకేతం కాగా.. అందులోని వత్తి అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో దీపం వెలిగిస్తారో అప్పుడు వారిలోని మాలిన్య వాసనలు కరిగి, అహంకారం తొలగిపోతుంది.

 దీపం జ్యోతి పరబ్రహ్మ దీపంస్సర్వం తమోపహః

 దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
అని ప్రార్థిస్తూ దీపం వెలిగించాలి. అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ప్రసాదించి, అన్నింటినీ సిద్ధింపచేసుకునే శక్తినిచ్చే సంధ్యా దీపానికి నమస్కరించాలని భావం.
- నారంశెట్టి ఉమా మహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు