CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు పెంపు.. కీలక మార్పులివే..!

సీఆర్‌పీఎఫ్‌(CRPF)లో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దరఖాస్తుల గడువుతో పాటు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసులోనూ మార్పులు చేశారు.

Updated : 19 Apr 2023 18:16 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 9,212  కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి మార్చిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కీలక సవరణలు చేశారు. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/ మహిళా అభ్యర్థుల నుంచి మార్చి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఆ గడువు ఏప్రిల్‌ 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును మే 2వరకు పొడిగిస్తున్నట్టు సీఆర్‌పీఎఫ్‌ వెల్లడించింది. అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ గడువును పొడిగించామని పేర్కొంది. అలాగే అభ్యర్థుల వయోపరిమితి నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

వయో పరిమితిలో మార్పు.. పోస్టులూ పెరిగాయ్‌!

కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులకు  గతంలో 21-27 ఏళ్ల వయో పరిమితి విధించగా దాన్ని ప్రస్తుతం 21-30 ఏళ్లకు పెంచింది. కానిస్టేబుల్‌(మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌) పోస్టులకు గతంలో వయోపరిమితి 18-23 ఏళ్లు ఉండగా ప్రస్తుతం 18-26 ఏళ్లకు మార్పు చేసింది. పోస్టుల ఖాళీల్లోనూ మార్పులు చేసింది. గతంలో 9212 కానిస్టేబుల్‌ పోస్టులకు అదనంగా మరో 148 ఉద్యోగాలను జత చేయడంతో ఖాళీల సంఖ్య ప్రస్తుతం 9360కి పెరిగింది. అభ్యర్థుల ఎత్తు, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్టుకు సంబంధించి పలు మార్పులు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ ఆ ప్రకటనలో తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని