తక్కువ వ్యయం...త్వరగా ఉద్యోగం!

విదేశీవిద్యకు యూఎస్‌ తర్వాత గుర్తుకొచ్చే దేశాల్లో కెనడా ఒకటి. నాణ్యమైన విద్యా బోధన, పరిశోధనలు   ఆ దేశం ప్రత్యేకతలు. అందుబాటు ధరల్లో ఫీజు, కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు... తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా కెనడా వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదే బాటలో సాగాలనుకునే అభ్యర్థులు  అక్కడి పేరున్న సంస్థల, కోర్సుల వివరాలపై అవగాహన పెంచుకోవాలి.

Updated : 17 Oct 2019 02:48 IST

విదేశీవిద్య - కెనడా

వచ్చే ఏడాది సెప్టెంబరులో మొదలయ్యే ఫాల్‌ కోర్సులకు ఈ సంవత్సరం డిసెంబరులోగా దరఖాస్తు చేసుకోవాలి.

విదేశీవిద్యకు యూఎస్‌ తర్వాత గుర్తుకొచ్చే దేశాల్లో కెనడా ఒకటి. నాణ్యమైన విద్యా బోధన, పరిశోధనలు   ఆ దేశం ప్రత్యేకతలు. అందుబాటు ధరల్లో ఫీజు, కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు... తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా కెనడా వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదే బాటలో సాగాలనుకునే అభ్యర్థులు  అక్కడి పేరున్న సంస్థల, కోర్సుల వివరాలపై అవగాహన పెంచుకోవాలి.
కెనడా జనాభాలో 22 శాతం మంది విదేశీయులే. ఏటా అయిదు లక్షల మంది విదేశీయులు ఆ దేశంలో చదువుకోడానికి వెళుతున్నారు. అక్కడి అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనీయులు (28 శాతం), తర్వాతి స్థానంలో మనవాళ్లే (25 శాతం) ఉన్నారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు లభించడం..తదితర కారణాలతో విద్యార్థులు కెనడా వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌ ఇక్కడి అధికారిక భాషలు. ఆంగ్లంపై పట్టు ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్సు పూర్తి చేసుకోవచ్చు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. క్యూబెక్‌ ప్రాంతంలో చదవడానికి ఫ్రెంచ్‌ వస్తే మంచిది. ఫీజు, వసతి, భోజన ఖర్చులు భరించగలిగే స్థాయిలోనే ఉంటాయి.

ఎటు చూసినా పచ్చదనం, ఆహ్లాదభరితమైన వాతావరణంతో జీవ వైవిధ్యం ఉట్టిపడుతుంది. కెనడాలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో పంజాబీ మూడో స్థానంలో ఉంది. విస్తీర్ణంలో రెండో అతిపెద్ద దేశం. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో కేవలం నలుగురే ఉంటారు.
యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఇక్కడ విద్య పూర్తవుతుంది. సాధారణంగా వారానికి 20 గంటలు, సెమిస్టర్‌ బ్రేక్‌లో ఫుల్‌ టైం పనిచేసుకునే వీలుంది. ఇందుకోసం వర్క్‌ పర్మిట్‌ అవసరం లేదు. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఐడెంటిఫికేషన్‌ కార్డు ఉన్నవారు వివిధ సేవలను (హోటళ్లు, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్‌, ట్రెయిన్లు) రాయితీ ధరలకు పొందవచ్చు. స్టూడెంట్‌ వీసా ప్రాసెసింగ్‌ వ్యవధిని 60 నుంచి 45 రోజులకు కుదించారు. ఉద్యోగిత రేటు ఎక్కువ. కోర్సుల కోసం ఎంచుకోవడానికి ఎక్కువ సంస్థలు అందుబాటులో ఉన్నాయి.]

ఫీజు.. ఖర్చులు
పీజీ కోర్సులకు ఫీజు ఏడాదికి సగటున రూ.8.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. నివాస అవసరాలకు ఏడాదికి రూ.6 లక్షలు సరిపోతాయి. వాంకోవర్‌, టొరంటో, క్యూబెక్‌ లాంటి చోట్ల ఏడాదికి రూ.10 లక్షలు అవసరమవుతాయి. ఆల్బర్టాలో వసతి, భోజనం, దుస్తులు, ఇతరాలన్నింటికీ కలిపి ఏడాదికి 15,000 నుంచి 18,000 కెనడియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో  దాదాపు రూ.8 లక్షల నుంచి రూ. 9.6 లక్షలు ఏడాదికి ఖర్చు ఉంటుంది. రెండేళ్ల పీజీ కోర్సు పూర్తి చేయడానికి కనీసం రూ.35 లక్షలు అవసరమవుతాయి. ఈ మొత్తం ఎంచుకున్న కోర్సు, ఆ యూనివర్సిటీ ఉన్న ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. యూఎస్‌తో పోలిస్తే 30 - 40 శాతం వ్యయం తక్కువ. కొన్ని సంస్థల్లో ఫుల్‌ టైమ్‌ కోర్సు అడ్మిషన్‌ తీసుకున్నవారికి ఆరోగ్య బీమా వర్తిస్తుంది. మిగిలిన సంస్థలు, ప్రాంతాల్లో చేరినవారు ప్రత్యేకంగా బీమా తీసుకోవడం తప్పనిసరి.
కావాల్సిన అర్హతలు
కెనడాలోని సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. భారతీయ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌లో 65-70 శాతం మార్కులు లేదా 7.0 - 7.5 జీపీఏ ఉండాలి. 75 నుంచి 80 శాతం మార్కులు వచ్చిన వారు మేటి సంస్థల్లో సీటు ఆశించవచ్చు. 3, 4 సంవత్సరాల్లో సాధించిన మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సంస్థలు జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌ స్కోర్‌ అడుగుతున్నాయి. ఆంగ్లభాష ప్రావీణ్యాన్ని గుర్తించడానికి ఐఈఎల్‌టీఎస్‌ 7 లేదా టోఫెల్‌ 90 ప్లస్‌ స్కోర్‌ ఉండాలి. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

వివిధ యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. 125కు పైగా పబ్లిక్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పదిహేనువేల వరకు యూజీ, పీజీ ప్రొగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ సంస్థల్లో ప్రవేశాలు ఫాల్‌, స్ప్రింగ్‌ సీజన్లలో ఉంటాయి. ఫాల్‌ కోర్సులు సెప్టెంబరులో మొదలవుతాయి. స్ప్రింగ్‌ సెమిస్టరు జనవరిలో ప్రారంభమవుతుంది. కెనడా యూనివర్సిటీలు రిసెర్చ్‌ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. మాంట్రియల్‌, టొరంటో, వాంకోవర్‌, అట్టావా, క్యూబెక్‌ ప్రాంతాలు స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీలుగా పేరొందాయి. వీటిలో మాంట్రియల్‌ అంతర్జాతీయ విద్యార్థులకు అనువైన ప్రాంతాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ దేశంలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు ఏడాదికి సగటున 50,000 - 60,000 కెనడియన్‌ డాలర్ల వేతనం (భారత కరెన్సీలో సుమారు రూ. 27 లక్షల నుంచి రూ. 32 లక్షల వరకు) లభిస్తుంది. ఐటీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, బిగ్‌ డేటా, సైంటిఫిక్‌ రిసెర్చ్‌, పెట్రోలియం అండ్‌ ఆయిల్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ తదితర విభాగాల్లో పెద్ద మొత్తంలో జీతాలు అందుతున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పర్మనెంట్‌ రెసిడెంట్‌ హోదా సులువుగా లభించడం ఈ దేశం ప్రత్యేకత.



ప్రాంతాల వారీగా పేరున్న యూనివర్సిటీలు

మాంట్రియల్‌: మెక్‌గిల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియల్‌, కాన్‌కార్డియా యూనివర్సిటీ
టొరంటో: యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో, యార్క్‌ యూనివర్సిటీ, రైర్‌సన్‌ యూనివర్సిటీ
వాంకోవర్‌: బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ, వాంకోవర్‌ ఫిల్మ్‌ స్కూల్‌, కెనడా వెస్ట్‌ యూనివర్సిటీ
అట్టావా: అట్టావా యూనివర్సిటీ, కార్ల్‌సన్‌ యూనివర్సిటీ, సెయింట్‌ పాల్‌ యూనివర్సిటీ
క్యుబెక్‌: లావల్‌ యూనివర్సిటీ, చాంప్‌లైన్‌ కాలేజ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌
టాప్‌ సబ్జెక్టులు: నీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
* ఇంజినీరింగ్‌ (పెట్రోలియం, మైనింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ బ్రాంచీలకు ఎక్కువ గిరాకీ) * ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ * బిజినెస్‌ అండ్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ * మ్యాథ్స్‌ నీ డేటా సైన్స్‌ * స్టాటిస్టిక్స్‌ * ఎనలిటిక్స్‌ * ఆర్కిటెక్చర్‌ * మెడిసిన్‌ * అనాటమీ అండ్‌ ఫిజియాలజీ * నర్సింగ్‌ * ఫార్మసీ * అగ్రికల్చరల్‌ సైన్స్‌ అండ్‌ ఫారెస్ట్రీ * జాగ్రఫీ * మేనేజ్‌మెంట్‌ * హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ * ఫైనాన్స్‌ * రెన్యువబుల్‌ ఎనర్జీ * మీడియా అండ్‌ జర్నలిజం
* సైకాలజీ * హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఎడ్యుకేషన్‌

(కెనడాలోని యూనివర్సిటీ ప్రపంచ ర్యాంకుల వివరాలకుwww.eenadupratibha.net చూడవచ్చు.)


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని