చివరిదాకా స్ఫూర్తి కొనసాగేదెలా?

కొంతమంది విద్యార్థులకు కోర్సు మొదట్లో ఉన్న స్ఫూర్తి చివరి వరకూ కొనసాగదు. సుదీర్ఘకాలం కష్టపడి చదివినప్పటికీ

Published : 25 Jan 2022 11:15 IST

కొంతమంది విద్యార్థులకు కోర్సు మొదట్లో ఉన్న స్ఫూర్తి చివరి వరకూ కొనసాగదు. సుదీర్ఘకాలం కష్టపడి చదివినప్పటికీ పరీక్ష సమయానికొచ్చేసరికి  ప్రతిభ చూపలేకపోతారు. పోటీ ప్రపంచంలో నెగ్గాలన్న ప్రేరణ చివరి వరకూ కొనసాగి  అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి? 

మెంటర్‌ ఉంటే మేలు

పాఠ్యాంశాల్లో వచ్చే సందేహాలను అధ్యాపకుల సహాయంతో నివృత్తి చేసుకుంటారు. కోర్సులు, కాలేజీల ఎంపిక..నైపుణ్యాల మెరుగుదల... ఇలాంటి విషయాల్లోనూ అనేక సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి సందేహాల నివృత్తి కోసం మీకంటూ ఒక మార్గదర్శి (మెంటర్‌)ను ఏర్పరచుకుంటే మంచిది. వారి సలహాలు, సూచనలతో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. 

ఇష్టమైన కాలేజీలో.. ఎంతో ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునిమరీ డిగ్రీలో చేరింది మౌనిక. కానీ కోర్సు ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, ప్రేరణ ఆమెలో క్రమంగా తగ్గిపోతున్నాయి. దాంతో ఏదో తప్పదన్నట్టుగా బలవంతంగా చదువును కొనసాగిస్తోంది. 

మహేష్‌ పరిస్థితీ కాస్త అటూఇటుగా ఇలాగే ఉంది. ఒకప్పుడు స్నేహితులతో కలిసి కాలేజీకి వెళుతూ ఆడుతూపాడుతూ చదువుకునేవాడు. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులతో ఇంటికే పరిమితం కావడంతో నిర్లిప్తత అతడిని ఆవరించింది. గతంలో మాదిరిగా సంతోషంగా చదవలేకపోతున్నాడు. 

కొంతమంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కోర్సు ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, ప్రేరణ క్రమంగా తగ్గిపోతున్నాయి. 

కారణాలెన్నో

ఒకేసారి ఎక్కువ పనులు పెట్టుకోవడం వల్ల కొంతమంది విద్యార్థులు త్వరగా అలసిపోతుంటారు. దాంతో గతంలో మాదిరిగా ఉత్సాహంగా ముందుకు వెళ్లలేకపోతుంటారు. కొందరు విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల తర్వాత ఎక్కువ సమయాన్ని సామాజిక మాధ్యమాల్లో గడుపుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా చదువు మీద ఆసక్తి క్రమంగా తగ్గుతుంటుంది. అలాగే సబ్జెక్టుల మీద ఆసక్తిలేకపోయినా, బోధించే నిపుణుల కొరత ఉన్నా, పరీక్షలో ఫెయిలవుతారనే భయం ఎక్కువైనా, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల వల్లా గతంలో ఉన్న ఉత్సాహం, ప్రేరణ క్రమంగా తగ్గిపోతుంటాయి. ముందుగా ఏ కారణంతో మీరు రోజురోజుకూ వెనకబడుతున్నారో గుర్తించాలి. ఆ తర్వాత పరిష్కారాల దిశగా కృషి  చేయాలి. 

లక్ష్య సాధనకు ప్రోత్సాహం

కోర్సు ప్రారంభంలో వివిధ లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిలో కొన్నింటిని మాత్రమే సాధించగలుగుతారు. దాంతో ఉత్సాహం తగ్గి, నిరాశ ఆవరిస్తుంది. అలాకాకుండా ఉండాలంటే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని నిర్ణీతకాలంలోగా దాన్ని సాధించాలనే నియమం పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో దాన్ని నిర్దేశించుకోవాలి. అలాగే లక్ష్యాన్ని సాధించిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు అభినందించుకోవడం మర్చిపోవద్దు. దీంతో మరింత సంతోషంగా మరో లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. 

సానుకూల దృక్పథం 

ఎంతో ఇష్టంతో ఎంచుకున్న కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, కలల కొలువును సాధించాలన్నా ఈ దృక్పథం ఎంతగానో తోడ్పడుతుంది. ఒక్కోసారి అపజయాలు ఎదురైనా తట్టుకుని నిలబడాలంటే సానుకూలంగా ఆలోచించగలగాలి. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులే మీ చుట్టూ ఉండేలా జాగ్రత్తపడాలి. దాంతో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్సాహంగా ముందుకు వెళ్లగలుగుతారు.

మీకోసం సమయం

చదవాల్సిన సబ్జెక్టులు ఎన్ని ఉన్నా, ఎన్ని పనులున్నా మీకంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మీ మనసుకు నచ్చిన పనులు మాత్రమే చేయాలి. ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, పుస్తకాలు చదవడం, టీవీ చూడటం... ఇలా ఏవైనా కాసేపు చేయొచ్చు. మనసుకు నచ్చిన పనులతో సేదదీరడం వల్ల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. దాంతో మర్నాడు ఎక్కువ గంటలపాటు చదివినా అలసిన భావన కలగదు.  

వ్యాయామం  

వ్యాయామం చేయడం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్‌లతో రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు. చదవాల్సినవి ఎన్ని ఉన్నా ఒత్తిడికి గురికారు. చిరాకు, విసుగు దరిచేరకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారు. రోజువారీ పనులు చేయడానికి కావాల్సిన శక్తీ అందుతుంది. రోజూ వ్యాయామం చేయడం విసుగ్గా అనిపిస్తే గంటసేపు మీకిష్టమైన ఆటను ఆడుకోవచ్చు. వ్యాయామాలకు తగిన పోషకాహారాన్నీ జోడిస్తే చురుకుదనం మీ సొంతం అవుతుంది. దాంతో కోర్సు మొదట్లో ఉన్న స్ఫూర్తి కొరవడకుండా చివరివరకూ కొనసాగుతుంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని