TS EXAMS-2022: పోటీ కోణంలో జీవశాస్త్రం

జనరల్‌ స్టడీస్‌లో భాగమైన జనరల్‌ సైన్స్‌పై పోటీ పరీక్షల అభ్యర్థులు తగిన దృష్టి కేంద్రీకరించాలి. దీనిలో వచ్చే ప్రశ్నల్లో 50 శాతం జీవశాస్త్రం (బోటనీ, జువాలజీ) నుంచి వస్తాయి. కేటాయించిన ప్రశ్నల్లోనూ దాదాపు 60 శాతం జంతుశాస్త్ర సంబంధిత

Updated : 03 May 2022 06:25 IST

గ్రూప్స్‌, పోలీస్‌, ఇతర నియామక పరీక్షల కోసం

జనరల్‌ స్టడీస్‌లో భాగమైన జనరల్‌ సైన్స్‌పై పోటీ పరీక్షల అభ్యర్థులు తగిన దృష్టి కేంద్రీకరించాలి. దీనిలో వచ్చే ప్రశ్నల్లో 50 శాతం జీవశాస్త్రం (బోటనీ, జువాలజీ) నుంచి వస్తాయి. కేటాయించిన ప్రశ్నల్లోనూ దాదాపు 60 శాతం జంతుశాస్త్ర సంబంధిత అప్లికేషన్స్‌తో ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు వీటిని గమనించి పకడ్బందీగా సన్నద్ధం కావాలి!  

పోటీ పరీక్షల్లో ప్రధానంగా మానవులకు వచ్చే వివిధ రకాల వ్యాధులపై ప్రశ్నలుంటాయి. మానవుని రోగనిరోధకతకు సవాల్‌ విసిరే బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగీ, ప్రోటోజోవా మొదలైనవాటి గురించి బాగా తెలిసివుండాలి. ముఖ్యంగా ఇటీవలికాలంలో మానవాళిని వేధించిన కొత్త కొత్త రోగాలపై అవగాహన అవసరం. ఈ వ్యాధులను ఎదుర్కొనేందుకు ఉన్న వివిధరకాలైన రసాయనాలు, మెలకువలపై అవగాహన ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధించిన కరోనా వైరస్‌ గురించీ, దాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వాలు చేపట్టిన చర్యల గురించీ స్పష్టత పెంచుకోవాలి.

వివిధ జన్యు సంబంధిత విషయాలు, రోగ చికిత్సా విధానాలను కరెంట్‌ అఫైర్స్‌తో అనుసంధానించుకుని చదవటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

జంతువుల వర్గీకరణ అనే అంశంపై ఎప్పుడో గానీ ప్రశ్నలు రావు. అందువల్ల ఈ విభాగంపై ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. కానీ స్థూల అవగాహన ఉంటే మేలు.

మానవ పునరుత్పత్తి ప్రక్రియ, మానవ శరీర నిర్మాణాలకు పరీక్ష కోణంలో ప్రాధాన్యం ఉంది. జన్యు సంబంధిత విషయాలతోపాటు మానవ శరీర నాడీ వ్యవస్థ, వివిధ శరీర అంతర్భాగాలు, బాహ్య అంతఃస్రావ గ్రంథులు మొదలైనవాటికి సంబంధించిన పరిజ్ఞానంలో సాధారణ పరిభాషలో పట్టు సాధించినా చాలు.

మానవ శరీర పోషణ అంశాలపై దాదాపుగా ప్రతి పరీక్షలోనూ ప్రశ్నలుంటాయి. మానవ జీవ ప్రక్రియలకు మద్దతునిచ్చే విటమిన్లు, ఖనిజాలు మొదలైనవాటిపై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి.

మానవుని జీర్ణ వ్యవస్థ పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు ప్రధాన వనరు అని చెప్పవచ్చు. ఏ ఆహార పదార్థాలు ఏయే శారీరక అంతర్భాగాల ద్వారా జీర్ణమవుతాయో స్పష్టమైన అవగాహన ఉండాలి. వివిధ దశల్లో జీర్ణమయ్యే ఆహారానికి మద్దతిచ్చే వివిధ రకాలైన ఎంజైమ్‌లు, వివిధ దశల్లో జీర్ణం తర్వాత వచ్చే ఉప ఉత్పత్తులు -వాటికి శరీర భాగాలతో ఉండే అనుసంధానం- ప్రశ్నలుగా వస్తాయి.

మానవ రక్తప్రసరణ విధానం, రక్త విశ్లేషణ.. వీటికి పోటీ పరీక్షల కోణంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది.

మానవ శారీరక అంగాలైన మెదడు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల గురించి కొంత లోతుగా చదవాలి. తద్వారా తప్పనిసరిగా వచ్చే కొన్ని ప్రశ్నలు సులభంగా ఎదుర్కోవచ్చు.

మానవుని శ్వాస ప్రక్రియపైనా తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. పాఠశాల స్థాయి పుస్తక సమాచారం సరిపోతుంది. ఈ చాప్టర్లో భాగంగానే ఊపిరితిత్తుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుని ఉండాలి.

మానవుని గుండె నిర్మాణం, దాని ప్రక్రియల గురించి స్థూల అవగాహన అవసరం.

జ్ఞానేంద్రియ వ్యవస్థపై తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం గురించి ఈ చాప్టర్లో లోతుగా అధ్యయనం చేయాలి .

మానవ విసర్జక వ్యవస్థపై సాధారణ స్థాయి సమాచారంతో ప్రశ్నలు వస్తున్నాయి.


ఇవి ఉపయోగపడతాయి

ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ పాఠశాల పుస్తకాలు.
కొన్ని టాపిక్స్‌కు టెన్‌ ప్లస్‌ టు స్థాయి పుస్తకాలు.
వృక్షశాస్త్ర సంబంధిత వర్తమానాంశాల కోసం కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాలు


వృక్ష శాస్త్ర అంశాలు

పాఠశాల స్థాయి వృక్ష శాస్త్ర సంబంధిత సమాచారం పోటీ పరీక్షలకు దాదాపుగా సరిపోతుంది.

వృక్షాల్లోని వివిధ రకాల గురించి అడిగే ప్రశ్నలు చాలా తక్కువ. అందువల్ల సైద్ధాంతికంగా వృక్ష శాస్త్ర వర్గీకరణకు అధిక సమయం కేటాయించవద్దు.

వృక్ష మానవ పరస్పర ఆధారిత వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి.

వివిధ రకాలైన వృక్ష ఉత్పత్తులు మానవులకు ఆహార, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో స్పష్టత ఉండాలి.

పర్యావరణ పరిరక్షణలో వృక్షాల భాగస్వామ్యంపై 10+2 స్థాయి సమాచార అవగాహన అవసరం.

బయో ఇంధనాలు, వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు పరిశోధనలు, పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్న కొత్త వంగడాలు, ప్రక్రియలు, విధానాలపైనా ప్రశ్నలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని