పరిశ్రమకు తయారవుదాం..

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో నిపుణులైన యువత అవసరం ఎప్పుడూ ఉంటుంది. టూల్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో అటువంటి నిష్ణాతులను తయారుచేసేందుకు హైదరాబాద్‌ నగరంలోని ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌)

Updated : 25 Jul 2022 19:40 IST

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో నిపుణులైన యువత అవసరం ఎప్పుడూ ఉంటుంది. టూల్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో అటువంటి నిష్ణాతులను తయారుచేసేందుకు హైదరాబాద్‌ నగరంలోని ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) కృషి చేస్తోంది. ఇందులో ఉన్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో చేరడం ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలోనే  స్థిరపడవచ్చు.విద్యాసంవత్సరం మొదలుకానున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మనదేశంలో తొలిసారిగా 1968లో ఈ సంస్థను ప్రారంభించారు. ఆసియాలో టూల్‌ తయారీ, శిక్షణ సంస్థలో అతి ముఖ్యమైనదిగా సీఐటీడీను చెబుతారు. ప్రస్తుతం దీన్ని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూంగా పిలుస్తున్నారు.

* తొలుత ఇది యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) ప్రాజెక్టుగా మొదలైంది. తర్వాత ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ సహాయ సహకారాలతో నడుస్తోంది. ఆసక్తి కలిగిన యువతీయువకులకు టూల్‌ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి భవితకు దిశానిర్దేశం చేస్తోందీ సంస్థ. ఇది దేశంలో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలతో అనుసంధానమై పనిచేయడం వల్ల ఇక్కడ చదివే విద్యార్థులకు ఆ కంపెనీల్లో అసైన్‌మెంట్లు పూర్తి చేసే అవకాశం లభించడం మాత్రమేకాక, శిక్షణ అనంతరం ఉద్యోగాలూ దొరుకుతున్నాయి.

* ఇందులో ఉన్న కోర్సులను దీర్ఘకాల (లాంగ్‌టర్మ్‌), స్వల్పకాల (షార్ట్‌టర్మ్‌)గా విభజించారు. దీర్ఘకాల కోర్సుల్లో ఎంఈ, ఎంటెక్‌, పీజీ ఇన్‌ కాడ్‌ కామ్‌, పీజీ ఇన్‌ టూల్‌ డిజైన్‌, పీజీ ఇన్‌ మెకట్రానిక్స్‌, డిప్ల్లొమా ఇన్‌ టూల్‌ డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌, పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌, పీజీ ఇన్‌ డిజైన్‌ ఫర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ తదితరాలు ఉన్నాయి.

* స్వల్ప కాల వ్యవధితో టూల్‌ డిజైన్‌, క్యాడ్‌ కామ్‌ సీఏఈ, త్రీడీ ప్రింటింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో 38 కోర్సులు అందిస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌లో 19 కోర్సులు, మెకట్రానిక్స్‌లో 8, ఇండస్ట్రీ విభాగంలో 7 కోర్సులు ఉన్నాయి. వీటిలో బ్యాచ్‌కు 20 చొప్పున సీట్లు ఉంటాయి. * వీటిలో ప్రవేశాలకు కోర్సునుబట్టి ఎప్పుటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటారు. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

అంతర్జాతీయ పత్రికలు

ఇక్కడి గ్రంథాలయంలో పరిశ్రమలో ఉపయోగించే పరికరాలకు సంబంధించి ఎన్నో అరుదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. టూల్‌ ఇంజినీరింగ్‌, ఆటోమేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టం గురించి వివిధ గ్రంథాలు ఇక్కడ లభ్యమవుతాయి. సీఐఆర్‌పీ యాన్యువల్స్‌, అమెరికన్‌ మెషినిస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ మెటీరియల్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రిసిషన్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ప్రిసిషన్‌ టూల్‌ మేకర్‌ వంటి అంతర్జాతీయ పత్రికలు ఇక్కడి విద్యార్థులు చదువుకోవచ్ఛు వీటి ద్వారా తాము నేర్చుకుంటున్న అంశాలపై వారికి లోతైన అవగాహన ఏర్పడుతుంది.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

వెనుకబడిన తరగతుల వారికి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. తరగతులతోపాటు వసతి, భోజన సౌకర్యానికి వారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులకు ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంచుకున్న కోర్సునుబట్టి ఫీజు ఉంటుంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సౌకర్యాలూ ఉన్నాయి. సంస్థలో 500 మందికి సరిపడా వసతి సదుపాయం ఉంది.

అత్యాధునిక యంత్రాలు

తమ విద్యార్థులకు అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇచ్చేలా సీఐటీడీ కృషి చేస్తోంది. వారు ఉద్యోగాల్లో చేరాక అవసరమయ్యే నైపుణ్యాలన్నీ ఈ యంత్రాల సాయంతో నేర్పిస్తోంది. మెట్రాలజీ విభాగంలో కంప్యూటరైజ్డ్‌ 3డీ కోఆర్డినేట్‌ మెజరింగ్‌ మెషీన్‌, యూనివర్సల్‌ మెజరింగ్‌ మెషీన్‌, ఆప్టికల్‌ ప్రొఫైల్‌ ప్రొజెక్టర్‌, సర్ఫేస్‌ రఫ్‌నెస్‌ మెజరింగ్‌ మెషీన్‌ వంటి అనేక అత్యాధునిక యంత్రాలున్నాయి. ఇవి విద్యార్థుల శిక్షణలో కీలక భూమిక పోషిస్తున్నాయి. అలాగే ప్రొడక్షన్‌ మెషినరీ విభాగంలో వెర్టికల్‌ మిల్లింగ్‌ మెషీన్‌, హారిజాంటల్‌ మిల్లింగ్‌ మెషీన్‌, వైర్‌ ఈడీఎం, లేథ్‌ మెషీన్‌, సిలిండ్రికల్‌ గ్రైండర్‌, 3డీ సీఎంఎం, జిగ్‌ బోరింగ్‌ మెషీన్‌, సర్ఫేస్‌ గ్రైండింగ్‌ వంటి ఆధునిక యంత్రాలతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సామ్‌సంగ్‌ ప్రత్యేక కోర్సులు

టెక్నికల్‌ అంశాలపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు సామ్‌సంగ్‌ సంస్థతో అనుసంధానమై సీఐటీడీ కొన్ని కోర్సులను అందిస్తోంది. ఇవి ఉద్యోగార్థులకే కాక, సొంతంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, సర్వీస్‌ సెంటర్లు నెలకొల్పి స్వయం ఉపాధి పొందాలనుకునే వారికీ ఉపయోగపడేలా రూపొందించారు. ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మాటీవీలు, హోమ్‌ థియేటర్‌, డీవీడీ బ్లూరే ప్లేయర్స్‌, ఫోన్స్‌, ట్యాబ్లెట్స్‌, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్ల మెకానిజంపై సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజినీరింగ్‌, కాడ్‌ కామ్‌లో మాస్టర్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నారు. సీఐటీడీలో తరగతులు విన్నాక, సామ్‌సంగ్‌ కంపెనీల్లో అనుభవపూర్వకంగా పని నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేశాక అర్హులకు తమ సంస్థలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

ఉద్యోగావకాశాలు...

ఈ శిక్షణ అనంతరం దేశంలోని ప్రముఖ సంస్థల్లో కొలువు సాధించే వీలుంది. గోద్రేజ్‌, టెల్‌కో, బీఈఎంఎల్‌, బజాజ్‌ ఆటో, హీరో, హోండా, హిందుస్థాన్‌ మోటార్స్‌, క్రాంప్టన్‌, టీవీఎస్‌ కంపెనీలు ప్రాంగణ ఎంపికల ద్వారా విద్యార్థులను తమ సంస్థల్లోకి ఆహ్వానిస్తున్నాయి.

ప్రవేశ పరీక్షలు

ఎంఈ, ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూసీఈటీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పీజీడీ ప్రవేశాలను ఐసెట్‌ స్కోరు ద్వారా నిర్వహిస్తున్నారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సీఐటీడీ నిర్వహించే ప్రవేశపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. సామ్‌సంగ్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల్లో తొలుత వచ్చిన వారికే ప్రాధాన్యం. అన్ని కోర్సులకూ ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: www.citdindia.org

ఫోన్‌ నంబర్‌: 04023771959


స్టడీ కోట్‌

వాయిదా వేసే అలవాటు సులభమైన పనులను కష్టంగా మారుస్తుంది. కష్టమైన పనులను...అసాధ్యం చేస్తుంది!

- మేసన్‌ కూలీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని