నవతరం బాలలకు నవోదయ స్వాగతం

మేటి విద్యను పొందడానికి లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతిభ ఉంటే చాలు- అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదువుకోవచ్చు.

Updated : 09 Jan 2023 06:35 IST

6 నుంచి ప్లస్‌ 2 వరకు ప్రామాణిక విద్య

మేటి విద్యను పొందడానికి లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతిభ ఉంటే చాలు- అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదువుకోవచ్చు. ఒత్తిడి లేని విద్యతోపాటు ఆట పాటలకు ఢోకా లేకుండా..వికాసానికీ ప్రాధాన్యముంటుంది. ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితంగా లభిస్తుంది. ఈ అవకాశం నవోదయ విద్యాలయాల్లో పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది!

దేశంలో తమిళనాడు తప్ప ఇంచుమించు జిల్లాకొకటి చొప్పున 649 నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఏపీలో 15 (2 కొత్తవి), తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2022-2023 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వాళ్లు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ (జేఎన్‌వీఎస్‌టీ) రాసుకోవచ్చు.

అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాలవారితోనే నింపుతారు. ఈ కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదవాలి. అలాగే మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు ఉన్నాయి. బాలబాలికలకు విడిగా వసతి సౌకర్యం కల్పిస్తారు. ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సౌకర్యాలు ఉన్నాయి.


పరీక్ష విధానం

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. విద్యార్థి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మూడు సెక్షన్ల నుంచి 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. సెక్షన్‌-1 మెంటల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు. వీటిని గంటలో పూర్తి చేయాలి. సెక్షన్‌-2 అరిథ్‌మెటిక్‌ 20 ప్రశ్నలు. వీటికి అర గంట కేటాయించారు. సెక్షన్‌-3 లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు. 30 నిమిషాల వ్యవధి. సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. బ్లాక్‌ లేదా బ్లూ పెన్ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ సూచించే గడిని సంపూర్ణంగా దిద్దాలి. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు పొందాలి.


ఎంపికైతే...

బాలికలు, ఎస్సీ, ఎస్టీలు, అల్పాదాయ వర్గాలవారు ఆరో తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం. ఎనిమిదో తరగతి వరకు బోధన మాతృ/ప్రాంతీయ భాషలోనే కొనసాగిస్తారు. అనంతరం మ్యాథ్స్‌, సైన్స్‌ ఇంగ్లిష్‌లోనూ, సోషల్‌ హిందీలోనూ బోధిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అనుసరిస్తారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్‌, ఐఐటీ - జేఈఈ.. తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పై తరగతులను ఇతర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లోనూ చదువుకోవచ్చు.


ప్రశ్నలు ఇలా..

మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలో.. చిత్రాలు, రేఖలు, బొమ్మలపై ప్రశ్నలు వస్తాయి. ఈ సెక్షన్‌లో 10 భాగాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైనది గుర్తించమనడం, ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్‌ ఇచ్చి అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరిపోతుందో పోల్చమనడం, చిత్రాలు/ బొమ్మల క్రమాన్ని ఇచ్చి తర్వాత వచ్చే దాన్ని తెలుసుకోమనడం.. ఇలా ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ పరీక్షలో అంకెలు, కసాగు, గసాభా, వడ్డీలు, దత్తాంశాలు, భిన్నాలు, లాభనష్టాలు, నాలుగంకెల్లో ఉండే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు...మొదలైన ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద ఐదేసి ప్రశ్నలు చొప్పున 4 పాసేజ్‌లుంటాయి.


అర్హత: 2022-2023 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గతంలో పూర్తిచేసుకున్నవారు అనర్హులు.

వయసు: మే 1, 2011 - ఏప్రిల్‌ 30, 2013 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 31

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 29  వెబ్‌సైట్‌: https://navodaya.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని