GeoScientist Jobs: తొలి నెల నుంచే లక్ష జీతం!

కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత విభాగాల్లో పీజీ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 26 Sep 2023 07:29 IST

కేంద్ర సంస్థల్లో జియోసైంటిస్ట్‌ కొలువులు  

కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత విభాగాల్లో పీజీ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు గ్రూప్‌ ఎ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌... తదితర విభాగాల్లో ఆకర్షణీయ వేతనంతో విధులు నిర్వర్తించవచ్చు.

జియోసైంటిస్ట్‌ పోస్టుల(Geoscientist Jobs) భర్తీకి యూపీఎస్‌సీ ఏటా ప్రకటనలు విడుదల చేస్తోంది. వీరికి లెవెల్‌-10 వేతనాలు చెల్లిస్తారు. ఉన్నత హోదాతో పాటు మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. స్టేజ్‌-1 ప్రిలిమినరీ, స్టేజ్‌-2 మెయిన్స్‌, స్టేజ్‌-3 ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టులపై గట్టి పట్టు ఉన్నవారు పరీక్షలో విజయం సాధించవచ్చు. జియో సైంటిస్ట్‌ పాత ప్రశ్నపత్రాలు,  ఆ సబ్జెక్టుల్లో నెట్‌ ప్రశ్నపత్రాలు సాధనకు బాగా ఉపయోగపడతాయి.

స్టేజ్‌-1

ప్రిలిమినరీ (స్టేజ్‌-1) ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాద్యమంలో ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌కు వంద మార్కులు. ఈ పేపర్‌ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్‌-2 దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఉంటుంది. జియాలజిస్ట్‌, హైడ్రో జియాలజిస్ట్‌ పోస్టులకు జియాలజీ/హైడ్రో జియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిసిస్ట్‌, జియోఫిజిక్స్‌ పోస్టులకు జియో ఫిజిక్స్‌ నుంచి వీటిని అడుగుతారు. కెమిస్ట్‌, కెమికల్‌ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2 సంబంధిత సబ్జెక్టులో 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1, పేపర్‌-2 ఒక్కో ప్రశ్నపత్రం వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు తగ్గిస్తారు. ప్రిలిమినరీ రెండు పేపర్లలోనూ అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం విభాగాల వారీ ఖాళీలకు 6 లేదా 7 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు అవకాశమిస్తారు.

స్టేజ్‌-2

ఇది డిస్క్రిప్టివ్‌ తరహా. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. మెయిన్స్‌లో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కూ 3 గంటల వ్యవధి. స్టేజ్‌-2లో అర్హత సాధించినవారి జాబితా నుంచి విభాగాలవారీ మొత్తం ఖాళీలకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను స్టేజ్‌-3కి ఆహ్వానిస్తారు.

స్టేజ్‌-3

ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగినవారా లేదా గమనిస్తారు. నాయకత్వ లక్షణాలతోపాటు ఇతర సామర్థ్యాలను అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు అన్ని దశల్లోనూ సాధించిన మొత్తం మార్కుల  ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు.


ముఖ్య సమాచారం

మొత్తం ఖాళీలు: 56. (కేటగిరీ 1 జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో.. 34 జియాలజిస్ట్‌, 1 జియోఫిజిసిస్ట్‌, 13 కెమిస్ట్‌ పోస్టులు, కేటగిరీ 2 సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో.. 4 హైడ్రో జియాలజిస్టు, 2 కెమికల్‌, 2 జియో ఫిజిక్స్‌ పోస్టులు)

అర్హత: జియాలజిస్ట్‌ పోస్టులకు పీజీలో జియాలజీ /అప్లయిడ్‌ జియాలజీ/ ఇంజినీరింగ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ ఎర్త్‌ సైన్స్‌/ ఓషనోగ్రఫీ/ జియోకెమిస్ట్రీ...తదితర కోర్సులు చదువుకున్నవారు అర్హులు. కెమిస్ట్‌, కెమికల్‌ పోస్టులకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఎనలిటికల్‌ కెమిస్ట్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హైడ్రో జియాలజీ ఖాళీలకు పీజీలో జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ హైడ్రో జియాలజీ చదివినవారు అర్హులు. జియో ఫిజిక్స్‌, జియో ఫిజిసిస్ట్‌ పోస్టులకు ఎమ్మెస్సీ అప్లయిడ్‌ ఫిజిక్స్‌/ జియో ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ జియో  ఫిజిక్స్‌/ మెరైన్‌ జియోఫిజిక్స్‌ కోర్సులవారు అర్హులు.  

వయసు: జనవరి 1, 2024 నాటికి గరిష్ఠంగా 32 ఏళ్లు మించరాదు. అంటే జనవరి 2, 1992 - జనవరి 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10   (సాయంత్రం 6 గంటల వరకు).

ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రుసుము చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18

మెయిన్‌ పరీక్ష: జూన్‌ 22న

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని