సీయూఈటీ రాస్తున్నారా?

దేశంలో సాధారణ యూజీ, పీజీ కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎంతో పేరున్న సంస్థలు. ఈ సంస్థలన్నీ యూజీ స్థాయిలోనే పలు కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే సీయూఈటీ-యూజీ రాయాలి. ఇలా అవకాశం వచ్చినవారు విశ్వవిద్యాలయాల్లో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు చదువుకోవచ్చు.

Updated : 04 Mar 2024 03:17 IST

కేంద్రీయ సంస్థల్లో యూజీ కోర్సులు

దేశంలో సాధారణ యూజీ, పీజీ కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎంతో పేరున్న సంస్థలు. ఈ సంస్థలన్నీ యూజీ స్థాయిలోనే పలు కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే సీయూఈటీ-యూజీ రాయాలి. ఇలా అవకాశం వచ్చినవారు విశ్వవిద్యాలయాల్లో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు చదువుకోవచ్చు. మేటి విద్య, వసతి, సౌకర్యాలు అందుకోవచ్చు. ఇటీవలే వెలువడిన సీయూఈటీ (యూజీ)- 2024 ప్రకటన వివరాలు..  

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అందిస్తోన్న బీఏ, బీఎస్సీ, బీకాం, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ/ఎమ్మెస్సీ, బీఎస్సీఎడ్‌, బీఏఎడ్‌, బీబీఏ, బీబీఎం... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్ట్‌ యూజీ (సీయూఈటీ) స్కోరు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షను గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్లో రాసుకోవచ్చు. అయితే ఏ కోర్సుల్లో చేరాలో నిర్ణయించుకుని, వాటికి సంబంధించిన సబ్జెక్టుల్లో రాయడమే శ్రేయస్కరం. దీని వల్ల సన్నద్ధత ఆ సబ్జెక్టులపై ఎక్కువగా ఉండి, మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా మేటి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు పొందడానికి మార్గం సులువవుతుంది.

పరీక్ష ఇలా..

పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌, కంప్యూటర్‌ బేస్డ్‌ విధానాల్లో నిర్వహిస్తారు. పోటీ పడుతోన్న అభ్యర్థుల సంఖ్య ప్రకారం ఏ విధానంలో నిర్వహించాలో నిర్ణయిస్తారు.  ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. పరీక్ష నచ్చిన మాధ్యమంలో రాసుకోవచ్చు. తెలుగుతో సహా 13 భాషల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. 61 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో 33 లాంగ్వేజ్‌లు, 27 డొమైన్‌ స్పెసిఫిక్‌, ఒకటి జనరల్‌ టెస్టు. వీటిలో అభ్యర్థులు గరిష్ఠంగా 6 టెస్టు పేపర్లు ఎంచుకోవచ్చు. అయితే వీటిలో కనీసం ఒకటైనా లాంగ్వేజ్‌ పేపర్‌ ఉండాలి.

సెక్షన్‌-1: ఇందులో ఏ, బీ విభాగాలుంటాయి. ఈ రెండూ భాషలకు చెందినవే.

1ఏ: 13 భాషల నుంచి ఏదైనా నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌ ఇందులో ఉంటుంది. ఎంచుకున్న భాషలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 40కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. ఇంగ్లిష్‌, హిందీ, అసోమీస్‌, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి.

1బీ: 20 భాషల నుంచి నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఇవన్నీ విదేశీ భాషలే. ఆ భాషకు సంబంధించి 50 ప్రశ్నలకు గానూ 40కి సమాధానం రాస్తే సరిపోతుంది. అరబిక్‌, బోడో, చైనీస్‌, డోగ్రీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, పర్షియన్‌, రష్యన్‌, సంతాలీ, సింధీ, స్పానిష్‌, టిబెటన్‌, సంస్కృతం (వీటిలో ఏదైనా భాషను యూజీలో చదవాలనుకుంటే ఆ భాషకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి).

సెక్షన్‌-2: ఇక్కడ 27 సబ్జెక్టుల నుంచి ఏదైనా నచ్చినవి ఎంచుకోవాలి. ఆ విభాగంలో 50 ప్రశ్నలకు 40కి సమాధానాలు గుర్తించాలి.

సబ్జెక్టులివీ: అకౌంటెన్సీ/బుక్‌ కీపింగ్‌, అగ్రికల్చర్‌, ఆంత్రోపాలజీ, బయాలజీ/బయలాజికల్‌ స్టడీస్‌/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ, బిజినెస్‌ స్టడీస్‌, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైన్‌ ఆర్ట్స్‌/విజువల్‌ ఆర్ట్స్‌(స్కల్ప్‌చర్‌/పెయింటింగ్‌)/కమర్షియల్‌ ఆర్ట్‌, జాగ్రఫీ/జియాలజీ, హిస్టరీ, హోమ్‌ సైన్స్‌, నాలెడ్జ్‌ ట్రెడిషన్‌-ప్రాక్టీసెస్‌ ఇండియా, లీగల్‌ స్టడీస్‌, మాస్‌ మీడియా/మాస్‌ కమ్యూనికేషన్‌, మ్యాథమెటిక్స్‌/అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ఎన్‌సీసీ/యోగా, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, సంస్కృతం, సోషియాలజీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌. (వీటిలో యూజీలో చదవాలనుకుంటున్న సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలి)

జనరల్‌ టెస్ట్ట్‌: ఒకేషనల్‌/ఓపెన్‌ ఎలిజిబిలిటీ/క్రాస్‌ స్ట్రీమ్‌/ ఏవైనా ఇతర కోర్సుల్లో చేరడానికి దీన్ని రాయాలి. 60 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 50కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది.
ప్రవేశం పొందాలనుకుంటున్న కోర్సు/ విశ్వవిద్యాలయం అనుసరించి పరీక్ష రాయడానికి సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఒక్కో సబ్జెక్టు/విభాగం వారీ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. మ్యాథ్స్‌/ అప్లయిడ్‌ మ్యాథ్స్‌, అకౌంటెన్సీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, జనరల్‌ టెస్టులకు పరీక్ష వ్యవధి గంట.

ప్రశ్నలు ఏ అంశాల్లో?

లాంగ్వేజ్‌లు: రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ ప్రశ్నలు ఉంటాయి.

సబ్జెక్టు: ఎంచుకున్న సబ్జెక్టులో 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌: జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ (గణితంలోని ప్రాథమికాంశాల అనువర్తనంపై ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌/ ఆల్జీబ్రా జాబెట్రీ/ మెన్సురేషన్‌/ స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో), లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి అడుగుతారు.

సన్నద్ధత

  • ఏ సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని సిలబస్‌ గమనించాలి. వెబ్‌సైట్‌లో సబ్జెక్టులవారీ వివరాలు పొందుపరిచారు.  
  • సిలబస్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. పాఠాలు/ఛాప్టర్ల వారీ చివరలో ఉన్న ముఖ్యాంశాలను బాగా చదవాలి.  
  • గతంలో నిర్వహించిన సీయూఈటీ-యూజీ ప్రశ్నపత్రాలు గమనించాలి. ప్రశ్నల తీరు, స్థాయి పరిశీలించాలి. అధిక ప్రాధాన్యమిస్తున్న అంశాలను బాగా చదవాలి.
  • ప్రతి సబ్జెక్టులోనూ ఛాప్టర్ల వారీగా వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • పరీక్షకు ముందు ఆరేడు నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసి ఫలితాలను విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

హెచ్‌సీయూలో..

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను వివిధ విభాగాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అందిస్తున్నారు. వీటిలో ప్రవేశం సీయూఈటీ-యూజీతో లభిస్తుంది. సంస్థ ప్రకటన వెలువరించినప్పుడు సీయూఈటీ స్కోరుతో దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ. వీటిలో అప్లయిడ్‌ జియాలజీలో 10, బయాలజీలో 48, ఫిజిక్స్‌లో 40, కెమికల్‌ సైన్సెస్‌లో 30, చొప్పున సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు, చివరి ఏడాది పరీక్షలకు సిద్ధమవుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీలో 20 సీట్లకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా పోటీ పడవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్‌): తెలుగు 19, హిందీ 20, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ 19, ఉర్దూ 14 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్‌ ఏ గ్రూప్‌లోనైనా 60 శాతం మార్కులుండాలి. ఇంటర్‌లో తెలుగు/హిందీ/ ఉర్దూ చదివివుండడం తప్పనిసరి.

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌ 14, హిస్టరీ 13, పొలిటికల్‌ సైన్స్‌ 13, సోషియాలజీ 14, ఆంత్రోపాలజీ 13 సీట్లు ఉన్నాయి. ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ విధానంలో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తోంది. కోర్సు వ్యవధి ఆరేళ్లు. 28 సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.

నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 26 వరకు.

పరీక్షలు: మే 15 నుంచి మే 31 వరకు రోజూ షిఫ్ట్‌ల వారీ.

ఫీజు: జనరల్‌..3 సబ్జెక్టులకు రూ.750, అదనంగా ఒక్కో పేపర్‌కూ రూ.400. ఓబీసీ ఎన్‌సీఎల్‌, ఈడబ్ల్యుఎస్‌ 3 సబ్జెక్టులైతే రూ.900, ఒక్కో అదనపు పేపర్‌కూ రూ.375. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్‌ 3 సబ్జెక్టులకు రూ.800. అదనంగా ఒక్కో పేపర్‌కూ రూ.350).
వెబ్‌సైట్‌:https://cuet.samarth.ac.in/

ప్రవేశం ఈ సంస్థల్లో..

సీయూఈటీ యూజీలో చూపిన ప్రతిభతో..యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, అలీఘర్‌ ముస్లిం, అస్సాం, బాబా సాహెబ్‌ భీమ్‌రావు అంబేడ్కర్‌, బెనారస్‌ హిందూ, సెంట్రల్‌ శాంస్క్రీట్‌, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌, గురు ఘాసిదాస్‌, హేమవతి నందన్‌ బహుగుణ గర్వాల్‌, ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ అంతర్‌ రాష్ట్రీయ హిందీ, మహాత్మా గాంధీ సెంట్రల్‌, మణిపూర్‌, మౌలానా అజాద్‌ ఉర్దూ, మిజోరాం, నేషనల్‌ శాంస్క్రీట్‌, నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌, పాండిచ్చేరి, రాజీవ్‌ గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి శాంస్క్రీట్‌, సిక్కిం, తేజ్‌పూర్‌, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌, త్రిపుర, అలహాబాద్‌, దిల్లీ, విశ్వభారతి, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, జార్ఖండ్‌, కర్ణాటక, కశ్మీర్‌, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌, సౌత్‌ బిహార్‌, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు.

ఇవే కాకుండా పలు రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, డీమ్డ్‌, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని