సాధారణ డిగ్రీతోనూ ఉద్యోగం సాధ్యమే!

సాధారణ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నా... మైనర్‌ సబ్జెక్టులుగా మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న కోర్సులు చేయటం మంచిది. ఇలాంటి విద్యార్థులు తమ డొమైన్‌లో పటిష్ఠంగా ఉండటంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ను కూడా అలవర్చుకుంటే వారి ఉద్యోగ సాధన సులభతరమవుతుంది! 

Published : 06 Mar 2024 00:17 IST

జాబ్‌ స్కిల్స్‌ - 2024

సాధారణ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నా... మైనర్‌ సబ్జెక్టులుగా మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న కోర్సులు చేయటం మంచిది. ఇలాంటి విద్యార్థులు తమ డొమైన్‌లో పటిష్ఠంగా ఉండటంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ను కూడా అలవర్చుకుంటే వారి ఉద్యోగ సాధన సులభతరమవుతుంది! 

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా చదవాలనుకుంటున్న అభ్యర్థి.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని మైనర్‌ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. బీకాం. విద్యార్థి కామర్స్‌ సబ్జెక్టును మేజర్‌గానూ, మైనర్‌ సబ్జెక్టుగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌/ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌లను తీసుకోవచ్చు. ఇలా చేయడ[ం వల్ల కంపెనీలకు కావలసిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉన్నట్టే! 

ది ఎంత గొప్పదైనా పరవళ్లు తొక్కుతూ ప్రవహించి కడలిలో కలవాల్సిందే. సముద్రంలో కలిసేందుకు నది తన గమనాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. దట్టమైన అడవులను దాటుకుంటూ, కఠినమైన పర్వతాలను కోసుకుంటూ పరుగెడుతుంది. నిర్మలమైన మైదానాల్లో నెమ్మదిగా సాగుతుంది. గమన మార్గం ఏదైనా గమ్యం మాత్రం సాగర సంగమమే.  
సరిగ్గా, ఇలాగే.. చదివేది ఏ కోర్సు అయినా చివరికి చేరాల్సింది నచ్చిన ఉద్యోగంలోనే. ఇంజినీరింగ్‌, సైన్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌... ఇలా స్ట్రీమ్‌ ఏదైనా చేరాల్సింది మంచి కొలువులోనే. అయితే ఉద్యోగ సాధనకు వట్టి డిగ్రీ పట్టానే పట్టుకు వేలాడే రోజులు పోయాయి. ఆ డిగ్రీలో మూడేళ్లపాటో, నాలుగేళ్లపాటో నేర్చుకున్న నైపుణ్యాలు మాత్రమే కాదు కావాల్సింది. అలవర్చుకున్న వ్యక్తిత్వ లక్షణాలే ఉద్యోగ తీరానికి చేర్చే నావలు! 

మార్కెట్‌ని బట్టి మారుతున్న కోర్సులు 

పాఠ్యాంశాల (కరిక్యులం) విషయంలో విశ్వవిద్యాలయాలకు నియంత్రణ సంస్థలు స్వేచ్ఛను ఇవ్వడంతో మార్కెట్‌కు ఏం కావాలో, ఎలాంటి కోర్సులు అవసరమో గుర్తించి యూనివర్సిటీలు వాటికే రూపకల్పన చేస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు తరచూ తమ ప్రాంగణాలకు వచ్చి నచ్చిన విద్యార్థులను ఎంపిక చేసుకుంటుండటాన్ని పరిశీలించిన విశ్వవిద్యాలయాలు కంపెనీలకు కావలసిన నైపుణ్యాలనే కోర్సుల కింద ఆఫర్‌ చేస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులతో క్యాంపస్‌ అధిపతులు తరచూ కలుస్తుండటం వల్ల ఈ మార్చు సాధ్యమైంది. గతంలో  పరిస్థితికి ఇది భిన్నం. కొన్ని దశాబ్దాల కిందటివరకూ కంపెనీలు కళాశాల/ విశ్వవిద్యాలయ ప్రాంగణాలను సందర్శించే ఆనవాయితీ ఉండేది కాదు. పట్టా పుచ్చుకున్న విద్యార్థే ఉద్యోగాన్ని అన్వేషిస్తూ కంపెనీల చుట్టూ తిరిగేవాడు. అప్పుడు కంపెనీల అవసరాలు విద్యాలయాల్లో పాఠ్యాంశ నిర్ణేతలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. సంప్రదాయ విధానంలో విద్యాలయాలు చదువులు చెప్పేవి. కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలున్న యువతీ యువకుల కోసం జల్లెడ పడుతుండేవి. 

ఏం కావాలో అవే 

మారిన సన్నివేశంలో... విద్యార్థికి భవిష్యత్తులో అతడు ఆశించే ఉద్యోగానికి ఏం కావాలో, ఎటువంటి నైపుణ్యాలు అవసరమో సరిగ్గా వాటినే పాఠ్యాంశాలుగా మేళవించి కోర్సులుగా అందిస్తున్నారు. విద్యార్థికి ఇదొక సదవకాశం. ఈ సందర్భంలో నూతన విద్యావిధానాన్ని అనుసరించి డిగ్రీలో ప్రవేశపెడుతున్న మేజర్‌ సబ్జెక్టు, మైనర్‌ సబ్జెక్టులు విద్యార్థికి కలిసొచ్చే విషయం.  
బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా చదవాలనుకుంటున్న అభ్యర్థి.. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని మైనర్‌ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. అలాగే బి.కాం. చేయాలనుకుంటున్న విద్యార్థి కామర్స్‌ సబ్జెక్టును మేజర్‌గానూ, మైనర్‌ సబ్జెక్టుగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌/ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌లను తీసుకోవచ్చు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంటోంది. అభ్యర్థి తాను ప్రధానంగా చదవాలనుకుంటున్న కోర్సును వదిలిపెట్టకుండానే తక్షణ నైపుణ్యాలిచ్చి కంపెనీల దృష్టిలో పడేందుకు అవకాశమున్న టెక్నాలజీలను మైనర్‌ సబ్జెక్టులుగా అధ్యయనం చేసే వీలుండటం. ఇలా డిగ్రీని ప్రతి ప్రధాన సబ్జెక్టుతో మార్కెట్‌లో డిమాండ్‌ గల  టెక్నాలజీ లేదా సబ్జెక్టులను మైనర్‌ సబ్జెక్టులుగా నేర్చుకోవడం వల్ల కంపెనీలకు కావలసిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉన్నట్టే. 

కామర్స్‌, సైన్స్‌ గ్రాడ్యుయేట్లకూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 

ప్రాంగణ నియామకాల్లో కేవలం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లనే కాదు, నాన్‌-ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లనూ ఐ.టి., కార్పొరేట్‌ కంపెనీలు ఇటీవలికాలంలో భారీగా రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. సైన్స్‌, కామర్స్‌ గ్రాడ్యుయేట్ల పట్ల కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఎంబీఏలనే కాదు, బీబీఏ చదివిన గ్రాడ్యుయేట్లనూ కంపెనీలు సెలెక్ట్‌ చేసుకుంటున్నాయి. అయితే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో పరిశీలించిన నైపుణ్యాలనే బీబీఏ విద్యార్థుల్లోనూ పరీక్షిస్తున్నారు. 

డొమైన్‌ నాలెడ్జ్‌

బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఉద్యోగార్థి ఆ సబ్జెక్టులో ఎంత బలంగా ఉన్నాడో కంపెనీలు పరిశీలిస్తున్నాయి. అయితే పూర్తిగా పాఠ్యాంశాలకే పరిమితమైన బుక్కిష్‌ నాలెడ్జ్‌ ఉద్దండులకు కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కంపెనీలకు కావలసింది ఫంక్షనల్‌ నాలెడ్జ్‌. అంటే పుస్తక పరిజ్ఞానాన్ని అభ్యర్థి బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసుకుంటున్నాడా? లేదా? అని పరిశీలిస్తున్నారు. 

ఉదాహరణకు మార్కెటింగ్‌ ప్రత్యేక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థికి మార్కెట్‌పై కనీస అవగాహన ఉండాలి. మార్కెట్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని కంపెనీలు భావిస్తాయి. ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌లో మెజారిటీ మార్కెట్‌ వాటా కలిగిన గ్లో అండ్‌ లవ్లీ బ్రాండ్‌ గత పేరు ఏమిటి? ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఉత్పన్నమైన వివాదం ఏమిటి? అన్న విషయాలపై అవగాహన ఉండాలని రిక్రూటర్లు భావిస్తారు. దీనిపై ప్రశ్న అడిగినప్పుడు నాటి ఫెయిర్‌ అండ్‌ లవ్లీ నేటి గ్లో అండ్‌ లవ్లీగా మారడం వెనుకున్న పరిణామాలు చెప్పగలిగితే కంపెనీ ప్రతినిధులు ప్రసన్నులవుతారు. 

ఆయుర్వేద బెషధాల్లో మంచి పేరున్న డాబర్‌ పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రశ్నించినప్పుడు పశ్చిమ్‌ బెంగాల్‌లో పేదలకు ఆయుర్వేద బెషధాలు ఇవ్వడం నుంచి మొదలైన డాబర్‌ వేలకోట్ల అమ్మకాలకు చేరిందని ఉద్యోగార్థి చెప్పగలిగితే కంపెనీ ప్రతినిధులు సంతృప్తి చెందుతారు. 

హెచ్‌.ఆర్‌. స్పెషలైజేషన్‌తో ఇంటర్వ్యూకి హాజరైన ఉద్యోగార్థి నుంచి ప్రభుత్వ, పైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగుల సంక్షేమ విధానాలను రిక్రూటర్లు తెలుసుకోవాలనుకుంటారు. వీటిపై కనీస అవగాహన ఉంటేనే యాజమాన్యానికీ, ఉద్యోగులకూ మధ్య వారథిగా నిలువగలుగుతారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగుల సామర్థ్యం, పనితీరు, పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఉద్యోగి సృష్టిస్తున్న సగటు ఆదాయం లెక్కించడం వంటి మౌలిక విషయాలపై తగిన పరిజ్ఞానం ఉన్నదా అని పరిశీలిస్తారు. 

కేస్‌ స్టడీస్‌పై పోటీలు 

బి.బి.ఎ., ఎం.బి.ఎ. వంటి కోర్సులు చేసి కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నవారు వివిధ రౌండ్ల ఎంపిక ప్రక్రియల్లో ఏదో ఒక దశలో కేస్‌ స్టడీస్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ముందుగా వీటిపై అవగాహన పెంచుకొని సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

టి.సి.ఎస్‌., ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలు బిజినెస్‌ అడ్మినిస్ట్ర్టేషన్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకోసం కేస్‌ స్ట్టడీస్‌పై కాంపిటిషన్లు నిర్వహిస్తుంటాయి. ఈ పోటీల్లో ఐ.ఐ.ఎం.ల నుంచి సాధారణ కాలేజీల వరకు విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు పాల్గొంటారు. ఇటువంటి పోటీల్లో పాల్గొంటే ఉద్యోగార్థికి రెండు సౌలభ్యాలున్నాయి. మొదటిది- పోటీకి తమ డొమైన్‌లో ఎటువంటి కేస్‌ స్టడీస్‌ ముఖ్యమో తెలుస్తుంది. వేటిపై అవగాహన పెంచుకోవాలో అర్థం అవుతుంది. రెండోది- ఈ పోటీల్లో ముందు వరుసలో నిలిస్తే నేరుగా కంపెనీల నుంచే జాబ్‌ ఆఫర్లు వస్తాయి. ఫలితంగా ప్రైజ్‌ మనీ, ఉద్యోగం రెండూ సాధించవచ్చు.  


సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా..

ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌ సబ్జెక్టులు వేరువేరు పంథాలో ఉండవచ్చు. నేర్చుకునే విధానం వేరుగా ఉండవచ్చు. పరీక్షించే పద్ధతి భిన్నంగా ఉండవచ్చు. కానీ, ఏ తరహా విద్యానేపథ్యం గల ఉద్యోగార్థి అయినా మంచి ఉద్యోగిగా సేవలందివ్వాలని కంపెనీలు కోరుకుంటాయి. అందువల్ల ఎంపిక సమయంలోనే వారి డొమైన్‌ నాలెడ్జ్డ్‌తో పాటు సాధారణ ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో, లేవో పరిశీలిస్తారు.

భావ వ్యక్తీకరణ: మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆధారిత పోస్టులు ఆశించేవారు భావ వ్యక్తీకరణలో బలంగా ఉండాలి. 5 పాయింట్లకు ఇంటర్‌వ్యూ నిర్వహిస్తే 5 పాయింట్లూ సాధించగలగాలి. అదే ఇంజినీరింగ్‌ విద్యార్థి అయితే 5 పాయింట్లకు 3.5 లేదా 3 పాయింట్లు వచ్చినా కంపెనీలు సర్దుకుపోతాయి. ఉద్యోగ పత్రం ఇచ్చేస్తాయి. కానీ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అభ్యర్థులు మాత్రం భావ వ్యక్తీకరణలో నూటికి నూరు మార్ములు తెచ్చుకోవలసిందే. 

నేర్చుకోవాలన్న జిజ్ఞాస: కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన ఉన్న అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ లక్షణం ఉంటే సంస్థలు తమకు కావలసిన టెక్నాలజీ అయినా, మరే విషయమైనా నేర్పించగలుగుతాయి.

త్వరగా కలసిపోయే తత్వం: కొత్తగా కంపెనీలోకి ప్రవేశించిన ఉద్యోగి తక్కువ సమయంలో మిగతావారితో కలిసి పోయి, కొత్త వాతావరణం, కంపెనీ పద్ధతుల్లోకి ఇమిడిపోయేలా ఉండాలని యాజమాన్యం కోరుకుంటుంది. ఈ నైపుణ్యాన్నీ ఎంపిక సమయంలో పరోక్షంగా పరిశీలిస్తారు. 

భిన్నమైన దృష్టికోణం: విభిన్నంగా, కొత్తగా ఆలోచించగలిగే ఉద్యోగులే కంపెనీలకు సంపద. అందరిలో ఒకరిగా, గుంపులో గోవింద తీరులో ఉన్నవారిని కంపెనీలు ప్రోత్సహించవు. ప్రతి విషయాన్ని కొత్తకోణంలో చూసి, ఆలోచించగలిగే నైపుణ్యం అలవర్చుకుంటే అది అభ్యర్థికి ఆలంబనే అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు