పట్టు వీడకుండా ప్రయత్నించా!

ఒకటి కాదు రెండు కాదు, ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం. పగలూ రాత్రీ తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ. అనుకోని వైఫల్యాలు, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునేసరికే ఏటికేడాది తరిగిపోయే సమయం.

Published : 12 Mar 2024 00:08 IST

మూడు సర్కారీ కొలువులు సాధించిన భవ్య

ఒకటి కాదు రెండు కాదు, ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం. పగలూ రాత్రీ తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ. అనుకోని వైఫల్యాలు, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునేసరికే ఏటికేడాది తరిగిపోయే సమయం. అయినా అలుపెరగని కృషితో కోరుకున్న కొలువు సాధించారు   గుంటూరుకు చెందిన వట్టికూటి భవ్య. సివిల్స్‌ ఆరో ప్రయత్నంలో ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌)కు ఎంపికయ్యారు. లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ఆమె.. వాటిని మనతో పంచుకుంటున్నారిలా..

మాది గుంటూరు జిల్లా పొన్నూరు. ఇంటర్‌లో 982 మార్కులు రావడంతో విజ్ఞాన్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ ఫ్రీ సీటు దొరికింది. ఏటా మంచి మార్కులు సంపాదిస్తూ ఆ కోర్సు పూర్తి చేశాను. అయితే పేరుకు కంప్యూటర్‌ సైన్స్‌ చదివినా, చిన్నప్పటి నుంచి నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచన ఉండేది. అందువల్ల ప్రాంగణ ఎంపికల్లో టీసీఎస్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా చేరలేదు. సివిల్స్‌ రాయాలనే ఆలోచనతో దిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. ఆర్ట్స్‌ సబ్జెక్టులు తెలియకపోవడం, పోటీ పరీక్షలకు కొత్త కావడంతో ఏడాదిపాటు అక్కడే తరగతులకు హాజరయ్యాను. 2016లో కోచింగ్‌ మొదలుపెట్టి వరుసగా పరీక్షలు రాశాను.
మొదటిసారి ప్రిలిమ్స్‌ కూడా పాసవ్వలేదు. 2018లో చేసిన ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను, కానీ 6 మార్కులతో సర్వీస్‌ రాలేదు. మళ్లీ 3, 4, 5 ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ క్లియర్‌ అయినా, మెయిన్స్‌ పాసవ్వకపోవడంతో ఇంటర్వ్యూ అవకాశం లేకపోయింది. అదే సమయంలో రాష్ట్ర సర్వీసులు కూడా రాయాలనే ఆలోచన కలిగింది. 2022 గ్రూప్‌-1 ఫలితాల్లో ఎంపీడీవోగా ఉద్యోగం లభించింది. అందులో చేరాక సివిల్స్‌ ఆఖరి ప్రయత్నంగా రాశాను. ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా మొదటి జాబితాలో ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. అది ఉత్తీర్ణురాలిని కావడంతో ఆ ఉద్యోగం లభించింది. దీంతో ఎంపీడీవో పోస్టుకు రాజీనామా చేసి దిల్లీ వెళ్లి ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత వచ్చిన సివిల్స్‌ రిజర్వ్‌ జాబితాలో నా పేరు ఉండటంతోపాటు ఐఆర్‌ఎంఎస్‌ సర్వీసుకు ఎంపికయ్యాను.
అలా ఇన్నేళ్ల ప్రయత్నం తర్వాత వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి!  

అంత సులువేమీ కాదు..

అయితే ఇదేమీ అంత సులభంగా జరిగిపోలేదు. మా నాన్న లాయర్‌, అమ్మ గృహిణి. చెల్లి కూడా నాన్న బాటలోనే లా చదువును ఎంచుకుంది. కానీ నేను మాత్రం ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తితో ఇటుగా వచ్చాను. అకడమిక్‌గా చిన్నప్పటి నుంచి అంత మంచి మార్కులు ఉన్న నేను పోటీ పరీక్షల్లో నాలుగేళ్లు వరుసగా వైఫల్యాలు ఎందుకు చూశానో అర్థం అయ్యేది కాదు. చెప్పేవారు కూడా ఎవరూ లేకపోవడంతో ప్రతి పరీక్ష తర్వాత నాకు నేనే సమీక్ష చేసుకుంటూ, ఎక్కడ వెనకపడ్డానో తెలుసుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ చదివా. బహుశా దీనికే అంత సమయం పట్టి ఉండొచ్చు. కానీ అది మాత్రం చాలా ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ. ప్రతిసారీ పరీక్ష ఫెయిల్‌ అయినప్పుడు ఆ బాధను మాటల్లో చెప్పలేం. కానీ వీలైనంత త్వరగా దాన్నుంచి బయటకు వచ్చి మళ్లీ చదువులో పడ్డాను. ఒక్కోసారి మనకు బాధపడే సమయం కూడా ఉండదు. పరీక్ష పోయిన పదిరోజుల కల్లా మరో నోటిఫికేషన్‌ వచ్చేది. వెంటనే సన్నద్ధత మొదలవ్వాలి. అందువల్ల మానసికంగా చాలా బలంగా ప్రయత్నించాలి.

ఉపయోగపడిన శిక్షణ

కోచింగ్‌ అందరికీ తప్పనిసరి అని చెప్పను, కానీ నాకు పరీక్ష గురించి పూర్తిస్థాయి అవగాహన రావడానికి ఇది సహాయపడింది. మొదటి పదినెలల తర్వాత సొంతంగా చదువుకున్నాను. మొత్తం పాఠ్యపుస్తకాలు చదివాను, షార్ట్‌ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నాను. ప్రతిరోజూ కరెంట్‌ అఫైర్స్‌ చూస్తూ వాటిని సబ్జెక్టుకు అనుసంధానం చేసుకుని చదివేదాన్ని. ఏ ఇంటర్వ్యూ ముందైనా మాక్‌ ఇంటర్వ్యూలకు వెళ్లేదాన్ని. అలా దాదాపు 15 ఇంటర్వ్యూలు చేసి ఉంటా. అక్కడి వారు చెప్పే రివ్యూ నన్ను నేను సరిచేసుకోవడంలో బాగా సహాయపడింది.
కొవిడ్‌ సమయంలో ఇంటికి వచ్చేసి అప్పటి నుంచి సగటున రోజుకు 8 నుంచి 10 గంటలు చదివేదాన్ని. మొదట ప్రాథమికాంశాలతో ఉన్న పుస్తకాలు చదివి తర్వాత అడ్వాన్స్‌డ్‌ స్థాయికి వెళ్లేదాన్ని. వీలైనన్ని ఎక్కువ టెస్ట్‌ సిరీస్‌లు రాయడంతోపాటు మెటీరియల్‌ను వీలైనంత తక్కువ మాత్రమే ఎంచుకునేదాన్ని. ఒకే మెటీరియల్‌ ఎక్కువసార్లు చదవడం వల్ల పరీక్షలో బాగా రాయగలుగుతాం. ఆఖరి నిమిషంలో రివిజన్‌ చేయడం కూడా సులభం అవుతుంది.


ఒత్తిడిగా అనిపిస్తే..

ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే మంచి మంచి తెలుగు పుస్తకాలు చదివేదాన్ని. యోగా, వాకింగ్‌ వంటివి తరచూ చేయడంతోపాటు అప్పుడప్పుడు సరదాగా సినిమాలు చూశాను. రోజంతా ఒకే సబ్జెక్టు చదివితే నాకు ఫోకస్‌ ఉండేది కాదు, అందువల్ల రోజును నాలుగు భాగాలుగా చేసుకుని నాలుగు విభిన్నమైన సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం చదివాను. సివిల్స్‌ రాయాలి అనుకునే విద్యార్థులు మరో ఆప్షన్‌ కూడా ఆలోచించుకుని ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ సక్సెస్‌ రేటు చాలా తక్కువ. ప్రతిసారీ విజయం రాకపోవచ్చు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్నది చేయగలుగుతాం. చివరిగా నేను చెప్పేది ఒక్కటే.. ప్రయత్నలోపం లేకుండా కష్టపడితే ఎక్కడో ఒక చోట కచ్చితంగా విజయం లభిస్తుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని