ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ దాకా..

కోర్సు పూర్తయ్యేవరకూ ప్రతి నెలా ఎంతో కొంత మొత్తం ఉపకార వేతనంగా వస్తే ఉన్నత విద్యాకోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఎంతోవెసులుబాటు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన విద్యార్థులను..

Published : 18 Dec 2018 01:09 IST

ఏడాది పొడవునా ఎస్‌ఆర్‌ జిందాల్‌ ప్రోత్సాహకాలు

ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ దాకా..

కోర్సు పూర్తయ్యేవరకూ ప్రతి నెలా ఎంతో కొంత మొత్తం ఉపకార వేతనంగా వస్తే ఉన్నత విద్యాకోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఎంతోవెసులుబాటు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో ఎస్‌ఆర్‌ జిందాల్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. విభిన్న కేటగిరీల్లో ఏడాది పొడవునా ఇంటర్మీడియట్‌ నుంచి పీహెచ్‌డీ వరకు ఇవి అందుబాటులో ఉన్నాయి.  వీటి  వివరాలు చూద్దామా?

ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ దాకా..బెంగళూరుకు చెందిన ప్రభుత్వేతర సంస్థ ఎస్‌ఆర్‌ జిందాల్‌ ఫౌండేషన్‌. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీలుగా విభజించి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. ఒక్కో కేటగిరీకి అర్హత ఒక్కోవిధంగా ఉంది.

‌కేటగిరీ-ఎ: ప్రభుత్వ, ప్రభుత్వ అధీనంలోని కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్మీడియట్‌ మొదటి, రెండు సంవత్సరాలు చదువుతున్నవారు అర్హులు. గత ఏడాది రాసిన పరీక్షల్లో అబ్బాయిలు 65%, అమ్మాయిలు 60% మార్కులు (కర్ణాటక, పశ్చిమ్‌ బంగకు చెందినవారు వరుసగా 75%, 70%) సాధించినవారు అర్హులు.

‌కేటగిరీ-బి: ఐటీఐ విద్యార్థులకు ఇస్తారు. ప్రభుత్వ కళాశాలలు/ సంస్థలు, ప్రభుత్వ అధీనంలోని కళాశాలలు/ సంస్థలతోపాటు ప్రైవేటు ఐటీఐ కళాశాలలు/ సంస్థల్లో చదివేవారూ అర్హులే. అయితే ప్రభుత్వ సంస్థలకు చెందినవారికి పాస్‌ మార్కులు వస్తే చాలు. ప్రైవేటు సంస్థల్లో చదివినవారైతే అబ్బాయిలు 50%, అమ్మాయిలు 40% మార్కులు సాధించి ఉండాలి.

‌కేటగిరీ-సి: బీకాం, బీబీఏ, బీబీఎం, బీఎఫ్‌ఏ, బీఎస్‌సీ- అగ్రికల్చర్‌, ఫైనాన్స్‌/ ఎకనామిక్స్‌ బ్యాచిలర్‌ డిగ్రీవారికి అందిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారైతే మూడేళ్ల స్కాలర్‌షిప్‌ పొందగలుగుతారు. జనరల్‌ కేటగిరీ అబ్బాయిలు, అమ్మాయిలు, శారీరక వైకల్యం ఉన్నవారు, వితంతువులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది పరీక్షల్లో అబ్బాయిలు 65%, అమ్మాయిలు 60% మార్కులు  సాధించివుంటే అర్హులు.

‌కేటగిరీ-డి: ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌, మెడికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సులవారికి అందిస్తారు. గత ఏడాది రాసిన పరీక్షల్లో అబ్బాయిలు 60%, అమ్మాయిలు 55% మార్కులున్నవారు అర్హులు.

‌కేటగిరీ-ఇ: ఇంజినీరింగ్‌, మెడికల్‌ సైన్సెస్‌ల్లో బ్యాచిలర్స్‌, పీజీ వారికి అందిస్తారు. బీఆర్క్‌; ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితోపాటు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉన్నాయి. గత ఏడాది పరీక్షల్లో అబ్బాయిలు 70%, అమ్మాయిలు 65% సాధించివుంటేఅర్హులు.

‌పీహెచ్‌డీ కోర్సులు: ఎంకాం, ఎంబీఏ, ఎంఫ్‌ఏ, ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌, ఫైనాన్స్‌/ ఎకనామిక్స్‌ల్లో పీజీ కోర్సుల వారికి అందిస్తారు. దీనికి జనరల్‌ కేటగిరీ అబ్బాయిలు, అమ్మాయిలు, శారీరక వైక్యలం ఉన్నవారు, విధవలు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది పరీక్షల్లో అబ్బాయిలు 65%, అమ్మాయిలు 60% మార్కులు సాధించినవారు అర్హులు.

గమనించాల్సినవి
* కుటుంబ ఆదాయం రూ.2.50 లక్షలు, ఆపై ఉన్నవారు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
* కోర్సులో భాగంగా ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
* ఇతర స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్‌ పొందేవారు అనర్హులు. అలాగే నామమాత్రపు ఫీజులను వసూలు చేసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలవారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* మూడేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలవ్యవధి గల కోర్సులకు తుది సంవత్సరం చదివే విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు.
* ఏడాది కంటే తక్కువ వ్యవధి గల కోర్సులకు దరఖాస్తులు స్వీకరించరు.
* 30 ఏళ్లు దాటినవారికి స్కాలర్‌షిప్‌ అవకాశం ఉండదు.

వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం లభిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలతో నింపి సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దాంతోపాటు అవసరమైన పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఉండదు. ఇతర వివరాలకు- www.sitaramjindal-foundation.org/scholarships సందర్శించవచ్చు.

ఎవరెవరికి ఎంతెంత ‘ఉపకారం’?

* ఎ కేటగిరీ వారికి నెలకు రూ. 500.
* బి కేటగిరీలో ఐటీఐ ప్రైవేటు సంస్థల్లో చదివేవారికి  నెలకు రూ.700, ప్రభుత్వ సంస్థల్లో వారికి రూ.500.
* సి కేటగిరీలో జనరల్‌ కేటగిరీ అబ్బాయిలకు  నెలకు రూ.600, అమ్మాయిలు, పీహెచ్‌ వారికి రూ.800, వితంతువులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ (అన్‌మారీడ్‌ వార్డ్స్‌)కు రూ.1000.
* డి కేటగిరీలో నెలకు అబ్బాయిలకు రూ.800, అమ్మాయిలకు రూ.600.
* ఇ కేటగిరీలో బ్యాచిలర్‌ డిగ్రీవారికి అబ్బాయిలకు రూ.1300, అమ్మాయిలకు రూ.1500. పీజీ వారికి నెలకు అబ్బాయిలకు రూ.1800, అమ్మాయిలకు రూ.2000.
* పీహెచ్‌డీ కోర్సుల్లో.. నెలకు జనరల్‌ అబ్బాయిలు, అమ్మాయిలకు వరుసగా రూ.800, రూ.1000. పీహెచ్‌ వారికి రూ.1000, వితంతువులకు రూ.1200 నెలకు చెల్లిస్తారు.
* హాస్టల్‌లో ఉండేవారికి అదనంగా ఐటీఐ/ జనరల్‌ డిగ్రీ/ పీజీ కోర్సులవారికి నెలకు రూ. 500, టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ కోర్సులైన ఇంజినీరింగ్‌, మెడికల్‌ సైన్సెస్‌ కోర్సుల వారికి నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు