కలిపి చదివితే గెలుపు!

గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ రూపంలో తీసుకొచ్చింది! పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో 9355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను కొత్త జోనల్‌ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు.

Updated : 12 Nov 2022 15:12 IST

కలిపి చదివితే గెలుపు!
తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులు 9355

గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ రూపంలో తీసుకొచ్చింది!  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగంలో 9355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను కొత్త జోనల్‌ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి పోటీపడవచ్చు! ఉన్న స్వల్పవ్యవధిలో మెరుగ్గా సిద్ధం కావాలంటే.. ఒకే తరహా అంశాలను అనుసంధానం చేసుకోవాలి.

గ్రామసభ నిర్వహణ, వృద్ధాప్య పింఛన్లు, జనన మరణ నిర్థారణ పత్రాలు. ఇలా ఏది కావాలన్నా గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శిపై ఆధారపడతారు. పంచాయతీ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శిపైనే ఆధారపడుతుంది. అందుకే ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధి పంచాయతీ కార్యదర్శి. ఈ పోస్టుల రాతపరీక్ష సన్నద్ధతకు తక్కువ సమయం నిజానికి ఓ సవాలే. స్వల్ప కాలవ్యవధి అనేది అందరికీ ఒక్కటే కాబట్టి తక్కువ సమయంలో ఎవరు ఎక్కువగా సన్నద్ధమవుతారో వారే ముందంజలో ఉంటారు. తాజా సమాచారం ప్రకారం రాతపరీక్ష సెప్టెంబరు నెలాఖరుకు లేదా ఇతరత్రా అవరోధాలు ఎదురైతే అక్టోబరు మొదటి వారంలో నిర్వహిస్తారు.
రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. ఒక్కో పేపర్‌ను మొదట 150 మార్కులకు నిర్వహించాలనుకున్నారు. తక్కువ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి పోస్టు గ్రూప్‌-4 కేడర్‌కు సమానమైనందువల్ల 100 మార్కులకే ప్రకటించారు. దీంతో అభ్యర్థులపై కొంత భారం తగ్గినట్లైంది.
అయితే రెండు పేపర్లతో కలిపి 23 విభాగాలు చదవాల్సి రావడం ఇప్పుడున్న సమయంలో కత్తిమీద సామే. నెలరోజులకే రాతపరీక్ష నిర్వహిస్తున్నందున రోజుకో విభాగాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. తప్పు సమాధానాలకు 1/4 మార్కుల కోత ఉంటుంది కాబట్టి జవాబులు గుర్తించటంలో జాగ్రత్త వహించటం తప్పనిసరి.

అదనపు విభాగాలపై...
ఇక్కడ ఒక సౌలభ్యాన్ని ఉద్యోగార్థులు వినియోగించుకోవాలి. పంచాయతీ కార్యదర్శి పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌లోని 13 విభాగాలు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహిస్తున్న వివిధ కేడర్‌ రాతపరీక్షల సిలబస్‌లోనివే. వీఆర్‌ఓ, గ్రూప్‌-4, కానిస్టేబుల్‌ రాతపరీక్షలకు సిద్ధమవుతున్నవారు పంచాయతీ కార్యదర్శిలోని మొదటి పేపర్‌ సన్నద్ధత పూర్తయినట్లుగా భావించాలి. వివిధ కేడర్ల సిలబస్‌లను పంచాయతీ కార్యదర్శి సిలబస్‌తో సరిపోల్చుకుని అదనంగా ఉన్న విభాగాలపై దృష్టిపెడితే సమయం ఆదా చేయవచ్చు.

పేపర్‌-1 సన్నద్ధతను ఇప్పటికే పూర్తి చేశామన్న అంచనాకు రాగలిగితే పంచాయతీ కార్యదర్శి సన్నద్ధతలో సగం ప్రయాణం పూర్తయినట్లే. జనరల్‌ స్టడీస్‌లోని వర్తమాన అంశాలను పరీక్షకు మూడు, నాలుగు రోజుల ముందు చూసుకోవచ్చు. ఇక మిగిలేది పేపర్‌-2 తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు (భారతదేశం, తెలంగాణ రాష్ట్రం), వీఆర్‌ఓ, ఇతర పోటీపరీక్షల్లో భాగమైనందున వీటిపై కొంత అవగాహన ఇప్పటికే  ఉండాలి. మిగిలిన పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామపంచాయతీల ఆదాయవ్యయాలు, జమా ఖర్చుల రికార్డుల నిర్వహణ వంటి అదనపు అంశాలను ప్రత్యేకంగా చదవాలి.

ఇతర పరీక్షలను ఏమీ రాయని అభ్యర్థులు పేపర్‌-1, 2 సిలబస్‌లు చదవాల్సి ఉంటుంది. కాబట్టి నెలరోజులపాటు రోజులో సన్నద్ధతలో సగభాగం ఒక పేపర్‌కు, మరో సగభాగం మరో పేపర్‌కు కేటాయించాలి.

గ్రామీణ ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేస్తున్నప్పుడు మొదట భారతదేశ గ్రామీణాభివృద్ధిని అధ్యయనం చేసి ఆపై తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చదవడం వల్ల అవగాహన సులభతరమవుతుంది. అలాగే పంచాయతీరాజ్‌ వ్యవస్థ గురించి చదువుతున్నపుడు ముందు దేశంలో పరిణామక్రమాన్ని చదివి, ఆపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇటువంటి ఏకోన్ముఖ విధానం వల్ల అవగాహనకు ఎక్కువ సమయం పట్టదు. సన్నద్ధత చురుకుగా సాగుతుంది!

పేపర్‌ 1: జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ  

వర్తమానాంశాల విభాగం నుంచి 10-15 ప్రశ్నలు వచ్చే వీలుంది. వీటిలో ఎక్కువగా పరీక్ష తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన సంఘటనల నుంచి ఉంటాయి.  జాతీయ, ప్రాంతీయ వర్తమాన విషయాల కోసం వార్తాపత్రికలను చదవడం దినచర్యలో భాగం చేసుకోవాలి.

జనరల్‌ సైన్స్‌: 10-15 ప్రశ్నలు రావచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ప్రచురణలు 8, 9, 10 తరగతుల్లోని రసాయన, భౌతిక, జీవశాస్త్రాలను నిత్య జీవితంలో వివిధ అంశాలకు అనుసంధానించి అధ్యయనం చేయాలి.

పర్యావరణం- విపత్తు నిర్వహణ: మానవ కారక భారీ ప్రమాదాలు, విపత్తు నిర్వహణ చట్టంలోని అంశాలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగం, పనితీరు, విపత్తులపై ప్రజలకు అవగాహన వంటివి ప్రధానం.

ఆర్థిక, భౌగోళికాంశాలు: భౌగోళిక ఉనికి, శీతోష్ణస్థితి, నేలలు, ముఖ్యమైన నదులు, ఉపనదులు, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, వ్యవసాయ పంటలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఖనిజాలు, పరిశ్రమలు-రవాణా సౌకర్యాలు, జనాభా అంశాలను చదవాలి.
* 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలతోపాటు తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన భారతదేశ, తెలంగాణ ఆర్థిక, భౌగోళికశాస్త్ర పుస్తకాలు ముఖ్యం.  తెలంగాణలోని కొత్త జిల్లాల సమాచారాన్ని జిల్లాలవారీగా ప్రదేశాలు, ప్రాజెక్టులు, ఖనిజ వనరులపై దృష్టిసారించాలి.

భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ: ఈ విభాగాల నుంచి చాలా ఎక్కువ ప్రశ్నలుంటాయి. పార్లమెంటు రాష్ట్ర శాసన సభలు. రాజ్యాంగ సవరణలు వంటి అంశాలను అవగాహనతో చదవాలి. ముఖ్యంగా రాజ్యాంగ స్వభావం, స్వరూపం, పనితీరుపై ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రామాణిక గ్రంథాలను, తాజాగా ప్రచురితమైన పుస్తకాలనుచదవాలి.
స్వాతంత్రోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర: ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీనికోసం తెలుగు అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి. స్వాతంత్రోద్యమంలో కీలక దశలు, సంఘటనలు, ముఖ్యమైన ప్రధాన నాయకులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
తెలంగాణ చరిత్ర, ఉద్యమం: తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శాతవాహనుల పూర్వయుగం నుంచి అసఫ్‌జాహీల పాలన వరకు అంటే 1948 వరకు చదవాలి.  1948 నుంచి 2014 వరకు జరిగిన వివిధ ఉద్యమ దశలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మలి ఉద్యమ కాలాన్ని అంటే 2001 నుంచి జరిగిన సంఘటనలపై రాష్ట్ర విభజన, పార్లమెంట్‌ ప్రక్రియ, వివిధ కమిటీలు, ఉద్యమాలు  లాంటివి చూసుకోవాలి.

తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం: తెలంగాణకు సంబంధించిన మరో ముఖ్య విభాగమిది. దీనికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణలను క్షుణ్ణంగా చదవాలి.

తెలంగాణ ప్రభుత్వ విధానాలు: ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంటే 2014 నుంచి నేటివరకు వివిధ విధానాలు, పథకాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని పథకాలను, ప్రారంభించిన తేదీలు, ప్రదేశాలను గుర్తుంచుకోవాలి. పథకాల లక్ష్యాలను అవగాహన చేసుకోవాలి.

పేపర్‌ 2: తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు  

పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యేవారు ఈ చట్ట పరిధిలో పనిచేయాల్సివుంటుంది. దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం పరీక్ష కోసం, ఎంపిక తర్వాత విధుల నిర్వహణకూ ఆవశ్యకం. చట్టంలోనే పంచాయతీ కార్యదర్శి విధులను వివరంగా పేర్కొన్నారు. ఈ చట్టంపై తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ సమగ్రంగా అందుబాటులో ఉంది.

భారత పంచాయతీరాజ్‌ వ్యవస్థ: ప్రధానంగా బ్రిటిష్‌ కాలంలో ఉన్న స్థానిక సంస్థలు, స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస ప్రయోగాలు, స్వాతంత్య్రానంతరం సామాజిక వికాస పథకాలు, వివిధ కమిటీలు చేసిన సిఫారసులు ముఖ్యం. 73 రాజ్యాంగ సవరణ చట్టం-1993కి సంబంధించిన ప్రకరణలు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1993కి సంబంధించిన గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్‌, జిల్లా పరిషత్‌కు సంబంధించిన అంశాలు, విధులు, అధికారాల గురించి అడిగే అవకాశముంది. 

పంచాయతీరాజ్‌ కీలక పథకాలు: ఈ విభాగంలో పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? సంవత్సరం, పథక ముఖ్య ఉద్దేశం, ప్రారంభించిన ప్రదేశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. దీనిలో ఎక్కువగా ప్రశ్నలు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పథకాల గురించి అడగవచ్చు.

తెలంగాణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు:  ఈ విభాగంలో ఎక్కువగా 2014 నుంచి గల సమాచారంపై అడిగే అవకాశముంది.

స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి: దీనిలో ప్రధానంగా స్వయం సహాయక బృందాలు, వాటి పనితీరు, ఆవశ్యకత, లక్ష్యాలు, మహిళా సాధికారతలో స్వయం సహాయక బృందాల పాత్ర, తెలంగాణ స్వయం సహాయక బృందాల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు,  మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి స్వయం సహాయక బృందాలకు ఇచ్చిన రుణాల గురించి అడగవచ్చు.

స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ:  గ్రామపంచాయతీల వివిధ ఆదాయ మార్గాలు అంటే విధించే పన్నులు, వసూలు చేసే ఫీజులు తెలుసుకోవాలి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయాలు, వాటికి సంబంధించిన వార్షిక బడ్జెట్లకు ఆమోదం తదితర విషయాలూ ముఖ్యమే.

నిధుల అకౌంటింగ్‌, నిర్వహణ: పంచాయతీలకు వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులను పారదర్శకంగా నిర్వహించడానికి నూతన అకౌంటింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానంలో వివిధ ఓచర్లు, ఖాతాల వంటి అంశాలు తెలుసుకోవాలి.

సాధనే ఏకైక మార్గం

అభ్యర్థి విషయ సమీక్ష పరిజ్ఞానం, మానసిక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించేందుకే మెంటల్‌ఎబిలిటీని ప్రవేశపెట్టారు. వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో మోడల్‌ పేపర్లను ఎక్కువగా సాధన చేస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులను సాధించవచ్చు.

లాజికల్‌ రీజనింగ్‌:  లాజికల్‌ రీజనింగ్‌లో సమస్యకు సరైన పరిష్కారాన్ని... ఇచ్చినవాటిలో గుర్తించమంటారు. ఈ విభాగంలో రక్తసంబంధాలు, పజిల్‌ టెస్ట్‌, నంబర్‌ ర్యాంకింగ్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, డైరెక్షన్‌ టెస్ట్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇచ్చే ప్రశ్నల ద్వారా అభ్యర్థి చురుకుదనాన్ని, ప్రతిస్పందించే విధానాన్ని, అవగాహన సామర్థ్యాలను పరీక్షిస్తారు.

కాంప్రహెన్షన్‌: దాదాపుగా 15-20 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. కాంప్రహెన్షన్‌లో గద్యానికి/ పద్యానికి చెందిన కొంత సమాచారాన్నిచ్చి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు జవాబులను ఇచ్చిన ఆ గద్య లేదా పద్య భాగాల్లోనే గుర్తించి సమాధానాలను గుర్తించాలి. కాంప్రహెన్షన్‌కు సమాధానాలను గుర్తించేందుకు ముందుగా ఇచ్చిన పేరాగ్రాఫ్‌ను చదివి, ఆ తరువాత ప్రశ్నలను చూసి మరోసారి పేరా చదువుతూ సమాధానాలను గుర్తించాలి.

వాక్యాల పునరమరిక: ప్రశ్నల్లో ఒక సంఘటన/ విషయానికి సంబంధించి నాలుగు వాక్యాలను ఇస్తారు. ఇవి ఒక క్రమపద్ధతిలో అమర్చితే ఆ విషయం/ సంఘటన పూర్తిగా అర్థవంతమవుతుంది.
* వీటిలో తెలుగు వాక్యాలతోపాటు ఆంగ్ల వాక్యాలనూ ఇచ్చి భాషపై అభ్యర్థికి ఉన్న ప్రాథమిక అవగాహనను పరీక్షిస్తారు. 
* ఈ విభాగంలో అభ్యర్థికి గల పరిజ్ఞానాన్ని పరీక్షించేలా కూడా ప్రశ్నలుంటాయి. సులభంగా చేయాలంటే వాక్య ప్రారంభం ఎలా ఉంటుంది?ఎక్కడ పూర్తవుతుంది? వంటివి పరిశీలించాలి.
న్యూమరికల్‌, అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ:  8, 9, 10 తరగతుల గణిత పుస్తకాలను అధ్యయనం చేయాలి.
* అభ్యర్థులు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధ చేయాలి. వాటికి సంబంధించిన సూత్రాలు, షార్ట్‌కట్లను గుర్తుంచుకోవాలి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే టేబుల్స్‌, వర్గాలు, క్యూబ్‌లను గుర్తుపెట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని