ATM withdrawals: యూపీఐ వచ్చినా క్యాషే కింగ్‌.. పెరిగిన ఏటీఎం విత్‌డ్రాలు!

దేశంలో డిజిటల్‌ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్‌ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది.

Published : 29 Apr 2024 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు గ్రామీణ ప్రాంతాలకూ పాకాయి. చిన్న చిన్న దుకాణాలు సైతం డిజిటల్‌ లావాదేవీలను అందిపుచ్చుకున్నాయి. అంతమాత్రాన నగదు వినియోగం తగ్గిందనుకుంటే పొరపాటే. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చెలామణీ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లకు చేరింది. నగదు విత్‌ డ్రా కూడా పెరిగినట్లు సీఎంఎస్‌ సంస్థ వెలువరించిన కన్జంప్షన్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. దేశంలో మెజారిటీ ఏటీఎంలలో నగదు నిర్వహణ బాధ్యతలను ఈ కంపెనీనే చూస్తుంటుంది. దీని ఆధారంగా తాజాగా నివేదికను విడుదల చేసింది.

గతేడాదితో పోలిస్తే నెలకు సగటున ఏటీఎంల నుంచి విత్‌డ్రా అయ్యే మొత్తం (అన్ని ఏటీఎంలలో సగటున విత్‌డ్రా అయిన మొత్తం) 5.51 శాతం మేర పెరిగినట్లు సీఎంస్‌ తన నివేదికలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.1.35 కోట్లుగా ఉన్న ఈ మొత్తం రూ.1.43 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రజలు ఇప్పటికీ  కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో నగదు వెచ్చిస్తున్నారనేది ఈ ట్రెండ్‌ తెలియజేస్తోంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వినియోగాన్ని సూచిస్తోందని నివేదిక పేర్కొంది.

వేసవిలో ఫోన్‌ ఛార్జింగ్‌ వేగం తగ్గుతుంది..? ఎందుకు?

మెట్రో నగరాల్లో ఏటీఎం విత్‌డ్రాలు 10.37 శాతం పెరిగినట్లు సీఎంఎస్‌ నివేదిక వెల్లడిస్తోంది. సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 3.94 శాతంగా ఉందని తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాల విషయంలో దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ టాప్‌లో ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఏటీఎంలలో 49 శాతం మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లో ఉండగా.. 51 శాతం ఏటీఎంలు సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల విషయానికొచ్చేసరికి ఏటీఎంల సంఖ్య 64, 36 శాతంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎఫ్‌ఎంసీజీ, రైల్వే, ఏవియేషన్‌, డ్యూరబుల్స్‌ వంటి రిటైల్‌ సెక్టార్లలో అధిక వినియోగం నమోదైనట్లు నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని