TS Exams 2022: విచక్షణ.. వివక్ష.. విభేదాలు!

ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య తలెత్తుతున్న విభేదాలు పరిపాలనకు అవరోధాలుగా మారుతున్నాయి. సమాఖ్య వ్యవస్థ సామరస్యంగా సాగిపోవడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ పదవి చుట్టూ వివాదాలు

Updated : 14 Apr 2022 18:37 IST

భారత రాజ్యాంగం - రాజకీయాలు

ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య తలెత్తుతున్న విభేదాలు పరిపాలనకు అవరోధాలుగా మారుతున్నాయి. సమాఖ్య వ్యవస్థ సామరస్యంగా సాగిపోవడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ పదవి చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. రాజకీయ లేదా ఇతర కారణాలతో రాష్ట్రాధినేత, ప్రభుత్వాధిపతి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. విచక్షణ వివక్షగా మారుతోందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు హోదాలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు, వివిధ కమిషన్లు-కమిటీలు చేసిన సిఫారసులపై అభ్యర్థులు పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

భారతదేశం పరిపాలనా పరమైన సమాఖ్యగా కొనసాగడంలో, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో గవర్నర్‌ కీలకపాత్ర పోషిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారు. రాష్ట్రాధినేత గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో పరిపాలన నిర్వహిస్తే ప్రజాస్వామ్యం విజయవంతమై ప్రజలకు మేలు జరుగుతుంది. అలాకాకుండా ఇరువురి మధ్య పరిపాలనాపరమైన అభిప్రాయ భేదాలు వస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్షీణించి అంతిమంగా ప్రజలకు అభిలషణీయమైన      పరిపాలన దూరమవుతుంది.

రాజ్యాంగ నిర్మాతల ఆలోచన

* రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రస్థాయిలో పార్లమెంట్‌ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కేంద్రం నియమించే గవర్నర్‌ రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తూ నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. ఓటర్ల ద్వారా ప్రాతినిధ్యం పొందిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తూ వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. 

* గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని రాజ్యాంగ సభ సలహాదారుడైన బెనగళ నరసింగరావు ప్రతిపాదించారు. కానీ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలని పేర్కొన్నారు. ఈ వాదననే రాజ్యాంగ సభ సమర్థించింది. కారణాలను విశ్లేషించింది.

గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడానికి కారణాలు 

* గవర్నర్‌ను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రితో వివాదాలు ఏర్పడతాయి. 

* గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. 

* గవర్నర్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఆ పదవి పార్టీ రాజకీయాలకు నెలవవుతుంది. అప్పుడు గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.

విచక్షణాధికారాలు 

ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహా లేకుండా లేదా ఆ సలహాకు వ్యతిరేకంగా గవర్నర్‌ చేపట్టే చర్యలను ‘విచక్షణాధికారాలు’ అంటారు. వీటి వల్ల గవర్నర్‌ పదవి తరచూ వివాదాస్పదమవుతుంది. ఈ విచక్షణాధికారాలు రెండు రకాలు.  

రాజ్యాంగపరమైనవి 

భారత రాజ్యాంగంలో గవర్నర్‌కు అంతర్గతంగా కొన్ని విచక్షణాధికారాలను పేర్కొన్నారు. వీటిని నిర్వహించడంలో గవర్నర్‌ మంత్రిమండలి సలహాను పాటించాల్సిన అవసరం లేదు. 

* రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం. 

* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా రాజ్యాంగ పరమైన కారణాలతో    రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయడం. 

* రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరడం. 

* రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయించడం. 

సందర్భాన్ని అనుసరించి లభించేవి 

రాజకీయ పరిస్థితుల్లో వచ్చే మార్పుల ఆధారంగా గవర్నర్‌ కొన్ని విచక్షణాధికారాలను పొందుతారు. 

* రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించని సమయంలో ముఖ్యమంత్రిని నియమించడం.

* రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేక విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేయడం.

* శాసనసభలో మెజార్టీ కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ రద్దు చేయవచ్చు.

* అధికారంలో ఉన్న ప్రభుత్వం పతనమైనప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేనప్పుడు శాసనసభ కాలపరిమితి ముగియకముందే శాసనసభను రద్దుచేయడం.

* శాసనసభను రద్దుచేయాలనే ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్‌ తిరస్కరించగలరు లేదా ఆమోదించగలరు. 

కొన్ని ఉదాహరణలు 

* 1985లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫారసు చేస్తే గవర్నర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ఆమోదించారు.

* 1994లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫారసు చేస్తే గవర్నర్‌ కె.కృష్ణకాంత్‌ తిరస్కరించారు.

* 2004లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు సిఫారసు చేస్తే గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా ఆమోదించారు.

 మాదిరి ప్రశ్నలు

1. గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించిన రాజ్యాంగ సభ సలహాదారుడు ఎవరు?

1) కె.ఎం.మున్షీ    

2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) అనంతశయనం అయ్యంగార్‌     4) బి.ఎన్‌.రావు

2. 1985లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన అప్పటి గవర్నర్‌ ఎవరు?

1) ఖండూభాయ్‌ దేశాయ్‌      2) శంకర్‌ దయాళ్‌ శర్మ   

3) కె.కృష్ణకాంత్‌    4) రవిశంకర్‌ అయ్యర్‌

3. గవర్నర్‌ అధికారాల నిర్వహణలో పార్లమెంట్‌కు లేదా రాష్ట్ర శాసనసభకు లేదా రాష్ట్ర మంత్రిమండలికి ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పును వెలువరించింది?

1) షంషేర్‌ సింగ్‌ (  స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌)

2) ఆర్‌.ఎ.మెహతా ( స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌)

3) శంకరీ ప్రసాద్‌  ( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా)

4) కె.ఎం.ఎ.పాయ్‌ ( స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక)

4. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసులకు సంబంధించి సరైనవి?

ఎ) ఒక వ్యక్తిని సొంత రాష్ట్రంలో పరిమితులు విధించి గవర్నర్‌గా నియమించవచ్చు.

బి) విశిష్ట వ్యక్తిత్వం, వివాదాస్పదం కాని వారిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి.

సి) గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రపతి పాలనను విధించరాదు.

డి) గవర్నర్‌లకు ప్రవర్తనా నియమావళి ఉండాలి

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి   

3) బి, సి, డి       4) ఎ, బి, సి, డి

సమాధానాలు: 1-4, 2-2, 3-2, 4-3.   


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని