కరెంట్‌ అఫైర్స్‌

ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా 2024, ఫిబ్రవరిలో ఎవరు నియమితులయ్యారు? (1988 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి సుఖ్‌బీర్‌ సింగ్‌ సంథు స్థానంలో ఈ పదవిలో నియమితులయ్యారు.

Updated : 20 Mar 2024 04:00 IST

మాదిరి ప్రశ్నలు

ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా 2024, ఫిబ్రవరిలో ఎవరు నియమితులయ్యారు? (1988 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి సుఖ్‌బీర్‌ సింగ్‌ సంథు స్థానంలో ఈ పదవిలో నియమితులయ్యారు.)

జ: రాధా రాటూరి

2024, ఫిబ్రవరి 2న ఝార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? (రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ ఈయనతో ప్రమాణం చేయించారు. మనీ లాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ 2024, జనవరి 31న అరెస్టు కావడంతో జేఎంఎం సీనియర్‌ నేత అయిన ఈయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 5న అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నెగ్గారు. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్ర శాసనసభలో విశ్వాస తీర్మానానికి మద్దతుగా 47 మంది, వ్యతిరేకంగా 29 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు

జ: చంపయ్‌ సోరెన్‌

2024, ఫిబ్రవరి 3న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖపట్నం నావల్‌ డాక్‌ యార్డులో జాతికి అంకితం చేసిన అతిపెద్ద సర్వే నౌక ఏది? (సముద్ర మార్గంలో స్మగ్లింగ్‌, వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న సముద్ర దొంగల బెడద నుంచి నావికా దళాలను ఇది అప్రమత్తం చేస్తుంది. నాలుగు భారీ సర్వే ఎసల్స్‌ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో ఈ నౌక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023, డిసెంబరు 4న భారత నౌకాదళానికి ఈ షిప్‌ను అప్పగించారు. దీని పొడవు 110 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు, బరువు 3400 టన్నులు, ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్‌ మైళ్లు.)

జ: ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌


కరెంట్‌ అఫైర్స్‌

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ వరసగా అయిదోసారి  ఎన్నికయ్యారు. 7.6 కోట్లమంది (87.29%) ఆయనకు ఓట్లు వేశారని, ఇప్పటివరకు ఇన్ని ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి అని 2024, మార్చి 18న రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుత ఎన్నికతో అధ్యక్షుడిగా లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధిస్తారు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను 29 ఏళ్లపాటు (1924 నుంచి 1953) పాలించిన రికార్డు జోసెఫ్‌ స్టాలిన్‌ పేరిట నమోదైంది. పుతిన్‌ 2029లో దాన్ని అధిగమించే అవకాశాలున్నాయి.


తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 2024, మార్చి 18న లేఖను పంపించారు. ఆమె 2019 సెప్టెంబరు 1న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీగా
అదనపు బాధ్యతలు చేపట్టారు.


భారత షూటర్‌ అఖిల్‌ షెరోన్‌ పోలిష్‌ గ్రాండ్‌ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 2024, మార్చి 18న దిల్లీలో జరిగిన పురుషుల 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ రెండో మ్యాచ్‌లో అతడు 468.4 స్కోరుతో స్వర్ణం గెలిచాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు (466.1)ను తిరగరాశాడు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని