తెల్లవారిపై తిరగబడిన తెలుగు వీరులు!

సౌకర్యాల కల్పనను సంపూర్ణంగా విస్మరించి పన్నులను మాత్రం పదిరెట్లు పెంచిన ఆంగ్లేయ పాలకుల అరాచకాలకు ఆంధ్రులు ఎదురు తిరిగారు. చెల్లించేది లేదంటూ చీరాల-పేరాల గ్రామాలనే ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Published : 06 May 2024 00:36 IST

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర
ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమం

(జాతీయోద్యమ వ్యాప్తి)

సౌకర్యాల కల్పనను సంపూర్ణంగా విస్మరించి పన్నులను మాత్రం పదిరెట్లు పెంచిన ఆంగ్లేయ పాలకుల అరాచకాలకు ఆంధ్రులు ఎదురు తిరిగారు. చెల్లించేది లేదంటూ చీరాల-పేరాల గ్రామాలనే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరవుతో అల్లాడుతున్న సమయంలోనూ కర్కశ వలస ప్రభుత్వం పశువుల మేతపై పన్ను నాలుగు రెట్లు అధికం చేయడాన్ని నిరసిస్తూ పల్నాటి వీరులు అటవీ సత్యాగ్రహం చేశారు. పెదనందిపాడు గ్రామోద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంతో పన్నుల వసూళ్లు నిలిపేశారు. గడగడలాడిన బ్రిటిషర్లు అతి కష్టం మీద ఆ ఉద్యమాన్ని అణచి వేశారు. ఈ విధంగా జాతీయోద్యమ వ్యాప్తి ప్రతి దశలోనూ ఆంధ్రులు చురుగ్గా వ్యవహరించిన తీరును పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. తెగువతో తెల్లవారిపై తిరగబడి చరిత్రలో నిలిచిపోయిన తెలుగు వీరుల గురించి తెలుసుకోవాలి.

భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన (1885) నాటి నుంచి ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి వేగవంతమైంది. కాంగ్రెస్‌ మొదటి సమావేశంలో అనేకమంది ఆంధ్రులు పాల్గొన్నారు. వందేమాతరం, స్వపరిపాలన ఉద్యమాలు కూడా ఆంధ్రలో తీవ్రంగా జరిగాయి. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్రలోనూ పెద్దఎత్తున సాగింది.

సహాయ నిరాకరణ ఉద్యమం:  మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల అమలుకు వీలుగా 1919లో భారత ప్రభుత్వం రౌలత్‌ చట్టాన్ని ఆమోదించింది. దానికి వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమాలు జరిగాయి. 1920, సెప్టెంబరులో కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం కలకత్తాలో జరిగింది. దీనికి కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, పేట బాపయ్య లాంటి నాయకులు హాజరయ్యారు. అందులో గాంధీజీ ప్రతిపాదించిన అహింసాయుత సహాయ నిరాకరణ చేపట్టాలనే తీర్మానాన్ని అత్యధిక మెజార్టీతో ఆమోదించారు. సహాయ నిరాకరణలో భాగంగా ప్రభుత్వ బిరుదులను వదులుకోవడం, శాసన సభలు, కోర్టులు, ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించడం లాంటి  కార్యక్రమాలు జరిగాయి.

1920లో విజయరాఘవాచారి అధ్యక్షతన నాగ్‌పుర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఇందులో మూడు తీర్మానాలు చేశారు. అవి 1) జలియన్‌ వాలాబాగ్‌ దురంతానికి బాధ్యత వహిస్తూ ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. 2) టర్కీ ఖలీఫా పదవిని పునరుద్ధరించాలి. 3) స్వరాజ్య స్థాపన చేయాలి.

ఈ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అమితోత్సాహంతో పాల్గొంది. 1921, మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 1ల మధ్య విజయవాడలో అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశమైంది. దానికి గాంధీజీ, మోతీలాల్‌ నెహ్రూ, సి.ఆర్‌.దాస్‌, మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ లాంటి జాతీయ నాయకులు హాజరయ్యారు. వీరిని చూడటానికి అనేక జిల్లాల నుంచి వేలాదిమంది సమావేశానికి తరలివచ్చారు. తిలక్‌ స్వరాజ్యనిధికి కోటి రూపాయలు స్వీకరించాలని అప్పుడే నిర్ణయించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. దాన్ని కొన్ని మార్పులతో గాంధీజీ ఆమోదించారు. ఈ సమావేశం తర్వాత మహాత్ముడు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, చీరాల, నెల్లూరు ప్రాంతాల్లో   పర్యటించారు. ఆయన ఉపన్యాసాలను అయ్యదేవర కాళేశ్వరరావు తెలుగులోకి అనువదించారు. బాపూజీ పర్యటన కారణంగా అనేకమంది మహిళలు ప్రభావితమై జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు.

సహాయ నిరాకరణలో భాగంగా ఆంధ్రలో జరిగిన ఉద్యమాలు

1) చీరాల - పేరాల ఉద్యమం: ఈ ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈయన బిరుదు ‘ఆంధ్రరత్న’. కృష్ణాజిల్లా నందిగామ తాలుకాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో 1889లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పినతండ్రి వద్ద పెరిగారు. గుంటూరులో విద్యాభ్యాసం చేశారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. 1909లో మచిలీపట్నంలో జరిగిన రెండో ఆంధ్ర విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. గుంటూరులోని క్రైస్తవ మిషనరీ పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 1911లో ఉన్నత విద్య కోసం  ఇంగ్లండ్‌ వెళ్లారు. అర్థశాస్త్రంలో ఎం.ఎ.ఆనర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రిలోని ప్రభుత్వ ట్రెయినింగ్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా చేరారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఉద్యోగం మానేసి చీరాల సమీపంలో 1920లో ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి అనే సంస్థను స్థాపించి, నడిపించారు.

స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టం చీరాల - పేరాల ఉద్యమం. చీరాల - పేరాల అనేవి నాటి ప్రకాశం జిల్లాలో ఇరుగుపొరుగు గ్రామాలు. 1921 నాటికి ఈ రెండు ఊళ్లలో జనాభా పదిహేను వేలు ఉంది. వాటితో పాటు జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను కలిపి చీరాల యూనియన్‌గా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వేల రూపాయల పన్ను వసూలయ్యేది. మద్రాసు ప్రభుత్వం దీన్ని పురపాలక సంఘంగా ప్రకటించిన తర్వాత నలభైవేల రూపాయల పన్ను వసూళ్లకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి అదనపు సౌకర్యాలను ప్రజలకు కల్పించలేదు. ఆ ప్రాంతంలో  నివసించేవారిలో చాలామంది అల్పాదాయ వర్గాల వారు పాత పన్నుల విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేకపోవడంతో చీరాల ప్రజలు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. పురపాలక సంస్థ విధించిన పన్నులను కట్టడానికి తిరస్కరించారు. 1921, మార్చిలో పన్ను చెల్లించేందుకు నిరాకరించిన  12 మందిని అరెస్టు చేశారు. వారిలో ఒక  వృద్ధురాలు కూడా ఉంది. ఈమె భారత జాతీయోద్యమంలో మొదటి మహిళా ఖైదీ.

గోపాలకృష్ణయ్య ‘రామదండు’ అనే స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విజయవాడకు వచ్చిన గాంధీజీని కలిసి చీరాలకు ఆహ్వానించారు. 1921, ఏప్రిల్‌ 6న మహాత్ముడు ఉద్యమ గ్రామాలను సందర్శించి, వాటిని ఖాళీ చేయమని స్థానికులకు సలహా ఇచ్చారు. ఆ మేరకు 1921, ఏప్రిల్‌ 25న అర్ధరాత్రి గ్రామస్థులంతా ఇళ్లను ఖాళీచేసి గ్రామ శివార్లలో  నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ‘రామ్‌నగర్‌’ అనే పేరు పెట్టారు. పదకొండు నెలల పాటు వారు ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. తీవ్ర ఉష్ణోగ్రతలు, జులై, ఆగస్టుల్లో అధిక వర్షాల కారణంగా ఇబ్బందులు పడ్డారు. గోపాలకృష్ణయ్యను అరెస్టు చేయడంతో ప్రజల నైతిక బలం దెబ్బతింది. తర్వాత వీరికి ఎవరూ నాయకత్వం వహించకపోవడంతో వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఉద్యమం గురించి గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో ప్రకటన చేశారు. ఉద్యమ కాలంలో దువ్వూరి సుబ్బమ్మను ప్రభుత్వం అరెస్టు చేసింది.

ఉద్యమం విఫలమవడానికి కారణాలు:

  • గోపాలకృష్ణయ్య చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్‌ నాయకుల్లో ఈర్ష్యను కలిగించాయి. ఆయనకు ఎవరూ సహకరించలేదు.
  • బ్రాహ్మణుడు కావడంతో మద్రాసులోని జస్టిస్‌ పార్టీ ప్రభుత్వం ఇతడిని అణచివేయడానికి ప్రయత్నించింది.
  • ఉద్యమానికి దాతలు ఎవరూ విరాళాలు ఇవ్వలేదు.

2) పల్నాడు ఉద్యమం : ఇదొక అటవీ సత్యాగ్రహం.‘పుల్లరి పన్ను’ వ్యతిరేక ఉద్యమం. ఆనాడు గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్ల, వెల్దుర్తి, సిరిగిరిపాడు, మించాలపాడు గ్రామాల చుట్టూ ఉన్న అడవులను ప్రభుత్వం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించింది. పశువుల మేతపై మూడు అణాల పుల్లరి పన్ను విధించింది. 1921లో ఇక్కడ కరవు వచ్చినప్పుడు పన్ను తగ్గించకపోగా, 3 నుంచి 12 అణాలకు పెంచింది. దాంతో మించాలపాడు గ్రామస్థుడైన కన్నెగంటి హనుమంతు ఆధ్వర్యంలో పుల్లరి ఉద్యమం మొదలైంది. ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి, యామిని పూర్ణ తిలకం తదితర కాంగ్రెస్‌ నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కొండా వెంకటప్పయ్య మాత్రం దీన్ని వ్యతిరేకించారు. 1921, సెప్టెంబరు 23న కన్నెగంటి హనుమంతును ఆంగ్లేయులు కాల్చి చంపడంతో ఉద్యమం ఆగిపోయింది.

3) పెదనందిపాడు ఉద్యమం:  ఈ ఉద్యమ నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి. బిరుదు ‘ఆంధ్రా శివాజీ’. ఈయన సైన్యం శాంతిసేన. ఈ ఉద్యమానికి కారణం రాజకీయమైనది కాదు. గ్రామాధికారుల ఉద్యోగాల రీత్యా ఉత్పన్నమైన సమస్యల వల్ల ఉద్యమం ప్రారంభమైంది. వారికి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నారనేది ప్రధాన సమస్య. గ్రామోద్యోగులను తగ్గించడం అనేది ఇతర సమస్యలకు కారణమైంది. వారి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెదనందిపాడు అధికారులు రాజీనామాలు సమర్పించారు. ఫలితంగా పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం రాజీనామా చేసినవారి స్థానంలో కొత్తవారిని నియమించింది. దాంతో తీవ్ర ఉద్యమం మొదలైంది. ఒక దశలో ఆంగ్లేయులను గడగడలాడించింది. దీనిపై కాంగ్రెస్‌ నియమించిన కమిటీ సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు, దుంపి నారాయణ. వీరయ్య చౌదరిని బ్రిటిష్‌ అధికారులు కాలుస్తామని బెదిరించారు. చివరకు గాంధీజీ సూచనతో ఉద్యమాన్ని విరమించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని