TOEFL: టోఫెల్‌ పరీక్ష సమయం కుదింపు.. జులై నుంచి కీలక మార్పులు!

TOEFL: టోఫెల్‌ పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్ష సమయాన్ని కుదించడంతో పాటు పలు కీలక మార్పులు చేసినట్టు ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌(ETS) వెల్లడించింది.

Published : 11 Apr 2023 19:08 IST

దిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేవారి ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యతను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌- TOEFL) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56నిమిషాల్లో)  పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్‌ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌ (ETS) వెల్లడించింది. ఆంగ్ల భాషా ప్రావీణ్యతకు సంబంధించిన టోఫెల్‌, గ్రాడ్యుయేట్‌ రికార్డు ఎగ్జామినేషన్స్‌(GRE) రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్టు ఈటీఎస్‌ సీఈవో అమిత్‌ సేవక్‌ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. 

విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్‌ స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 11,500 యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. విదేశీ విద్యలో భాగంగా ప్రపంచంలోనే ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు యూకేలోని 98శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో రీడింగ్‌ సెక్షన్‌ను కుదించడంతోపాటు స్వతంత్రంగా రాసే టాస్క్‌ స్థానాన్ని ‘అకడమిక్‌ డిస్కషన్‌ కోసం రాసే విధానం’తో భర్తీ చేసినట్టు ఈటీఎస్‌ తెలిపింది. స్కోరు చేయని ప్రశ్నలను పరీక్ష నుంచి తొలగించనున్నారు.

టోఫెల్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సరళీకృతం చేసినట్టు అమిత్‌ సేవక్‌ తెలిపారు. గతంతో పోలిస్తే వేగంగా, మరింత సులభంగా TOEFL iBT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని.. అలాగే, ఈ పరీక్ష ఫీజును తొలిసారి రూపాయిల్లోనే చెల్లించే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు చెల్లింపులను సులభతరం చేసేందుకు మరిన్ని ఆప్షన్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు.  విదేశాల్లో విద్యనభ్యసించాలనుకొనే లక్షలాది భారతీయ విద్యార్థులకు ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భారత్‌లోని ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ప్రతినిధుల సంఘం అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా అభిప్రాయపడ్డారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు