Sukumar: ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్‌ చేయలేదు: సుకుమార్‌

తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్‌ ప్రశంసలు కురిపించారు.

Published : 05 May 2024 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) వద్ద పనిచేసిన పలువురు ఇప్పటికే మెగాఫోన్‌ పట్టి, సత్తా చాటారు. ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam)తో అర్జున్‌ వై.కె. ఆ జాబితాలోకి తాజాగా చేరారు. సుహాస్‌ (Suhas) హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా మే 3న బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్‌ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతోంది. ఈ సందర్భంగా సుకుమార్‌, బుచ్చిబాబు (ఉప్పెన సినిమా దర్శకుడు).. అర్జున్‌, సుహాస్‌ని ఇంటర్వ్యూ చేశారు. అర్జున్‌ని కొనియాడుతూ ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) సినిమా చిత్రీకరణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సుకుమార్‌.

‘‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో అర్జున్‌ ప్రయాణం చేశాడు. అప్పుడే అతడిపై ఎన్టీఆర్‌ (NTR)కు నమ్మకం కలిగింది. ఓ మేజర్‌ ఎపిసోడ్‌కు తనే దర్శకత్వం వహించాడు. ఓ దర్శకుడిగా నా అసిస్టెంట్‌ను షూట్‌ చేయమని నేను చెప్పొచ్చు. కానీ, అంత పెద్ద హీరో దానికి అంగీకరించడం విశేషం. తారక్‌ ‘ఎస్‌’ చెప్పాడంటేనే అర్జున్‌ టాలెంట్‌ ఏంటో అర్థమవుతుంది. అతడు డైరెక్ట్‌ చేసిందే సినిమాలో పెట్టాం తప్ప మళ్లీ నేను రీషూట్‌ చేయలేదు’’ అని తెలిపారు. ‘ఆర్య 2’లోనూ ఓ సీన్‌కీ అర్జున్‌ దర్శకత్వం వహించారని చెప్పారు. సుహాస్‌ గురించి మాట్లాడుతూ.. నటనలో అతడిది ప్రత్యేక శైలి అని ప్రశంసించారు. ఎంపిక చేసుకునే స్క్రిప్టులు బాగుంటాయన్నారు. బుచ్చిబాబు సైతం సుహాస్‌ని కొనియాడారు. కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిలా సుహాస్‌దీ విభిన్నమైన పంథా అని, తెలుగులో అతడికి కాంపిటిటర్‌లు లేరని పేర్కొన్నారు.

రివ్యూ: ప్రసన్నవదనం

అర్జున్‌.. ‘జగడం’ నుంచి సుకుమార్‌ తెరకెక్కించిన సినిమాలన్నింటికీ పనిచేశారు. అర్జున్‌ రాసే స్టోరీల్లో లాజిక్‌ బాగుంటుందని, ఇప్పుడాయన దర్శకుడిగా మారడంతో తాను లాజిక్‌ ఉన్న సినిమాలు మానేశానని సుకుమార్‌ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో చెప్పారు. అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్‌’ స్టోరీ రాశానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని