Siraj: కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్

ఐపీఎల్ 17వ సీజన్‌లో సిరాజ్‌ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 05 May 2024 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన బెంగళూరు వరుసగా మూడో విజయం సాధించింది. గుజరాత్‌ను చిత్తు చేయడంలో ఆర్సీబీ బౌలర్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇదే అతడి బెస్ట్‌ బౌలింగ్‌ కావడం గమనార్హం. గత కొన్ని మ్యాచుల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన సిరాజ్‌ గుజరాత్‌తో బరిలోకి దిగాడు. మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. గుజరాత్‌తో మ్యాచ్‌ ఆడతానని అనుకోలేదు. ఎలాగైనా మైదానంలోకి దిగాలని బలంగా కోరుకున్నా. చాలా కఠినంగా శ్రమించిన తర్వాత ఫలితం అందుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ప్రతి బంతిని వేయడానికి 110 శాతం కష్టపడాలి. చివరికి మా జట్టు విజయం సాధించడం బాగుంది. మిగతా మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శనతో రాణించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సిరాజ్‌ తెలిపాడు. 

బ్యాటింగ్‌ వస్తుందని అనుకోలేదు: దినేశ్‌ కార్తిక్‌

‘‘మా ఇన్నింగ్స్‌లో తొలి నాలుగు ఓవర్ల తర్వాత ఒక కప్పు టీ తాగా. నేను బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం ఉండదులే అనుకున్నా. కాసేపటికి కాఫీ తెప్పించుకున్నా. ప్యాడ్లను కూడా కట్టుకోలేదు. మానసికంగానూ సిద్ధంగా లేను. రిలాక్స్‌డ్‌గా ఉన్నా. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేం చేయాల్సిన పరుగులు తక్కువే కానీ.. వికెట్లను కోల్పోయాం. వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లిపోయా. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నప్పటికీ కుదురుకుని పరుగులు రాబట్టా. మా బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగాం. ఈ మ్యాచ్‌ విజయంలో క్రెడిట్‌ వారిదే’’ అని దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని