IPL - PSL 2025: ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్‌ఎల్‌..! కారణమిదేనా?

క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఐపీఎల్‌, పాక్‌లో పీఎస్‌ఎల్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది.

Updated : 05 May 2024 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు (IPL) ఉన్న విశేష ఆదరణ మరే టోర్నీకి లేదు. ప్రస్తుతం 17వ సీజన్ కొనసాగుతోంది. ప్రతి ఏడాది దాదాపు రెండు నెలలపాటు అభిమానులను అలరిస్తుంది. దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా ఓ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ (PSL)కు అక్కడ మంచి ప్రాచుర్యం ఉంది. వచ్చే ఏడాది ఈ రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐసీసీ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు ఏప్రిల్‌ - మే మధ్య కాలంలో చోటు ఉంటుంది. వచ్చే పీఎస్‌ఎల్‌ టోర్నీని కూడా ఇదే సమయంలో నిర్వహించేందుకు పాక్‌ మొగ్గు చూపుతోంది. దానికి కారణం ఛాంపియన్స్‌ ట్రోఫీ (CT 2025). వచ్చే ఏడాది జరగనున్న ఈ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి - మార్చి సమయంలో ఈ టోర్నీ ఉండనుంది. దీంతో పీఎస్‌ఎల్‌ షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం పాకిస్థాన్‌ బోర్డుకు వచ్చింది. ఈ మేరకు ఫ్రాంచైజీలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఐపీఎల్, పీఎస్‌ఎల్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

‘‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు మేం ఆతిథ్యం ఇవ్వనున్నాం. దీంతో మా పీఎస్‌ఎల్‌ను ఏప్రిల్ 7 నుంచి మే 20 వరకు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నాం. ఏ క్షణంలోనైనా తేదీల్లో మార్పులు ఉండొచ్చు. కరాచీ, లాహోర్, ముల్తాన్, రావల్పిండి ఫ్రాంచైజీలు తలపడతాయి. ప్రతి జట్టూ హోం గ్రౌండ్‌లో ఐదేసి మ్యాచ్‌లు ఆడాలి. విదేశీ ఆటగాళ్లు రెండు లీగుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి ఇబ్బంది కలగకుండా ఫ్రాంచైజీలు చర్యలు తీసుకోవాలి. వచ్చే ఏడాది పీఎస్‌ఎల్‌ ప్లేఆఫ్స్‌ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పీసీబీ సీఏఏ సల్మాన్‌ నసీర్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని