Bajrang Punia: డోపింగ్‌ శాంపిల్‌కు బజరంగ్‌ నిరాకరణ.. సస్పెన్షన్‌ వేటు!

డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వని కారణంగా రెజ్లర్‌ బజరంగ్‌ పునియాపై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్‌ వేటు వేసింది.

Updated : 05 May 2024 15:30 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు (Paris Olympics) సిద్ధమవుతోన్న రెజ్లర్‌ బజరంగ్‌ పునియా (Bajrang Punia)కు చుక్కెదురయ్యింది. డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వని కారణంగా ఆయనపై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో మరికొన్ని రోజుల్లో జరగబోయే ప్రపంచ క్రీడోత్సవంలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా ఎన్‌ఏడీఏ డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న బజరంగ్‌ పునియా నుంచి మూత్ర నమూనాలను కోరింది. కానీ, ఆయన మాత్రం ఆ శాంపిల్‌ను అందించలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ఇతర ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎన్‌ఏడీఏ వెల్లడించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన బజరంగ్‌.. ఈ నెల జరగనున్న ‘ఎంపిక పరీక్ష’కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా: బజరంగ్‌ పునియా ప్రకటన

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రముఖ రెజ్లర్లు.. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బజరంగ్‌ పునియాతో పాటు రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగట్‌లు చేసిన పోరాటం ఫలితంగా బ్రిజ్‌ భూషణ్‌పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.

ఆ కిట్లపై సమాధానం చెప్పాలి..

డోపింగ్‌ పరీక్ష కోసం శాంపిల్‌ ఇవ్వలేదంటూ వచ్చిన నివేదికపై బజరంగ్‌ పునియా స్పందించారు. ‘ఎన్‌ఏడీఏ అధికారులకు నమూనాలు ఇచ్చేందుకు ఎన్నడూ నిరాకరించలేదు. గడువు ముగిసిన టెస్టు కిట్లు ఇచ్చారు. వాటిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తొలుత సమాధానం చెప్పాలని కోరా. ఆ తర్వాత నన్ను పరీక్షించండి అని విజ్ఞప్తి చేశా. దీనిపై మా న్యాయవాది వారికి త్వరలోనే సమాధానం ఇస్తారు’ అని బజరంగ్‌ పునియా ఎక్స్‌ (ట్విటర్‌)లో వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని