పసి సిగ్నల్‌ ప్రమాదం!

ఆకుపచ్చ లైటు పడితే అప్రమత్తం కావాలి. తెల్ల లైటు పడితే జాగ్రత్త పడాలి. నీలం లైటు పడితే నిర్లక్ష్యం చేయొద్దు. ఇవేం ట్రాఫిక్‌ సిగ్నళ్లని అనుకుంటున్నారా? ఇవి వాహనాలకు సంబంధించినవి కావు.

Published : 28 Jun 2023 10:24 IST

ఆకుపచ్చ లైటు పడితే అప్రమత్తం కావాలి. తెల్ల లైటు పడితే జాగ్రత్త పడాలి. నీలం లైటు పడితే నిర్లక్ష్యం చేయొద్దు. ఇవేం ట్రాఫిక్‌ సిగ్నళ్లని అనుకుంటున్నారా? ఇవి వాహనాలకు సంబంధించినవి కావు. పిల్లల ఆరోగ్య సిగ్నళ్లు. అవటానికి మామూలువే అయినా తీవ్ర సమస్యలకు సంకేతం కావొచ్చు. తక్షణం స్పందించకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. అవేంటో వివరంగా చూద్దాం.


తెల్ల హెచ్చరిక!

ఆహారం తినటమే కాదు, మల విసర్జనా ముఖ్యమే. చాలావరకు మలం పసుపు రంగులో ఉంటుంది. అయితే కొన్నిసార్లు పిల్లలు తెల్లగా, పాలిపోయినట్టుగా మల విసర్జన చేయొచ్చు. ఇది పైత్యరస నాళ అడ్డంకికి హెచ్చరిక కావొచ్చు!
కాలేయం నుంచి ఉత్పత్తయ్యే పైత్యరసం కొవ్వు పదార్థాలు జీర్ణం కావటానికే కాదు.. కాలేయంలోని వ్యర్థ పదార్థాలనూ పేగుల్లోకి చేరవేస్తుంది. కొన్నిసార్లు పిల్లల్లో పుట్టుకతోనే పైత్యరస నాళంలో అడ్డంకి (బిలియరీ అట్రీషియా) ఏర్పడొచ్చు. కాలేయం బయట లేదా లోపలి భాగం సరిగా ఏర్పడకపోవటం దీనికి మూలం. దీంతో కాలేయం నుంచి పిత్తాశయానికి, అక్కడ్నుంచి పేగుల్లోకి పైత్యరసం చేరుకోవటం ఆగిపోతుంది. ఇది కాలేయంలోనే పోగుపడుతుంది. అప్పుడు తెల్లగా, పాలిపోయినట్టుగా మల విసర్జన కావొచ్చు. అడ్డంకి మూలంగా కాలేయం దెబ్బతినొచ్చు, గట్టి పడొచ్చు (సిరోసిస్‌). చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. కాబట్టి శిశువులు తెల్లగా లేదా పాలిపోయినట్టు మల విసర్జన చేస్తుంటే తాత్సారం చేయరాదు. పైత్యరస నాళ అడ్డంకిని అనుమానించాలి.

కారణమేంటి?

పైత్యరస నాళం అడ్డంకికి కారణమేంటన్నది పూర్తిగా తెలియదు. కొందరిలో గర్భధారణ సమయంలో పైత్యరస నాళం సరిగా ఏర్పడకపోవటం కారణం కావొచ్చు. కొందరిలో పుట్టిన తర్వాత వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే క్రమంలో రోగనిరోధక వ్యవస్థ దాడి చేయటం వల్ల పైత్యరస నాళాలు దెబ్బతిని ఉండొచ్చు. సుమారు 15వేల నుంచి 20వేల మందిలో ఒకరికి పైత్య నాళాలు కనిపించవు. ఇది మగ పిల్లల్లో కన్నా ఆడ పిల్లల్లో ఎక్కువ. ఈ సమస్య గలవారిలో 10-15% మందిలో ఒకటి కన్నా ఎక్కువ ప్లీహాలు, రక్తనాళ లోపాలు, పేగుల్లో లోపాల వంటి ఇతరత్రా సమస్యలూ ఉంటాయి.

చికిత్స ఏంటి?

పైత్యరస నాళ అడ్డంకులు మందులతో తగ్గవు. శస్త్రచికిత్సతోనే పైత్యరస ప్రవాహాన్ని పునరుద్దరించాల్సి ఉంటుంది. ఇందులో కాలేయం వెలుపల దెబ్బతిన్న నాళాలను కత్తిరిస్తారు. తెరచుకొని ఉన్న ఇతర చిన్న నాళాలను పేగుతో కలుపుతారు. దీంతో పైత్యరసం నేరుగా పేగుల్లోకి ప్రవహిస్తుంది. శస్త్రచికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా దీర్ఘకాలం యాంటీబయాటిక్‌ మందులు వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పైత్యరస ప్రవాహాన్ని పెంచటానికి ఇతర మందులూ అవసరమవుతాయి. శిశువులకు 8-12 వారాల్లోపు శస్త్రచికిత్స చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇది పైత్యనాళ అడ్డంకిని పూర్తిగా నయం చేయలేదు గానీ పిల్లలు మంచి ఆరోగ్యంతో ఎదగటానికి తోడ్పడుతుంది. అయితే పెద్దయ్యాక కొందరికి కాలేయ మార్పిడి అవసరమవ్వచ్చు.


ఆకుపచ్చ హెచ్చరిక!

పిల్లలు వాంతి చేసుకుంటేనే ఆందోళన చెందుతాం. ఇక ఆకుపచ్చగా.. పసరువాంతులు చేసుకుంటే? తక్షణం అప్రమత్తం కావాల్సిందే. నిజానికి పిల్లలు వాంతి చేసుకోవటం మామూలే. పాలు సరిగా పట్టకపోవటం, తిండి సరిగా తినిపించకపోవటం, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్‌, అపరిశుభ్ర ఆహారం వంటివే చాలావరకు వాంతులకు కారణం అవుతుంటాయి. కానీ అరుదుగా ఇవి ప్రమాదకర జబ్బులకూ సంకేతాలు కావొచ్చు. కాబట్టి తేలికగా తీసుకోవద్దు. కారణమేంటన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.

వాంతి ఎలా అవుతుంది?

ఒక్కమాటలో చెప్పాలంటే- వాంతి ఓ రక్షణ ప్రక్రియ. శరీరం తనది కాని, తనకు హాని చేసే వాటిని బయటకు నెట్టడానికి చేసే ప్రయత్నం. మన మెదడులోని కెమికల్‌ ట్రిగ్గర్‌ జోన్‌ (సీటీజెడ్‌) ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వివిధ భాగాల నుంచి అందే అలర్జీ, చిరాకు కారకాలు దీన్ని ప్రేరేపించినప్పుడు నాడులు ఉత్తేజితమై, వాంతి సంకేతాలను పంపిస్తాయి. ఇవి పొట్ట కండరాలను బలవంతంగా సంకోచించేలా చేసి వాంతి కలిగేలా చేస్తాయి. సాధారణంగా కలుషిత ఆహారం, నీరు తీసుకున్నప్పుడు మనకేమీ తెలియకుండానే కడుపులోకి బ్యాక్టీరియా, వైరస్‌లు చేరుకుంటాయి. ఇవి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. బయటి నుంచి లోనికి వచ్చే ఇలాంటి వాటిని శరీరం వాంతి రూపంలో బయటకు నెట్టేస్తుంది. పిల్లల్లో వాంతులకూ చాలావరకు ఇవే కారణం. ఇవేమీ హానికరం కావు. వాంతిని కట్టేసే మందులు, ఓఆర్‌ఎస్‌ ద్రావణంతో ఒకట్రెండు రోజుల్లోనే  తగ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు వాంతులు తగ్గినట్టే తగ్గి, మళ్లీ మొదలవ్వచ్చు. విడవకుండా వేధిస్తుండొచ్చు. కొన్నిసార్లు పసరువాంతులూ కావొచ్చు. 

పసరు వాంతి ఎందుకు?

వాంతి ఆకుపచ్చగా కనిపించటానికి కారణం పైత్యరసం. కాలేయం నుంచి ఉత్పత్తయ్యే ఇది ఆంత్రమూలం ద్వారా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇక్కడ ఏదైనా అడ్డంకి ఉంటే ఆకుపచ్చ లేదా పసుపు రంగులో వాంతి అవుతుంది. అప్పుడే ఉత్పత్తి అయిన పైత్యరసం బంగారు రంగులో ఉంటుంది. ఒకవేళ అది అడ్డంకి వద్ద చాలాసేపు ఉండిపోతే ఆకుపచ్చగా మారుతుంది. ఇలాంటి పసరు వాంతులను నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, కారణమేంటన్నది తెలుసుకోవాలి. పసరు వాంతులకు రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి.
పేగు మధ్యభాగం తిరిగిపోవటం: సాధారణంగా పేగులు ఒక పద్ధతిలో అమరి ఉంటాయి. కానీ కొందరు పిల్లల్లో మధ్యభాగం తిరిగిపోయి (మాల్‌రొటేషన్‌ ఆఫ్‌ మిడ్‌గట్‌) ఉంటుంది. దీంతో పేగులకు రక్త సరఫరా కూడా ఆగిపోవచ్చు. పేగు భాగం కుళ్లిపోవచ్చు (వాల్వులస్‌). ఇది అత్యవసర పరిస్థితి. శస్త్రచికిత్స చేసి పేగులను సరిచేయాల్సి ఉంటుంది.
పేగుల్లో అడ్డంకి: పేగులు ఏర్పడేటప్పుడు కొందరిలో అడ్డంకి (ఇంటెస్టినల్‌ అట్రీషియా) ఏర్పడొచ్చు. కొందరికి కణజాలం అతుక్కుపోవటం, నులి పురుగులు ఉండలు కట్టటం వంటివీ అడ్డంకిగా ఏర్పడొచ్చు. ఇలాంటివేవైనా పసరు వాంతులకు దారితీయొచ్చు.
ఇన్‌ఫెక్షన్‌: రోగనిరోధక వ్యవస్థ విఫలం కావటం వల్ల పేగుల గోడల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. దీంతో కణజాలం దెబ్బతిని, చనిపోవచ్చు (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌). సత్వరం చికిత్స అందకపోతే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు.

తోసుకొచ్చే పేగు చిక్కుకుపోవటం: కొందరికి గజ్జల వద్ద కడుపు గోడ బలహీనమైన చోటు నుంచి పేగు బయటకు తోసుకురావొచ్చు. ఇది లోపలికి వెళ్లకుండా అక్కడే చిక్కుకుపోవచ్చు (ఇంగ్వయినల్‌ హెర్నియా). పిల్లలు గట్టిగా ఏడుస్తూ, పసరు వాంతులు చేసుకుంటుంటే దీన్ని అనుమానించాలి. నిశితంగా పరీక్షించాలి.
నాడులు లేకపోవటం: కొందరికి పుట్టుకతోనే పెద్ద పేగులో కొన్ని నాడులు లేకపోవచ్చు (హీర్ష్‌స్ప్రంగ్స్‌ డిసీజ్‌). దీంతో పేగు మలాన్ని ముందుకు కదిలించదు. అది అడ్డంకిగా మారొచ్చు.
పేగు చొచ్చుకుపోవటం: కొందరికి పేగులో కొంత భాగం మరో భాగంలోకి చొచ్చుకుపోవచ్చు (ఇంటససెప్షన్‌). దీంతో కడుపు నొప్పి, ఆకుపచ్చ వాంతులు తలెత్తుతాయి. చివరి దశల్లో మలంలోనూ రక్తం పడొచ్చు. ఇది అత్యవసర సమస్య. దీన్ని వెంటనే సరిచేయాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం

ఆగకుండా అదేపనిగా వాంతులైతే ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. రక్తంలో ఎలక్ట్రోలైట్ల మోతాదులూ పడిపోతాయి. ఇలాంటి సమయంలో చికిత్స చేయించకపోతే ప్రాణాలకూ ముప్పు ఏర్పడొచ్చు. విడవకుండా వాంతులు కావటం వల్ల జీర్ణకోశంలో పుండ్లూ పడొచ్చు. ఫలితంగా రక్తం వాంతులు కావొచ్చు. కొన్నిసార్లు వాంతిలోని పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు. ఇది న్యుమోనియాకు దారితీయొచ్చు. వాంతితో పాటు జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకొచ్చి ఛాతీలో మంట పుట్టొచ్చు. పళ్ల మీద ఎనామిల్‌ తగ్గిపోవచ్చు. పిల్లలు బరువూ తగ్గొచ్చు. మామూలు వాంతుల కన్నా పసరు వాంతులు మరింత ప్రమాదమని గుర్తించాలి.

భరోసా ఇవ్వాలి

పిల్లలు వాంతులతో బాధపడుతూ, చిరాకు పడుతుంటే తల్లిదండ్రులు దగ్గరుండి ధైర్యం కల్పించాలి. శిశువులకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం, వాంతి తగ్గించే మందులు ఇవ్వటంతో పాటు కొద్ది కొద్దిగా పాలు పట్టాలి. వాంతులు తీవ్రమైతేనే పాలివ్వటం ఆపెయ్యాలి. వీరికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఎక్కించాల్సి ఉంటుంది. పెద్ద పిల్లలకైతే వాంతిని ఆపే మందులు, ఓఆర్‌ఎస్‌ ద్రావణమే ముఖ్య చికిత్స. ఓఆర్‌ఎస్‌ అందుబాటులో లేనట్టయితే గ్లాసు నీటిలో చారెడు పంచదార, చిటికెడు ఉప్ప కలిపి తరచూ తాగించాలి.


నీలి హెచ్చరిక!

శరీరానికి నిరంతరం ఆక్సిజన్‌ అవసరం. కాసేపు అందకపోయినా చర్మం, పెదవులు నీలిరంగులోకి మారతాయి. ఇదే నీలి హెచ్చరిక. దీనికి కారణం పిల్లల శ్వాసనాళంలో పల్లీలు, నట్లు, బోల్టుల వంటివి ఇరుక్కోవటం. దీంతో తగినంత ఆక్సిజన్‌ అందక పిల్లలు నీలంగా మారిపోతారు. ఇది ఆర్నెల్ల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
పిల్లలకు ప్రతీదీ ఉత్సుకత కలిగిస్తుంది. ఎందులో ఏముందో చూడాలని ప్రయత్నిస్తుంటారు. ప్రతి దాన్నీ నోటిలో పెట్టుకొని పరీక్షిస్తుంటారు. ఈ ఉత్సుకతే కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతుంది. నోట్లో పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు ఇవి గొంతులోనో, శ్వాసనాళంలోనో చిక్కుకుపోవచ్చు. మింగినవైతే పొట్టలోంచి ప్రయాణించి, మలద్వారం ద్వారా బయటకు వస్తాయి. చాలావరకు పెద్దగా ఇబ్బంది కలిగించవు. కానీ శ్వాసనాళంలో చిక్కుకుంటేనే ప్రమాదం. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. పిల్లలు తరచూ పల్లీలు, సీతాఫలం గింజలు, చింత పిక్కల వంటి సేంద్రీయ పదార్థాలు మింగుతుంటారు. కొందరు నట్లు, బోల్టుల వంటివీ నోట్లో పెట్టుకోవచ్చు. శ్వాసనాళంలో చిక్కుకుకున్నవి చాలావరకు మొదటి భాగంలోనే ఉండిపోతుంటాయి. పల్లీల వంటివైతే క్రమంగా ఉబ్బిపోయి, సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

ఎప్పుడు జరగొచ్చు?

సినిమా చూస్తూ పిల్లలు పరధ్యానంగా పాప్‌కార్న్‌ వంటివి తింటున్నప్పుడు శ్వాసనాళం లోపలికి వెళ్లిపోవచ్చు. పిల్లలు టీవీ చూస్తుండగా తిండి తినిపించటం, పెళ్లిళ్లు, వేడుకల వంటి సందర్భాల్లో తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు.. పిల్లలను ఇంట్లో విడిచి, తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముంది. అలాగే ఇంటి మరమ్మతు పనులు చేస్తున్నప్పుడు నట్లు, బోల్టుల వంటివి అందుబాటులో ఉంటాయి. వీటిని పిల్లలు నోట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కాస్త పెద్దగా అయ్యేంతవరకు కనిపెట్టుకొని ఉండాలి. ఒంటరిగా విడిచి వెళ్లకుండా చూసుకోవాలి. చిన్న వస్తువులు ముఖ్యంగా పదునైనవి, బ్యాటరీల వంటివి పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు. చిన్న విడి భాగాలు ఊడి వచ్చే ఆట వస్తువులను చేతికి ఇవ్వద్దు. వీటిని మింగే ప్రమాదముంది.

లక్షణాలేంటి?

ఏదైనా వస్తువును మింగినప్పుడు వెంటనే దగ్గటం, పొరపోవటం, నోట్లో ఏదో కుక్కినట్టు మాట్లాడటం, గట్టిగా పిల్లికూత పెట్టటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆక్సిజన్‌ తగినంత అందకపోవటం వల్ల చర్మం, గోళ్లు, పెదాలు, కళ్ల చుట్టూరా నల్లగానూ అవ్వచ్చు. ఈ దశలో మరణించే అవకాశమూ ఎక్కువగానే ఉంటుంది.

  •  కొందరిలో నెలల కొద్దీ ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. వస్తువు ఎక్కడ చిక్కుకుంది, ఎంతవరకు అడ్డుపడింది, ఏ రకం అనేదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. వస్తువు స్థానం మారటంతోనూ పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.
  •  శ్వాసనాళం ఇన్‌ఫెక్షన్‌ మూలంగా కొన్నిసార్లు లక్షణాలు తిరగబెట్టొచ్చు. లోపలికి వెళ్లిన వస్తువు తీరును బట్టి తరచూ కళ్లెతో కూడిన దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం, జ్వరం, పిల్లికూతలు, అప్పుడప్పుడూ చర్మం రంగు మారటం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. న్యుమోనియా, ఆస్థమా వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి.

నిర్ధరణ ఎలా?

మింగిన వస్తువులు చాలావరకు స్వరపేటిక, దాని దగ్గరి శ్వాసనాళంలో చిక్కుకుంటుంటాయి. ఆయా లక్షణాను బట్టి దీన్ని నిర్ధరిస్తారు. వీరిలో చాలావరకు శ్వాస తీసుకునేటప్పుడు అయ్యే చప్పుడు తగ్గిపోతుంది. శ్వాసనాళ మార్గం మూసుకుపోవటం వల్ల చప్పుడు అసహజంగా వినిపిస్తుంది. వస్తువు ఉన్నచోటు నుంచి కదులుతుంటే శ్వాస చప్పుడు తీరూ మారుతుంది. పల్లీల వంటి సేంద్రీయ వస్తువులు ఎక్స్‌రేలో కనిపించవు. కాబట్టి ఊపిరితిత్తి కూలబడటం, అతిగా ఉబ్బటం వంటి ఇతరత్రా లక్షణాలతో సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది.

చికిత్స ఏంటి?

గొంతులో, శ్వాసనాళంలో ఏదైనా చిక్కుకున్నట్టు అనిపిస్తే వెంటనే పిల్లల వీపు, ఛాతీ, కడుపు  మీద గట్టిగా తట్టాలి. తలకిందులుగా చేసి కడుపులో తట్టాలి. నోట్లో వేళ్లు పెట్టి కక్కించొద్దు. అలా చేస్తే వస్తువు మరింత లోపలికి వెళ్లొచ్చు. పిల్లలు దగ్గేలా ప్రోత్సహించాలి. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వైద్యులు మత్తుమందు ఇచ్చి, బ్రాంకోస్కోపీ సాయంతో వస్తువును బయటకు తీస్తారు.


హీమ్లిక్‌ పద్ధతి మేలు

గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు అత్యవసర పరిస్థితిలో హీమ్లిక్‌ పద్ధతి మేలు చేస్తుంది. కాస్త పెద్ద పిల్లల్లో దీన్ని పాటించొచ్చు.

  • పిల్లలను నిల్చోబెట్టాలి. వెనక నుంచి ఒక చేత్తో నడుం వద్ద గట్టిగా పట్టుకొని, పిల్లాడిని ముందుకు వంచాలి. మరో చేత్తో భుజాల మధ్యలో ఐదుసార్లు గట్టిగా కొట్టాలి.
  • ఒకవేళ వస్తువు బయటకు రానట్టయితే రెండు పిడికిళ్లను బిగించి, పిల్లాడి బొడ్డు పైభాగాన పెట్టాలి. పిడికిళ్లను లోపలికి నెట్టి, పైకి తెస్తున్నట్టుగా కదిలిస్తూ గట్టిగా, వేగంగా ఐదుసార్లు నొక్కాలి. ఈ సమయంలో పిల్లలను పైకి ఎత్తొద్దు.
  • ఐదుసార్లు వీపు మీద కొట్టిన తర్వాత మరో ఐదు సార్లు పిడికిళ్లతో కడుపులో గట్టిగా అదమాలి. వస్తువు బయటకు వచ్చేంతవరకూ.. పిల్లాడు దగ్గి, శ్వాస తీసుకునేంతవరకూ ఇలాగే చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని