చిన్నప్పుడు కూర్చుంటే పెద్దయ్యాక గుండెజబ్బు

చదువుల పేరుతో పిల్లలను గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారా? లేదూ పిల్లలు టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోయి బయటి లోకాన్ని మరచిపోతున్నారా? అయితే పెద్దయ్యాక జబ్బుల ముప్పు కొని తెచ్చుకుంటున్నట్టే.

Updated : 29 Aug 2023 05:46 IST

చదువుల పేరుతో పిల్లలను గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారా? లేదూ పిల్లలు టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోయి బయటి లోకాన్ని మరచిపోతున్నారా? అయితే పెద్దయ్యాక జబ్బుల ముప్పు కొని తెచ్చుకుంటున్నట్టే. బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్‌లాండ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం గమనార్హం. 90ల్లో ఆరంభించిన అధ్యయనం ద్వారా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ముందుగా 11 ఏళ్ల వయసులో ఏడు రోజుల పాటు పిల్లల కదలికలను లెక్కించారు. అనంతరం 15 ఏళ్లు, 24 ఏళ్ల వయసులోనూ తిరిగి గణించారు. అలాగే ఎకోకార్డియోగ్రామ్‌తో 17, 24 ఏళ్ల వయసులో గుండె ఎడమ జఠరిక ఎత్తునూ పరిశీలించారు. పిల్లలు 11 ఏళ్ల వయసులో రోజుకు సగటున 362 నిమిషాలు, 15 ఏళ్లలో 474 నిమిషాలు, 24 ఏళ్లలో 531 నిమిషాల సేపు కదలకుండా ఉంటున్నట్టు గుర్తించారు. అంటే 11 నుంచి 24 ఏళ్ల మధ్యలో కదలకుండా కూర్చొనే సమయం సగటున రోజుకు 169 నిమిషాలు పెరిగిందన్నమాట. ఈ సమయం పెరుగుతున్నకొద్దీ ఎడమ జఠరిక ద్రవ్యరాశీ పెరుగుతున్నట్టు తేలింది. ఇలా గుండె పెరిగినవారికి ఏడేళ్ల కాలంలో గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పులు రెండింతలు ఎక్కువవుతున్నట్టు గతంలో పెద్దవారి మీద చేసిన అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని