బాల బరువు భారమే!

వయసు మీద పడటం ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసా? తల్లి కడుపులో నలుసు పడినప్పటి నుంచే! ఆరోగ్యంగా ఉండటం, త్వరగా వృద్ధాప్యం ముంచుకురాకుండా చూసుకోవటంలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి.

Published : 19 Dec 2023 00:23 IST

వయసు మీద పడటం ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసా? తల్లి కడుపులో నలుసు పడినప్పటి నుంచే! ఆరోగ్యంగా ఉండటం, త్వరగా వృద్ధాప్యం ముంచుకురాకుండా చూసుకోవటంలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నప్పటి నుంచే తగినంత నీరు తాగటం, ఆహారంలో తక్కువ కేలరీలు తీసుకోవటం, పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివన్నీ ముఖ్యమే. పిల్లల్లో ఊబకాయం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత అవసరం కూడా.

పిల్లల ఆరోగ్యం, రోజువారీ వ్యవహారాలను ఊబకాయం గణనీయంగా దెబ్బతీస్తుంది. పిల్లల్లో అధిక బరువు, ఊబకాయానికి పలు అంశాలు కారణమవుతుంటాయి. చాలామందిలో ఒకటి కన్నా ఎక్కువ కారణాలూ కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించి, పరిష్కరించటం మనందరి విధి.

  •  ఆహార అలవాట్లు: ప్రస్తుతం పిల్లల ఆహార అలవాట్లు గణనీయంగా మారిపోయాయి. అధిక కేలరీలు, తక్కువ పోషకాలతో కూడిన పదార్థాలు.. ఎక్కువ చక్కెర గల ఆహార ఉత్పత్తుల వాడకం ఎక్కువైంది. ఇవన్నీ బరువు పెరిగేలా చేసేవే. పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌, తీపి పానీయాలు దీన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి.
  •  శ్రమ లేకపోవటం: ఇది ప్రధాన కారణం. ఒకప్పటిలా పిల్లలు ఇప్పుడు ఆరుబయట ఆడుకోవటం తగ్గింది. ఉదయం బడికి వెళ్లటం, ఇంటికి రాగానే హోం వర్క్‌, ట్యూషన్లు.. లేదంటే ఫోన్లతో గడపటం. శారీరక శ్రమ లేకపోతే కేలరీలు ఖర్చు కావటమూ తగ్గుతుంది. ఫలితంగా బరువూ పెరుగుతారు.
  •  జన్యువులు: కొందరు పిల్లలు జన్యుపరంగానూ లావుగా ఉండొచ్చు. వీరిలో జీవక్రియల వేగం మందగించొచ్చు, కొవ్వు పోగుపడొచ్చు.
  • కుటుంబ జీవనశైలి: పెద్దవాళ్ల జీవనశైలీ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్లను చూసే పిల్లలు నేర్చుకుంటారు. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, బద్ధకం పిల్లలకూ అబ్బుతాయి.  
  • మానసిక అంశాలు: పెద్దవాళ్లు తమ పిల్లలను ఇతరులతో పోల్చి దెప్పి పొడవటం వంటివి తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురిచేస్తాయి. కొందరు భావోద్వేగాలను అణచుకోవటానికి అతిగానూ తినొచ్చు. ఇవన్నీ బరువు పెరగటానికి దోహదం చేస్తాయి.
  •  పరిసరాల ప్రభావం: నివాస ప్రాంతంలో ఆరోగ్యకరమైన ఆహారం, ఆడుకోవటానికి తగినంత స్థలం అందుబాటులో లేకపోవటమూ పిల్లల బరువు మీద ప్రభావం చూపుతాయి.
  • నిద్రలేమి: టీవీలు, ఫోన్ల మోజులో ఎంతోమంది పిల్లలు రాత్రి పూట చాలాసేపటి వరకు మెలకువగా ఉండిపోతున్నారు. దీంతో ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తమవుతాయి. ఆకలి పెరుగుతుంది. ఎక్కువెక్కువగా తినటం వల్ల బరువూ ఎక్కువవుతుంది.
  •  వ్యాపార ప్రకటనలు: అనారోగ్యకరమైన ఆహారం, పానీయాల ప్రకటనలు పిల్లల తిండి అలవాట్ల మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతున్నాయి.

    నివారించేదెలా?

పిల్లలు ఊబకాయం బారినపడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దీనికి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • పిల్లలు అది కావాలి, ఇది కావాలని మారాం చేయటం నిజమే అయినా ఆరోగ్యకరమైన ఆహారం తినేలా ప్రోత్సహించాలి. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు, పాలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. మాంసాహారులైతే గుడ్లు, చేపలు, చికెన్‌ ఇవ్వచ్చు. తీపి పానీయాలు, తవుడు పూర్తిగా తీసేసిన ధాన్యాలతో చేసిన పదార్థాలు పరిమితం చేయాలి. పళ్లెంలో అన్నం, చపాతీ, కూరలు ఎంత మోతాదులో ఉండాలో నేర్పించాలి. ఆకలిని గుర్తించి, దానికి తగినట్టుగా తినటం అలవాటు చేయాలి. వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలి. దీంతో పెద్దవాళ్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అనోన్య బంధాలూ ఏర్పడతాయి.
  • ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలు, కంప్యూటర్లు చూసే సమయాన్ని పరిమితం చేయాలి. వీలైనంత ఎక్కువగా ఆరుబయట ఆడుకోవటానికి ప్రోత్సహించాలి. రోజుకు కనీసం గంట సేపైనా చురుకుగా ఉండేలా చూడాలి. బడిలోనూ వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  •  జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌కు బదులు ఇంట్లో తయారుచేసిన పోషకాలతో కూడిన చిరుతిళ్లు ఇవ్వాలి. పండ్లు, పెరుగు వంటి వాటినీ చిరుతిండిగా ఇవ్వచ్చు.
  • అతి ముఖ్యమైన పానీయం నీరేనని గుర్తించేలా చేయాలి. సోడాలు, తీపి పానీయాలు, చక్కెర కలిపిన పండ్ల రసాలు వీలైనంత తగ్గించాలి.
  •  క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఎత్తుకు తగిన బరువు పెరుగుతున్నారో లేదో చూసుకోవాలి. ఎక్కువగా బరువు పెరుగుతుంటే అప్రమత్తం కావాలి.
  • అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు కంటి నిండా నిద్రపోయేలా చూడాలి.  మంచి అలవాట్లను ఆచరిస్తుంటే ప్రోత్సహించాలి. చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్‌ వంటివి కాకుండా ఇతరత్రా బహుమతులు ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని