వానల్లో హాయిగా..

వానాకాలం హాయిగానే ఉంటుంది. చిటపట చినుకులు, చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. కానీ కొన్ని జబ్బులూ తలెత్తుతుంటాయి. రెండు మూడు జల్లులు కురవగానే ముక్కు చీదేవారు ఎందరో. ఖంగు ఖంగుమని దగ్గటం.. జ్వరాలతో వణకటం మామూలే

Updated : 25 Jul 2023 02:46 IST


వానాకాలం హాయిగానే ఉంటుంది. చిటపట చినుకులు, చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. కానీ కొన్ని జబ్బులూ తలెత్తుతుంటాయి. రెండు మూడు జల్లులు కురవగానే ముక్కు చీదేవారు ఎందరో. ఖంగు ఖంగుమని దగ్గటం.. జ్వరాలతో వణకటం మామూలే. చాలావరకివి మామూలుగానే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేదం, హోమియో ఔషధాలు బాగా ఆదుకుంటాయి. వీటిని ఇంట్లో ఉంచుకుంటే అవసమైనప్పుడు వాడుకోవచ్చు. మరి ఆ ఔషధాల కిట్ల గురించి తెలుసుకుందామా.


ఆయుర్వేదం ఏడాదిని మూడేసి రుతువుల చొప్పున ఆదాన, విసర్గ కాలాలుగా విభజిస్తుంది.  శిశిర, వసంత, గ్రీష్మ రుతువులతో కూడిన ఆదాన కాలంలో సూర్యుడు జీవుల నుంచి బలాన్ని గ్రహిస్తాడు. వర్ష, శరద్‌, హేమంత రుతువులతో కూడిన విసర్గ కాలంలో బలాన్ని ప్రసాదిస్తాడు. గ్రీష్మ రుతువుతో ఆదాన కాలం ముగిసి, వర్ష రుతువుతో విసర్గ కాలం మొదలవుతుంది. ఇది మొదలయ్యేటప్పటికే మనలో కొంత బలం క్షీణించి పోయి ఉంటుంది. ఫలితంగా జఠరాగ్నీ మందగిస్తుంది. దీంతో ఆమ్లపిత్తం, అజీర్ణం, వాంతులు, విరేచనాలు, క్రిములతో తలెత్తే కలరా వంటివి పుట్టుకొస్తాయి. విషమ జ్వరాలూ సరేసరి. ఇలాంటి జబ్బులను తగ్గించుకోవటానికి ఆయుర్వేదం తేలికైన చిట్కాలతో పాటు ఔషధాలనూ సూచించింది.


ఆయుర్‌ ఆసరా

జీర్ణ సమస్యలకు

జఠరాగ్ని చురుకుగా ఉంటేనే ఆకలి సక్రమంగా వేస్తుంది, తిన్నది బాగా జీర్ణమవుతుంది. ధాతువులు పరిపుష్టమవుతాయి. జఠరాగ్ని మందగిస్తే అగ్నిమాంద్యం, అజీర్ణం, విషమాగ్ని (అసిడిటీ) వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వీటిని చిట్కాలు, ఔషధాలతో తగ్గించుకోవచ్చు. గ్యాస్‌ తగ్గాలంటే భోజనానికి ముందు, జీర్ణం కావాలంటే భోజనం తర్వాత వీటిని తీసుకోవాలి.
* సోంపు, జీలకర్ర, వాయు విడంగాలు జీర్ణ సమస్యలకు బాగా ఉపయోగపడతాయి. సోంపు ఆకలి పెరగటానికి, జీలకర్ర ఆహారం జీర్ణం కావటానికి, వాయు విడంగాలు క్రిములను హరించటానికి తోడ్పడతాయి. వీటిని విడివిడిగా చూర్ణం చేసుకొని, తర్వాత ఒకదగ్గర కలుపుకోవాలి. రోజూ చెంచాడు చూర్ణాన్ని నోట్లో వేసుకొని వేడి నీళ్లు తాగాలి. పిల్లలకైతే కషాయం చేసి ఇవ్వచ్చు. 2 గ్లాసుల నీటిలో అర చెంచా చూర్ణం వేసి.. పావు వంతు నీరు మిగిలేలా కాచి.. రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత ఇవ్వాలి.
* ఆకలి తగ్గినవారు భోజనానికి ముందు అల్లం ముక్కలను ఉప్పులో అద్ది చప్పరిస్తే ఫలితం కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కానివారు భోజనం చేశాక అరచెంచాడు దోరగా వేయించిన జీలకర్ర పొడిని నోట్లో వేసుకొని, గోరు వెచ్చని నీళ్లు లేదా మజ్జిగ తాగొచ్చు.
* చెంచాడు హింగ్వాష్టక చూర్ణాన్ని నోట్లో వేసుకొని నీళ్లు తాగితే గ్యాస్‌, అజీర్ణం తగ్గుతాయి.
* ఆకలి పెరగటానికి భాస్కర లవణ చూర్ణం తోడ్పడుతుంది. భోజనానికి ముందు చెంచాడు చూర్ణాన్ని మజ్జిగతో తీసుకోవాలి.
* జీర్ణ సమస్యలకు చిత్రకాది వటి, అగ్నితుండి వటి మాత్రలూ మేలు చేస్తాయి. వీటిని భోజనానికి ముందు ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు వేసుకోవాలి.


జలుబుకు కళ్లెం

పడిశం పది రోగాల పెట్టు అంటారు. జలుబు చేస్తే ఒళ్లు పులకరం, తుమ్ములు, దగ్గు, ముక్కు బిగుసుకుపోవటం వంటి సమస్యలెన్నో వేధిస్తుంటాయి. నోరూ రుచించదు. చల్లటి గాలి తాకటం, వాన నీటిలో తడవటం, క్రిములు దాడి చేయటం వంటివి జలుబుకు కారణం కావొచ్చు.
* వేడినీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవటం మంచిది. దీంతో ముక్కు బిగుసుకుపోవటం తగ్గుతుంది.
* నీటిలో లేదా పాలలో మిరియాల పొడిని వేసి కాచి తాగుతుంటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
* తులసి ఆకుల రసంలో మిరియాల పొడి, పసుపు కలిపి తీసుకోవచ్చు.
* తమలపాకులో ఒకట్రెండు మిరియాలు పెట్టి నమలితే గొంతునొప్పి, కఫం తగ్గుతాయి. తమలపాకు రసం, మిరియాల పొడి, తేనె కలిపి తీసుకున్నా మంచిదే.
* శొంఠి, పిప్పళ్లు, మిరియాలు పొడి చేసుకొని.. ఉదయం, సాయంత్రం చెంచాడు చొప్పున తేనెతో తీసుకోవచ్చు. ఇది త్రియూషణాది వటి, త్రికటు చూర్ణం రూపంలో దుకాణాల్లోనూ దొరుకుతుంది.
* హారతి కర్పూరం పొడిని కొబ్బరినూనెలో వేసి కాచి, చల్లారిన తర్వాత పిల్లల ఛాతీ, నుదురు, ముక్కు మీద రాస్తే జలుబును తట్టుకునే శక్తి లభిస్తుంది.
*  రాత్రిపూట పిల్లల మాడు మీద తమలపాకు, పసుపు వేసి కట్టినా జలుబు తగ్గుతుంది.
* మహాలక్ష్మీవిలాస రసం జలుబు తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఉదయం, సాయంత్రం ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి.
* రెండు గ్లాసుల నీటిలో చెంచాడు దశమూల చూర్ణాన్ని వేసి పావు వంతు మిగిలేలా కాచుకోవాలి. దీనిలో సగం ఉదయం, సగం సాయంత్రం తీసుకుంటే జలుబు, జ్వరం తగ్గుతాయి. మధుమేహులైతే భోజనానికి ముందు దశమూల క్వాథ/
కాడను, నీటిని సమాన మోతాదుల్లో (3 నుంచి 6 చెంచాలు) కలిపి తాగొచ్చు.


విరేచనాలు, వాంతులకు

వానాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దీన్ని తాగితే విరేచనాలు, వాంతులు, బంక విరేచనాలు (ప్రవాహిక) పట్టుకోవచ్చు.
* విరేచనాలు అవుతున్నప్పుడు గ్లాసు మజ్జిగలో రెండు చిటికెల ఉప్పు, అర చెంచా చక్కెర కలిపి తీసుకుంటే మంచిది. దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. జీర్ణకోశవ్యవస్థ కూడా మెరుగవుతుంది.
* విరేచనాలు తగ్గటానికి సగ్గుబియ్యం జావ మేలు చేస్తుంది.
*బంక విరేచనాలు తగ్గాలంటే మారేడు గుజ్జులో చక్కర కలిపి తీసుకోవచ్చు. మజ్జిగలో చెంచాడు బిల్వాది చూర్ణం కలిపి తీసుకున్నా మంచిదే.
* నేయి లేదా నూనె దీపంతో నెమలి ఈకలను కాల్చి మసి చేసి, దాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
* కర్పూరాది వటి లేదా జాతీపలాది వటి మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున వేసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
* మయూర పింఛ భస్మాన్ని 5-6 గురిగింజల ఎత్తు తీసుకొని తేనె లేదా నెయ్యిలో కలిపి తీసుకుంటే వాంతులు ఉపశమిస్తాయి.


విషమ జ్వరాలకు

సంతతం, సతతం, అన్యేద్యుష్కం, తృతీయకం, చాతుర్థికం అని విషమ జ్వరాలు ఐదు రకాలు. వీటికి ఓ పద్ధతంటూ ఉండదు. జ్వరం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు (విషమారంభ విసర్జిత్వం). సంతత జ్వరం 7 లేదా 10 లేదా 12 రోజుల పాటు విడవకుండా వేధిస్తుంది. సతత జ్వరం రోజుకు రెండు సార్లు.. పగలు, రాత్రి వస్తుంటుంది. పగలు రెండు సార్లు, రాత్రి రెండు సార్లు కూడా రావొచ్చు. రోజుకోసారి వచ్చేది అన్యేద్యుష్క జ్వరం. తృతీయక జ్వరం మూడు రోజులకోసారి, చాతుర్థిక జ్వరం రెండు రోజులు తప్పించి ప్రతి నాలుగు రోజులకు వస్తుంటుంది. విషమ జ్వరాలు దుర్బలంగా ఉంటాయి కాబట్టి వీటికి శమన చికిత్సలే కీలకం. లంఖణం పరమౌషధమని ఆయుర్వేదం చెబుతుంది గానీ విషమ జ్వరాలకు ఇందంత ఉపయుక్తం కాదు. ఇవి వాత ప్రధానమైనవి కావటం వల్ల తేలికగా జీర్ణమయ్యే లఘు ఆహారం తీసుకోవాలి.
* వయసును బట్టి శీతాంశు రసాన్ని ఒకటి నుంచి రెండు మాత్రలు వేసుకోవచ్చు. అయితే చిన్నపిల్లలకు వీటిని ఇవ్వద్దు. ఎనిమిదేళ్లు దాటిన పిల్లలకైతే సగం మాత్ర చొప్పున ఇవ్వచ్చు. మహా శీతాంశు రసం ఇంకా బాగా పనిచేస్తుంది.
* విషమ జ్వరాంతక వటి మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున వేసుకుంటుంటే జ్వరం ఉపశమిస్తుంది.
* దీర్ఘకాలంగా వేధించే జ్వరానికి పుటపక్వ విషమ జ్వరాంతక లోహం బాగా ఉపయోగపడుతుంది. గుడూచి సత్వం, గోదంతి భస్మంతో కలిపి దీన్ని తీసుకుంటే ఇంకా మంచిది. పుటపక్వ విషమ జ్వరాంతక లోహాన్ని 2-3 గురిగింజల ఎత్తు, గూడూచి సత్వం అర చెంచా, గోదంతి భస్మం 3-4 గురిగింజల ఎత్తు చొప్పున ఉదయం, సాయంత్రం వేసుకోవాలి.
విషమ జ్వరాలకు సుదర్శన చూర్ణం రామబాణంలా పనిచేస్తుంది. దీన్ని అర చెంచా నుంచి ఒక చెంచా చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. అవసరమైతే మధ్యాహ్నమూ తీసుకోవచ్చు.


కొన్ని జాగ్రత్తలు

* వానాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగటం మంచిది. తేలికగా జీర్ణమయ్యే, అప్పుడే వండిన ఆహారం తినాలి. రోజూ ఆహారంలో నెయ్యి, పప్పులు, పెసల వంటివి ఉండేలా చూసుకోవాలి. నోటికి రుచిని కలిగించే ఉప్పగా, పుల్లగా, నూనెతో కూడిన పదార్థాలు తీసుకోవాలి. పెరుగు కన్నా మజ్జిగ తినటం మంచిది.
* శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత తగ్గితే క్రిములు (వైరస్‌లు) దాడి చేసే ప్రమాదముంది.
* వర్షపు నీటిలో తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ తడిస్తే వెంటనే దుస్తులు విడిచేసి, పొడి దుస్తులు వేసుకోవాలి. పాదాలు పొడిగా ఉంచుకోవాలి.


వర్షాకాలంలో కొందరికి కొన్ని సమస్యలు మొదలవ్వచ్చు. కొందరికి అప్పటికే ఉన్న సమస్యలు  తీవ్రం కావొచ్చు. నిజానికి వర్షంలో తడిసినా, చల్లటి గాలి ప్రభావానికి గురైనా అందరికీ సమస్యలు రావాలనేమీ లేదు. దీనికి కారణం వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరే. ఇది దెబ్బతింటే రకరకాల జబ్బులు తేలికగా దాడి చేస్తాయి. తరచూ బాహ్య కారణాలు ప్రభావం చూపుతుంటే అంతర్గత కీలక వ్యవస్థలూ గాడి తప్పొచ్చు. బలహీన పడొచ్చు. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే హోమియో వైద్య విధానం వ్యాధి లక్షణాల కన్నా శరీర తత్వం, వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రోగ లక్షణాలు తగ్గేలా చేసే మందులతో పాటు మళ్లీ తిరగబెట్టకుండా శరీర తత్వాన్ని బట్టి వాడుకోవాల్సిన మందులనూ సూచిస్తుంది.


హోమియో బాసట

ప్రముఖం రస్టాక్స్‌

  వర్షకాలంలో ప్రముఖంగా చెప్పుకోదగిన ఔషధమిది. వాన కురిసే ముందు ముఖ్యంగా తుపాన్లు వచ్చే ముందు తలెత్తే బాధలకిది మంచి మందు. జలుబు, కీళ్లవాతం, కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, జ్వరం.. ముఖ్యంగా టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగ పడుతుంది. కొందరికి విశ్రాంతిగా ఉన్నప్పుడు నొప్పులు, బాధలు పెరుగుతుంటాయి. నిద్రలేవటంతోనే కండరాలు, కీళ్లు బిగపట్టుకొని పోయి ఉంటాయి. ఇలాంటివారికి రస్టాక్స్‌ బాగా పనిచేస్తుంది. పగటి పూట కన్నా రాత్రి పూట.. అదీ అర్ధరాత్రి బాధలు ఎక్కువుతున్నట్టు గమనిస్తే దీన్ని వాడుకోవచ్చు. అర్ధరాత్రి దాటాక పొట్టలో నొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడే పిల్లలకు, అస్థిమితంగా ఉండేవారికిది మంచి ఉపశమనం కలగజేస్తుంది. వానలో తల తడిచిన తర్వాత జలుబు, దగ్గు, తుమ్ముల వంటి బాధలు ఎక్కువయ్యేవారికీ బాగా పనిచేస్తుంది. ఏవైనా బరువు పనులు చేసినా, శారీరక శ్రమ చేసినా బాధలు ఎక్కువయ్యేవారి విషయంలో దీన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.


జలుబు, దగ్గుకు ఆర్సెనికం ఆల్బ్‌

వర్షకాలంలో ప్రతిసారీ జలుబు, దగ్గులకు తప్పకుండా గురయ్యేవారికిది దివ్యమైన ఔషధం. ఆహారం కలుషితం కావటం వల్ల పట్టుకునే విరేచనాలు, వాంతులను తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. ఈ కాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులకూ ఉపయోగపడుతుంది. ఆస్థమా బాధితులకు.. ముఖ్యంగా అర్ధరాత్రి 12 నుంచి ఒంటి గంట సమయంలో ఆయాసానికి గురయ్యేవారికి మంచి మందు. మూత్రంలో సుద్ద (ఆల్బుమిన్‌ యూరియా) సమస్యతో సతమతమయ్యేవారికీ ఉపశమనం కలిగిస్తుంది. వాంతులు, విరేచనాలు ఒకే సమయంలో అవుతున్నవారికి ఆర్సెనికం ఆల్బ్‌ ప్రత్యేకమైన ఔషధం. ఇది నిస్త్రాణ తగ్గటానికీ తోడ్పడుతుంది. వాతావరణం సరిపడక, వానలో తడవటం వల్ల అరుదుగా కొందరికి పక్షవాతం వంటి నాడీ సమస్యలూ బయలుదేరొచ్చు. కింది నుంచి అవయవాలు చచ్చుబడిపోవటం మొదలైనవారికి ఆర్సెనికం ఆల్బ్‌ ముఖ్యమైన ఔషధమని గుర్తుంచుకోవాలి.


వానాకాలం టీకా డల్కమారా

డల్కమారాను వానాకాలం టీకాగా వర్ణించుకోవచ్చు. ఇది ఈ కాలంలో తలెత్తే శ్వాసకోశ సమస్యలు తగ్గటానికే కాదు.. వాటి నివారణకూ ఉపయోగపడుతుంది మరి. వానాకాలంలో తలెత్తే శ్వాసకోశ సమస్యలకు గురయ్యేవారికి డల్కమారా మంచి ఔషధం. ఎండ కాస్తూ కాస్తూ.. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోవటం మూలంగా తలెత్తే సమస్యలకిది బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, కఫం పడటం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టటానికి తోడ్పడుతుంది. కఫంలో రక్తం పడుతున్నా దీన్ని గుర్తుంచుకోవాలి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఈ కాలంలో ఆ సమస్య తగ్గిపోయి.. కొత్తగా శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నట్టు గమనిస్తే దీన్ని వాడుకోవటం ఉత్తమం. జలుబు చేసినపుడు దగ్గు, తుమ్ములతో పాటు చర్మం మీద దద్దు (అర్టికేరియా) కూడా ఉన్నట్టు గమనిస్తే డల్కమారా తీసుకోవచ్చు. అలాగే వర్షకాలంలో పట్టుకునే నీళ్ల విరేచనాలకూ ఇది ముఖ్యమైన ఔషధమే. మలం ఆకుపచ్చగా ఉంటున్నా, పల్చగా నీళ్లలాగా విరేచనం అవుతున్నా దీన్ని వాడుకోవటం మంచిది.


ఉబ్బసానికి నేట్రం సల్ఫ్‌

తేమ, చల్లటి వాతావరణంలో పట్టుకునే ఉబ్బసం, నీళ్ల విరేచనాలు తగ్గటానికిది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో ఆయాసం ఎక్కువయ్యేవారికి దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో ఆస్థమాకు నేట్రం సల్ఫ్‌ దివ్యంగా పనిచేస్తుంది. పిల్లికూతలు, శ్లేష్మం ఎక్కువగా ఉండేవాళ్లు దీన్ని వాడుకోవచ్చు. ఛాతీలో నొప్పి.. ముఖ్యంగా ఎడమవైపున నొప్పి వచ్చేవారికి ఉపయోగపడుతుంది.


మలేరియాకు నేట్రం మూర్‌

మలేరియా జ్వరానికి నేట్రం మూర్‌ విశిష్టమైన మందు. మలేరియా జ్వరంతో శుష్కించి, పాలిపోయి నీరసంగా ఉన్నవారు దీన్ని వాడితే త్వరగా కోలుకుంటారు. తల బద్దలవుతున్నట్టుగా నొప్పి, చలి, జ్వరం గలవారికిది ఎంతో మేలు చేస్తుంది. కొందరికి మలేరియా జ్వరం చలితో మొదలై, వాంతులకు దారితీస్తుంటుంది. ఇలాంటివారికిది బాగా ఉపయోగపడుతుంది.
 

* వీటిని 30 పొటెన్సీలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి లక్షణాలు తగ్గేవరకు వేసుకోవచ్చు.


దీర్ఘకాల మందులు: శరీర తత్వాన్ని బట్టి

ఏ కాలంలోనైనా వచ్చే వ్యాధులకు.. వాతావరణం మారినప్పుడల్లా తలెత్తే సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికివి తోడ్పడతాయి. వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత 30 పొటెన్సీలో వారానికి ఒకసారి చొప్పున 4-6 వారాలు వాడుకోవాలి.


ఎడమవైపు సమస్యలకు లేకిసిస్‌

ఒంట్లో ఎడమవైపున సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీని గురించి ఆలోచించాలి. వీరిలో ఈ సమస్యలు ఎడమవైపు మొదలై.. కుడివైపు వ్యాపిస్తుంటాయి. వీరికి నిద్ర పట్టిన తర్వాత సమస్యలు ఉద్ధృతమవుతాయి. ఆయా బాధలతో నిద్రలోంచి లేస్తుంటారు కూడా. కొందరు శ్వాస ఆగిపోయి, ఉలిక్కి పడి లేస్తుంటారు (స్లీప్‌ అప్నియా). వీరికి అసూయ ఎక్కువ. నిష్కారణంగా అనుమానిస్తుంటారు. అతిగా మాట్లాడుతుంటారు కూడా. మాటిమాటికీ తలనొప్పి, గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. మహిళల్లో నెలసరి దగ్గరపడుతున్నకొద్దీ సమస్యలు ఎక్కువవుతుంటాయి. నెలసరి తర్వాత తగ్గిపోతుంటాయి. కుడివైపున వచ్చే సయాటికాకు కూడా ఇది మంచి మందు. సిరలు ఉబ్బి పుండ్లు పడ్డవారికి ముఖ్య ఔషధం.


ఉదయం సమస్యలకు సల్ఫర్‌

రుతువులు మారినప్పుడల్లా బాధలకు గురయ్యేవారికిది ప్రధానమైన ఔషధం. సమస్యలు ఉదయం 11 గంటల సమయంలో ఎక్కువ కావటం వీరి ప్రత్యేకత. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటివి ఎక్కువవుతుంటే సల్ఫర్‌ గురించి ఆలోచించాలి. ఉదయం పూట విరేచనాలు అవుతూ.. మధ్యాహ్నానికి తగ్గిపోయేవారికిది బాగా పనిచేస్తుంది. వీరు పరిశుభ్రతను అంతగా పట్టించుకోరు. తేమ వాతావరణంలో బాధలు ఎక్కువవుతాయి. మలబద్ధకం, ఆసనంలో మంట, మొలల వంటి సమస్యలూ వీరికి ఎక్కువే. తీపి బాగా ఇష్ట పడుతుంటారు. మద్యం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. వీరికి తెలివితేటలతో పాటు గర్వం కూడా ఎక్కువే.


ఆదుర్దాకు సైలీషియా

ప్రతిదానికీ ఆదుర్దా పడేవారికిది మంచి మందు. వీరు రైలు వచ్చే సమయానికి చాలా ముందుగానే ఇంటి నుంచి బయలుదేరుతుంటారు. చిన్నపిల్లలకు పరీక్షలంటే భయం. వీరికి సిగ్గు, బిడియం ఎక్కువ. పిరికితనం, మొండితనం కూడా. అరిచేతులు, అరికాళ్లు చల్లగా ఉంటాయి. చెమటలు ఎక్కువ. మేజోళ్లు తీసేస్తే దుర్వాసన వస్తుంటుంది. కుడివైపున వచ్చే పార్శ్వనొప్పికీ ఇది మంచి ఔషధం. విసర్జన సమయంలో మలం ఆసనం దాకా వచ్చి వెనక్కి మళ్లుతుంటుంది. టీకాలు ఇచ్చిన తర్వాత తలెత్తే బాధలన్నింటికీ సైలీషియా బాగా పనిచేస్తుంది. దుమ్మూ ధూళిలో పనిచేయటం వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలకు ఉపయోగపడుతుంది. తలలో చెమటలు పోస్తుంటే ముందుగా ఆలోచించాల్సిన మందు ఇదే. పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి.. కాళ్లు, చేతులు సన్నగా ఉండేవారికీ పనిచేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని