మధుమేహ పిల్లలకు కృత్రిమ పాంక్రియాస్‌ వరం!

రక్తంలో గ్లూకోజు నియంత్రణకు ఇన్సులిన్‌ కీలకం. కణాల్లోకి గ్లూకోజు వెళ్లేలా చేసేది ఇదే. ఒకరకంగా దీన్ని తాళం చెవితో పోల్చొచ్చు. ఒకవేళ కణాలు దీనికి స్పందించకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి

Updated : 23 May 2023 06:24 IST

రక్తంలో గ్లూకోజు నియంత్రణకు ఇన్సులిన్‌ కీలకం. కణాల్లోకి గ్లూకోజు వెళ్లేలా చేసేది ఇదే. ఒకరకంగా దీన్ని తాళం చెవితో పోల్చొచ్చు. ఒకవేళ కణాలు దీనికి స్పందించకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. దీన్నే టైప్‌ 2 మధుమేహం అంటారు. అయితే కొందరిలో ఇన్సులిన్‌ అసలే ఉత్పత్తి కాదు. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాల మీద దాడి చేసి, వాటిని దెబ్బతీయటం దీనికి మూలం. ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవటం వల్ల గ్లూకోజు కణాల్లోకి చేరుకోదు. అప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువవుతాయి. దీన్నే టైప్‌ 1 మధుమేహం అంటారు. ఇది తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. టైప్‌ 1 మధుమేహం గలవారు తరచూ గ్లూకోజు పరీక్ష చేసుకుంటూ, ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతటా ఇదే చికిత్సను అనుసరిస్తున్నారు. తాజాగా పరిశోధకులు కృత్రిమ క్లోమ వ్యవస్థల మీద దృష్టి సారిస్తున్నారు. ఇవి క్లోమగ్రంథి మాదిరిగా తమంతట తామే పనిచేసే పద్ధతులు. వీటిల్లో రక్తంలో గ్లూకోజు మోతాదులను పసిగట్టే మానిటర్‌, ఇన్సులిన్‌ పంప్‌ ఉంటాయి. మానిటర్‌ ఎప్పటికపుడు పంప్‌నకు సమాచారాన్ని పంపిస్తుంది. రక్తంలో గ్లూకోజు పెరిగినప్పుడు పంప్‌ ఇన్సులిన్‌ను సరఫరా చేస్తుంది. ఇలాంటి కృత్రిమ క్లోమ వ్యవస్థలు పెద్దవారిలో, పెద్ద పిల్లల్లో బాగా పనిచేస్తున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల వీటిని రెండు నుంచి ఐదేళ్ల వయసు పిల్లల మీదా శాస్త్రవేత్తలు పరీక్షించారు. ప్రస్తుత ప్రామాణిక చికిత్స తీసుకున్న పిల్లలతో పోలిస్తే కృత్రిమ క్లోమ వ్యవస్థతో చికిత్స తీసుకున్న పిల్లల్లో రక్తంలో గ్లూకోజు మోతాదులు మరింత నిలకడగా ఉంటున్నట్టు తేలింది. రాత్రివేళల్లో.. అంటే పిల్లలు నిద్రిస్తున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఫలితం కనిపిస్తున్నట్టు బయటపడింది. రోజంతా గ్లూకోజు నియంత్రణలో ఉండటానికి ఇలాంటి పద్ధతులు ఎంతగానో ఉపయోగపడగలవని నిపుణులు చెబుతున్నారు. టైప్‌ 1 మధుమేహంతో దీర్ఘకాలంలో తలెత్తే దుష్ప్రభావాలు గురించి ఆందోళన చెందటం తగ్గుతుందని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని