బాల ఎముక భలే

పిల్లలను చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. మెత్తటి చర్మం, చిన్న వేళ్లు, అందమైన కాళ్లు,  లేత బుగ్గలు, బుజ్జి పొట్టతో ముట్టుకుంటే కందిపోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు

Published : 20 Feb 2024 00:57 IST

పిల్లలను చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. మెత్తటి చర్మం, చిన్న వేళ్లు, అందమైన కాళ్లు,  లేత బుగ్గలు, బుజ్జి పొట్టతో ముట్టుకుంటే కందిపోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు. వీరిలో ఎముకలూ మృదువుగానే ఉంటాయి. పెద్దవారి కన్నా భిన్నంగానూ ఉంటాయి. వీటి తీరూ చిత్రంగా ఉంటుంది.

పిల్లలు వయసులో చిన్నవారే అయినా ఎముకల సంఖ్యలో పెద్దవారే! విచిత్రంగా అనిపిస్తోందా? పిల్లల్లో పెద్దవాళ్ల కన్నా సుమారు 100 ఎముకలు ఎక్కువగా ఉంటాయి మరి. నవజాత శిశువుల్లో 275 నుంచి 300 ఎముకలుంటే పెద్దవారిలో 206 మాత్రమే ఉంటాయి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ ఒకేలాంటి ఎముకలు కలిసిపోయి పెద్దగా అవుతాయి. ఇంతకీ పిల్లలకు ఎక్కువ ఎముకలు ఎందుకుంటాయి? చిన్న, మృదువైన ఎముకలు పిల్లల శరీరం తేలికగా సాగటానికి తోడ్పడతాయి. తల్లి కడుపులో గిరికీలు కొట్టటానికి, కాన్పు సమయంలో బయటకు రావటానికిది అత్యవసరం. పెద్దవారిలో మాదిరిగా పొడవైన, గట్టి ఎముకలుంటే కష్టం కదా.

 మృదులాస్థిగా మొదలై..

 పిల్లల ఎముకలు చాలావరకూ మృదులాస్థి రూపంలో మొదలవుతాయి. ఇవి రబ్బరు మాదిరిగా ఉన్నా గట్టిగానే ఉంటాయి. ఎదుగుతున్నకొద్దీ కొన్ని కలిసిపోతాయి. ఎముక గూడు కట్టే క్రమంలో (ఆసిఫికేషన్‌) గట్టిగా అవుతాయి. శిశువుల మాడు మెత్తగా ఉండటం గమనించే ఉంటారు. కాన్పు సమయంలో తల తేలికగా బయటకు రావటానికి వీలుగా శిశువుల పుర్రెలో ఐదు పెద్ద ఎముకలుంటాయి. వీటి మధ్యలోని ఖాళీ భాగమే మాడు. పుట్టిన తర్వాత ఒకట్రెండు ఏళ్లలో పుర్రె ఎముకలన్నీ కలిసిపోయి మాడు పూడుతుంది. ఎముక గట్టిగా అవుతుంది. తల్లి గర్భంలో తొలి మూడు నెలల్లో ఎముకలు ఏర్పడటం మొదలవుతుంది. అనంతరం చిన్న చిన్న ఎముకలు కలవటం ఆరంభమవుతుంది. పిల్లలకు 16 ఏళ్లు వచ్చేవరకూ ఎముకలు ఎదుగుతూనే వస్తుంటాయి. దీంతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయి. బాల ఎముక సాధారణంగా తనకుతానే పునర్నించుకుంటుంది. అంటే ఎముక విరిగితే కొంతకాలానికి తిన్నగా అయ్యే అవకాశముంది. కానీ ఎముక వృద్ధి చెందే చోట.. అంటే పొడవాటి ఎముకల చివర్లో విరిగితే మాత్రం ఎత్తు తగ్గే అవకాశముంది. కాళ్లూ చేతుల ఆకారమూ మారిపోవచ్చు.

పోషకాలు అవసరం

ఎముక గూడు కట్టటానికి, బలంగా కావటానికి రకరకాల పోషకాలు అవసరం. గర్భంలో ఉన్నప్పుడు పిండంలో ఎముక వృద్ధికి అవసరమైన క్యాల్షియం తల్లి నుంచి లభిస్తుంది. ఈ సమయంలో తగినంత క్యాల్షియం అందకపోతే పెద్దయ్యాక ఎముక క్షీణత తలెత్తే అవకాశముంది. ఒక్క క్యాల్షియమే కాదు.. విటమిన్‌ డి కూడా ముఖ్యమే. ఇది తల్లిపాలలో అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి విటమిన్‌ డి చుక్కల మందు వాడుకోవాల్సి వస్తుంది. వ్యాయామం కూడా పిల్లల ఎముకలకు బలం చేకూరుస్తుంది. శిశువులు బోర్లా పడటం, పాకటం, నిల్చోవటం, నడవటం వంటివన్నీ వ్యాయామం కిందికే వస్తాయి. నడవటం అలవాటయ్యాక బాగా ఆటలాడుకునేలా ప్రోత్సహించాలి. పరుగెత్తటం, గెంతటం, ఆడుకోవటమంటే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లల ఎముకల వృద్ధికివి అత్యవసరం. ఇలాంటి శారీరక శ్రమతో ఎముక మరింత బలంగా తయారవుతుంది. అలాగే పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని