ముందు కంగారూ చికిత్సే

నవజాత శిశువులు తల్లి సమక్షంలోనే భద్రంగా ఉన్నామని భావిస్తారు. తల్లి స్పర్శతో లభించే వెచ్చదనంతో ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

Updated : 06 Dec 2022 05:58 IST

నవజాత శిశువులు తల్లి సమక్షంలోనే భద్రంగా ఉన్నామని భావిస్తారు. తల్లి స్పర్శతో లభించే వెచ్చదనంతో ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది. నెలలు నిండక ముందే పుట్టినవారికి, తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ఇది మరింత ముఖ్యం. కాబట్టే వీరికి ఏవైనా ఇబ్బందులు మొదలైతే ముందు తల్లి ఛాతీ మీద పడుకోబెట్టే కంగారూ చికిత్స చేయాలని, ఆ తర్వాతే ఇంక్యుబేటర్‌లో పెట్టాలంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలను సవరించింది. వెంటిలేటర్‌తో శ్వాస అందించాల్సిన వారికి తప్ప అందరికీ ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15-20% మంది నెలలు నిండకముందే (37 వారాలకు ముందే) లేదా తక్కువ బరువుతో (2.5 కిలోల కన్నా తక్కువ) పుడుతున్నారని అంచనా. వీరికి శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇలాంటివారిని కుదురుకునే వరకు ఇంక్యుబేటర్‌లో పెట్టి, తర్వాత కంగారూ చికిత్స చేయాలని ఒకప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. దాన్ని ఇప్పుడు మార్చింది. ఇంక్యుబేటర్‌లో పెట్టటానికన్నా ముందు కంగారూ చికిత్సే చేయాలని స్పష్టం చేసింది. ముందుగా ఇంక్యుబేటర్‌లో పెట్టిన పిల్లలతో పోలిస్తే- పుట్టగానే ఎక్కువసేపు కంగారూ చికిత్స చేశాక ఇంక్యుబేటర్‌లో పెట్టిన పిల్లలకు నెల లోపు మరణించే ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు తేలిన అధ్యయన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ సిఫారసు చేసింది. కంగారూ చికిత్సతో రోగనిరోధక శక్తి పెరగటం, ఒత్తిడి తగ్గటం శిశు మరణాలు తగ్గటానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని