పిల్లలకు చిరు అలవాటు!

చిరుధాన్యాలను పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు.. ఏ వయసువారైనా తినొచ్చు. అయితే ఎలా ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యం. చిన్న పిల్లలకు వీటిని ఇచ్చేటప్పుడు పీచు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

Published : 24 Jan 2023 00:09 IST

చిరుధాన్యాలను పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు.. ఏ వయసువారైనా తినొచ్చు. అయితే ఎలా ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యం. చిన్న పిల్లలకు వీటిని ఇచ్చేటప్పుడు పీచు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. పీచు ఎక్కువగా ఉంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు అంతగా అందవు. వీరికి పొడుల రూపంలో (మాల్ట్‌) ఇవ్వటం ఉత్తమం. చిరుధాన్యాలను ఆరేడు గంటలసేపు నానబెట్టి, రాత్రంతా బట్టలో మూటగడితే తెల్లారేసరికల్లా మొలకలు వస్తాయి. వీటిని నీడలో ఆరబెట్టి, దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలలో కలిపి ఇస్తే పిల్లలకు తేలికగా జీర్ణం అవుతుంది. ఇందులో పప్పుల పొడి కలిపితే ఇంకా మంచిది. నాలుగు వంతుల మాల్ట్‌కు ఒక వంతు వేయించిన పెసరపప్పు లేదా శనగపప్పు పొడిని కలపాలి. అలాగే దీనికి గరిటెడు వేయించి పొడి చేసిన పల్లీలు గానీ నువ్వులు గానీ జోడించాలి. ఇందులోనే తగినంత బెల్లం లేదా చక్కెర కలిపితే అనుబంధ ఆహారంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు వేడి నీళ్లలో గానీ పాలలో గానీ కలిపి పిల్లలకు ఇవ్వచ్చు. తియ్యగా ఉంటుంది కాబట్టి ఇష్టంగానూ తాగుతారు. క్యాల్షియం, ఐరన్‌, మాంసకృత్తుల వంటివన్నీ లభించటం వల్ల జబ్బుల నుంచి కోలుకుంటున్నవారికి, ఘనాహారం తీసుకోలేనివారికీ ఈ మిశ్రమం మేలు చేస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు చిరుధాన్యాలతో దోశలు, చపాతీలు, అటుకుల ఉప్మా వంటివి చేసి, లంచ్‌బాక్స్‌లో పెట్టి ఇవ్వచ్చు. బిర్యానీలు, చిత్రాన్నాలూ చేసి పెట్టొచ్చు. పెద్దవారిలోనే కాదు.. ఇప్పుడు చిన్నపిల్లల్లోనూ ఊబకాయం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే చిరుధాన్యాలను అలవాటు చేస్తే పెద్దయ్యాకా తినటం అలవడుతుంది. పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారు. చిరుధాన్యాలను పెద్దవాళ్లు గౌరవిస్తేనే పిల్లలూ గౌరవిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు