పిల్లలను కాపాడే నిద్ర టూల్‌

ఆరోగ్యంగానే ఉంటారు. ఎలాంటి సమస్యలూ ఉండవు. అయినా పిల్లల్లో కొందరు హఠాత్తుగా చనిపోతుంటారు. దీన్ని సడెన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (సిడ్స్‌) అంటారు.

Published : 05 Mar 2024 00:02 IST

రోగ్యంగానే ఉంటారు. ఎలాంటి సమస్యలూ ఉండవు. అయినా పిల్లల్లో కొందరు హఠాత్తుగా చనిపోతుంటారు. దీన్ని సడెన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (సిడ్స్‌) అంటారు. చాలావరకు ఏడాదిలోపు పిల్లల్లో, అదీ నిద్రలోనే ఎక్కువగా తలెత్తుతుంటుంది. దీనికి కారణమేంటనేది తెలియదు. కానీ శ్వాస తీసుకోవటాన్ని, నిద్రలోంచి మేల్కొనటాన్ని నియంత్రించే మెదడు భాగంలో సమస్యలు కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి మరణాల నుంచి పిల్లలను కాపాడుకోవటానికి యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులు వెబ్‌ ఆధారిత నిద్ర నియమ (స్లీప్‌ ప్లానర్‌) టూల్‌ రూపొందించారు. సిడ్స్‌ ముప్పు గల పిల్లలను గుర్తించటానికి, నిద్రలో ఆపద తలెత్తకుండా చూసుకోవటానికిది కొత్త సాధనం కాగలదని భావిస్తున్నారు. యునిసెఫ్‌, నైస్‌కు చెందిన లల్లబీ ట్రస్ట్‌ సలహా సాయంతో పనిచేసే ఇది కాన్పు సమయంలోనే సిడ్స్‌ ముప్పును అంచనా వేసి చెబుతుంది. ఒకవేళ ముప్పు పొంచి ఉంటే పిల్లల భద్రత కోసం నిద్ర తీరుతెన్నులను వివరించే నియమాలను సూచిస్తుంది. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ స్లీప్‌ ప్లానర్‌ టూల్‌ను డాక్టర్లు, నర్సులు, కుటుంబసభ్యులతోనూ పరీక్షించారు. సిడ్స్‌ ముప్పు గల పిల్లల కుటుంబాలకు ఇది ఎంతగానో తోడ్పడుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలోని సమాచారం విశ్వసనీయంగా, సముచితంగా ఉందని కుటుంబాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు దీనిపై పెద్దఎత్తున అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇది విజయవంతమైతే సిడ్స్‌ ముప్పు గల పిల్లల కుటుంబాలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని