Cleft: గ్రహణం మొర్రికి శస్త్రచికిత్స త్వరగా..

సమస్య ఆరంభంలోనే సత్వరం చికిత్స చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌) విషయంలో ఇది మరింత ముఖ్యమని కరోలిన్‌స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌ తాజా అధ్యయనం పేర్కొంటోంది.

Updated : 10 Oct 2023 01:13 IST

మస్య ఆరంభంలోనే సత్వరం చికిత్స చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌) విషయంలో ఇది మరింత ముఖ్యమని కరోలిన్‌స్కా యూనివర్సిటీ హాస్పిటల్‌ తాజా అధ్యయనం పేర్కొంటోంది. పన్నెండు నెలల వయసులో గ్రహణం మొర్రి శస్త్రచికిత్స చేయటంతో పోలిస్తే ఆరు నెలల సమయంలోనే సరిచేస్తే మాటలు రావటం, భాషా నైపుణ్యాలు అబ్బటం మెరుగ్గా ఉంటున్నట్టు బయటపడింది. గ్రహణం మొర్రి పుట్టుకతో వచ్చే సమస్య. వీరి నోట్లో అంగిలి సరిగా మూసుకోదు. సాధారణంగా పిండంలో ఆరు నుంచి 9 వారాల సమయంలో అంగిలి ఏర్పడుతుంది. అయితే కొందరిలో అంగిలి కణజాలం పూర్తిగా కలవదు. దీంతో ముక్కు, నోరు మధ్య ఖాళీ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 1-25 మంది దీంతో పుడుతుంటారు. దీనికి శస్త్రచికిత్స చేసి సరిచేయాల్సి ఉంటుంది. అయితే ఏ వయసులో చేస్తే మంచి ఫలితం ఉంటుందనే దానిపై పెద్దగా రుజువులు లేవు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం మార్గనిర్దేశం చేస్తోంది. ఈ పరిశోధనలో కొందరు పిల్లలకు 6 నెలలకు, మరికొందరికి 12 నెలలకు శస్త్రచికిత్స చేశారు. ఆరు నెలల వయసులో శస్త్రచికిత్స చేయించుకున్న పిల్లల్లో మాట్లాడుతున్నప్పుడు, మింగుతున్నప్పుడు నోరు, ముక్కు రంధ్రాలను వేరు చేసే కండర వలయం (వెలోఫారింజియల్‌ స్ఫింక్టర్‌) మరింత బాగా మెరుగ్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు.. వీరికి అత్తాత్త, తాత్తాత వంటి ముద్దు పలుకులూ ఎక్కువగా వస్తున్నట్టూ బయటపడింది. ఇలాంటి ముద్దు పలుకులను పిల్లల్లో భాషా నైపుణ్య అభివృద్ధికి గీటురాయిగా పరిగణిస్తుంటారు. ఇది కనీసం 10 నెలల వయసులో అబ్బుతుంటుంది. మొత్తమ్మీద గ్రహణం మొర్రికి వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేసి, సరిచేయటం ముఖ్యమని అధ్యయన ఫలితాలు గట్టిగా సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని