శిశువు మెదడుకు తల్లిపాల బలం!

బిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. ఆరు నెలలు వచ్చేవరకు శిశువుకు తల్లిపాలు తప్ప మరోటి ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు కూడా.

Published : 08 Aug 2023 00:12 IST

బిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. ఆరు నెలలు వచ్చేవరకు శిశువుకు తల్లిపాలు తప్ప మరోటి ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు కూడా. వీటి గొప్పతనం గురించి మరో సంగతి బయటపడింది. చనుబాలలోని మేయో-ఇనాసిటోల్‌ అనే చక్కెర శిశువుల మెదడు ఎదుగుదలకు గణనీయంగా తోడ్పడుతున్నట్టు టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పుట్టినప్పటి నుంచీ మెదడులో అనుసంధానాలు ఏర్పడుతూ, మెరుగవుతూ వస్తుంటాయి. ఇందుకు జన్యు, పర్యావరణ పరమైన అంశాలతో పాటు జీవితంలో ఎదురయ్యే అనుభవాలూ దారి చూపుతుంటాయి. సూక్ష్మ పోషకాల పాత్రా తక్కువేమీ కాదు. ముఖ్యంగా శిశువుల్లో చనుబాలు ముఖ్యభూమిక పోషిస్తాయి. శిశువుల వివిధ దశల్లో మెదడు ఎదుగుదలకు అనుగుణంగా చనుబాలలోని పోషకాల మోతాదులు మారిపోతుండటం ఆశ్చర్యకరం. తొలినెలల్లో తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్‌ పెద్దమొత్తంలో ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమయంలోనే శిశువుల మెదడులో నాడీ అనుసంధానాలు (సినాప్సెస్‌) చాలా వేగంగా ఏర్పడుతుంటాయి కూడా. నాడుల మధ్య ఈ అనుసంధానాల పరిమాణం, సంఖ్య పెరగటానికి మేయో-ఇనాసిటోల్‌ తోడ్పడుతున్నట్టు తేలింది. రక్తంలోని హానికారకాలు మెదడులోకి చేరకుండా అడ్డుకునే బ్యారియర్‌ బిడ్డ పుట్టిన తొలినాళ్లలో అంత సమర్థంగా పనిచేయదు. అందువల్ల ఆహారానికి శిశువు మెదడు చాలా ఎక్కువగా స్పందిస్తుండొచ్చని భావిస్తున్నారు. మెదడు సంపూర్ణ ఆరోగ్యానికి ఏయే దశల్లో ఎంత మేయో-ఇనాసిటోల్‌ అవసరమనేది తేలలేదు గానీ మొత్తానికిది మంచి ఫలితం చూపిస్తుండటం గమనార్హం. మరింత మెరుగైన పోతపాల పొడి తయారీకీ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని