ఎండకు బాల గుండెలు జాగ్రత్త!

ఎండ వేడిని తట్టుకోవటం ఎవరికైనా కష్టమే. గుండెలో రంధ్రాలతో పుట్టిన పిల్లలకైతే మరీ కష్టం. పుట్టిన తర్వాత గుండెజబ్బుల బారినపడే చిన్నారులకూ ఇబ్బందే. అందువల్ల వేసవిలో ఇలాంటి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవటం తప్పనిసరి.

Published : 02 May 2023 00:41 IST

ఎండ వేడిని తట్టుకోవటం ఎవరికైనా కష్టమే. గుండెలో రంధ్రాలతో పుట్టిన పిల్లలకైతే మరీ కష్టం. పుట్టిన తర్వాత గుండెజబ్బుల బారినపడే చిన్నారులకూ ఇబ్బందే. అందువల్ల వేసవిలో ఇలాంటి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవటం తప్పనిసరి.

సాధారణంగా ఆక్సిజన్‌తో కూడిన ‘మంచి’ రక్తం, ఆక్సిజన్‌ను కణాలు వాడుకున్నాక మిగిలే ‘చెడు’ రక్తం ధమనుల్లో, సిరల్లో వేర్వేరుగా ప్రవహిస్తుంటుంది. గుండెలోనూ వేర్వేరు గదులు ఇవి కలిసిపోకుండా చూస్తాయి. అయితే గుండె గదుల మధ్య గోడలకు రంధ్రాలు గల పిల్లల్లో మంచి, చెడు రక్తం కలిసిపోతుంటాయి. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు తగ్గిపోతుంది. ఫలితంగా అవయవాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. అప్పుడు రక్తం సరిపోవటం లేదనే ఉద్దేశంతో శరీరం మరింత ఎక్కువగా రక్తం ఉత్పత్తయ్యేలా చేస్తుంది. దీంతో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటి సంఖ్య మరీ ఎక్కువైతే రక్తం బాగా చిక్కగా అవుతుంది. ఎండాకాలంలో దీని ముప్పు మరింత ఎక్కువవుతుంది.

రక్తం చిక్కబడితే ప్రమాదం

వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. వేడిని తట్టుకోవటానికి ఒంట్లోని నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గి, రక్తం చిక్కబడే ముప్పు తలెత్తుతుంది. ఒకవేళ వాంతులు, విరేచనాలు అవుతుంటే ఇది మరింత ఎక్కువవుతుంది కూడా. రక్తం చిక్కబడినప్పుడు తలనొప్పి, తీవ్రమైన అలసట, మగ వంటి లక్షణాలు (హైపర్‌ విస్కాసిటీ సిండ్రోమ్‌) తలెత్తుతాయి. రక్తం సిరల్లో గడ్డకట్టే ప్రమాదమూ (వీనస్‌ థ్రాంబోసిస్‌) ఉంటుంది. తలలోని సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడితే మెదడులో చీము పట్టి పరిస్థితి తీవ్రమవుతుంది. కాబట్టి గుండె లోపాలతో పుట్టిన పిల్లల విషయంలో వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తగా ఉండాలి

* గుండె లోపాలు గల పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగనీయొద్దు. వీరిని చెమట ఎక్కువగా పట్టే బీచ్‌ల వంటి చోట్లకు తీసుకెళ్లటం మంచిది కాదు.

* నీరు, ద్రవాలు ఎక్కువగా తాగించాలి. పండ్ల రసాలు కూడా మంచివే.

* వాంతులు, విరేచనాలు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అవసరమైతే సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది.

* గుండెలో రంధ్రం గల పిల్లలు తలనొప్పి వస్తుందన్నా, రోజూ జ్వరం వస్తున్నా, కళ్లు సరిగా కనిపించటం లేదన్నా తాత్సారం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అవసరమైతే సీటీ స్కాన్‌ చేయించాలి. మెదడులో చీము, మెదడు సిరల్లో రక్తం గడ్డలుంటే తక్షణం చికిత్స చేయించాలి.

* తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు.. మగత, ఆయాసం, అలసట ఉన్నప్పుడు రక్తం చిక్కదనాన్ని తెలిపే పీసీవీ పరీక్ష చేయించాలి. చిక్కదనం మరీ ఎక్కువైతే కొన్నిసార్లు కొంత రక్తాన్ని బయటకు తీయాల్సి రావొచ్చు.

* రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటం వల్ల కొందరు పిల్లలు నీలంగా మారుతుంటారు (బ్లూ బేబీస్‌). బిగ్గరగా ఏడ్చినా కూడా పెదవులు, గోళ్లు, ముఖం వంటివి నీలంగా మారుతుంటాయి. ఇలాంటి పిల్లలకు చిన్నప్పుడు షంట్‌ ఆపరేషన్‌ చేసి, కొద్ది సంవత్సరాల తర్వాత పెద్ద ఆపరేషన్‌ చేస్తుంటారు. వీరి విషయంలో వేసవిలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తం చిక్కబడి, షంట్‌ మూసుకుపోయే ప్రమాదముంది. వీరికి అవసరాన్ని బట్టి డాక్టర్లు ఆస్ప్రిన్‌ మాత్రలు సూచిస్తుంటారు. వీటిని క్రమం తప్పకుండా వేసుకునేలా చూడాలి.

* పుట్టిన తర్వాత- గుండె వైఫల్యం (కార్డియో మయోపతీ) తలెత్తిన పిల్లలకు దీర్ఘకాలం వైద్యం అవసరం. వీరికి డాక్టర్లు ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటకు పోవటానికి మందులు సూచిస్తుంటారు. ఈ మందులు వేసుకునేవారికి ఎండాకాలంలో మరింత ఎక్కువగా ఒంట్లోంచి నీరు బయటకు పోయి, ఖనిజ లవణాలు తగ్గిపోవచ్చు. దీంతో బాగా నీరసిస్తారు. కొన్నిసార్లు గుండె లయ తప్పొచ్చు. ఇది చాలా ఇబ్బందులకు దారితీయొచ్చు. కాబట్టి వీరి విషయంలో ముందే డాక్టర్‌ను సంప్రదించి, మందుల మోతాదులో అవసరమైన మార్పులు చేసుకోవాలి. పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడే పిల్లల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎండలో ఎక్కువగా తిరిగితే వీరికి వేసోవేగల్‌ సింకోప్‌ సమస్య తలెత్తొచ్చు. ఇందులో ఉన్నట్టుండి రక్తపోటు తగ్గిపోయి,  పిల్లలు కింద పడిపోవచ్చు. కొన్నిసార్లు మరణించే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి పల్మనరీ హైపర్‌టెన్షన్‌ గల పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగనీయకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని