బద్ధకం బంధిస్తే?

వయసు మీద పడినవారిలో మలబద్ధకం ఎక్కువ. సాధారణంగా వారానికి మూడు కన్నా తక్కువసార్లు విరేచనం కావటాన్ని మలబద్ధకంగా భావిస్తుంటారు.

Updated : 15 Aug 2023 03:31 IST

వయసు మీద పడినవారిలో మలబద్ధకం ఎక్కువ. సాధారణంగా వారానికి మూడు కన్నా తక్కువసార్లు విరేచనం కావటాన్ని మలబద్ధకంగా భావిస్తుంటారు. అయితే ఎన్నిసార్లు విసర్జనకు వెళ్తున్నారనేది వ్యక్తులను బట్టి మారిపోతుంది. కొందరు రోజులో చాలాసార్లు విసర్జనకు వెళ్లొచ్చు. కొందరికి వారానికి ఒకట్రెండు సార్లే విరేచనం కావొచ్చు. తీరు ఏదైనా గానీ మునుపటి కన్నా తక్కువసార్లు విరేచనం అవుతున్నా, విసర్జనకు కష్టపడుతున్నా, మలం గట్టిగా, పొడిగా వస్తున్నా, నొప్పి పుడుతున్నా, పూర్తిగా విసర్జన కాలేదని అనిపిస్తున్నా సమస్యగానే పరిగణించాల్సి ఉంటుంది.

ఏంటీ సమస్య?

మలబద్ధకానికి మూలం పెద్దపేగు మలంలోని నీటిని మరీ ఎక్కువగా సంగ్రహించుకోవటం. మనం తిన్న ఆహారం జీర్ణకోశంలోకి ముందుకు సాగుతున్నప్పుడు పేగులు నెమ్మదిగా పోషకాలను గ్రహించుకుంటాయి. పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్నపేగుల్లోంచి పెద్దపేగులోకి వెళ్లి, మలంగా ఏర్పడుతుంది. పెద్దపేగు దీనిలోని నీటిని గ్రహించుకొని, మరింత గట్టిపడేలా చేస్తుంది. మలబద్ధకం గలవారిలో జీర్ణకోశం నుంచి ఆహారం నెమ్మదిగా కదులుతుంది. దీంతో నీటిని సంగ్రహించుకోవటానికి పెద్దపేగుకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఫలితంగా మలం పొడిగా, గట్టిగా అవుతుంది.

ఎందుకీ బద్ధకం?

మలబద్ధకానికి జీవన విధానం, మందులు, జబ్బుల వంటి అంశాలెన్నో కారణమవుతాయి.

  • ఆహారంలో తగినంత పీచు పదార్థం లేకపోవటం.
  •  సరిపడినంత నీరు తాగకపోవటం.
  • వ్యాయామం, శారీరక శ్రమ అంతగా చేయకపోవటం.
  •  దినచర్య మారటం.. అంటే ప్రయాణాలు చేయటం, భోజనం చేయకపోవటం, నిద్రించే వేళలు మారటం వంటివి.
  •  మానసిక ఒత్తిడి.
  •  విరేచనం అయ్యేట్టు అనిపించినా ఆపటం.
  •  నొప్పి, కుంగుబాటు, ఛాతీ మంట, అలర్జీ తగ్గించే మందులు. ఐరన్‌ మాత్రలు. క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్ల వంటి కొన్నిరకాల అధిక రక్తపోటు మందులు. మానసిక జబ్బులు, మూర్ఛ మందులు.
  •  హైపోథైరాయిడిజమ్‌, మధుమేహం, రక్తంలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం, పెద్దపేగు క్యాన్సర్‌, పేగు పూత, పెద్దపేగులో తిత్తుల వంటి జబ్బులు.

తగ్గించుకునే మార్గమేది?

వృద్ధుల్లో మలబద్ధకం ఎక్కువే అయినా కొన్ని జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు.

  • తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. వృద్ధులు రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు, ద్రవాలు తీసుకోవటం మంచిది. మలం గట్టిగా వస్తుంటే ఇంకాస్త ఎక్కువ నీరు తాగాలి. దీంతో మలం మెత్తబడి, సాఫీగా విరేచనం అవుతుంది. అయితే కిడ్నీజబ్బుల వంటివి గలవారు డాక్టర్‌ సలహా మేరకు ద్రవాలు తీసుకోవాలి.
  •  పీచు మలం ఏర్పడేలా చేసి, విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటి పీచుతో కూడిన ఆహారం ఎక్కువగా తినాలి.  
  •  క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయాలి. వీటితో జీర్ణకోశంలోని కండరాలు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా పెద్దపేగు ద్వారా మలం తేలికగా ముందుకు కదులుతుంది. రోజుకు కనీసం అరగంట సేపు నడవటం, సైకిల్‌ తొక్కటం, ఈత వంటివి చేయాలి.
  •  రోజూ ఒకే సమయానికి విసర్జనకు వెళ్లేలా చూసుకోవాలి. విసర్జన వస్తున్నట్టు అనిపించగానే బాత్రూమ్‌కు వెళ్లాలి. బలవంతంగా ఆపొద్దు.
  •  వృద్ధుల్లో చాలామంది ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మలబద్ధకమూ ఎక్కువవుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకు ధ్యానం, యోగా, ఆత్మీయులను కలవటం, సంగీతం వినటం, యాత్రలకు వెళ్లటం వంటివి మేలు చేస్తాయి.
  •  జీవనశైలి మార్పులతో ఫలితం కనిపించకపోతే డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని