సాయంత్రాన వ్యాయామం

వ్యాయామం ఎప్పుడు చేసినా మంచిదే. అయితే ఊబకాయం, మధుమేహం గలవారు సాయంత్రం వేళల్లో చేస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు.. అకాల మరణం, గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనంలో బయటపడింది.

Updated : 23 Apr 2024 16:13 IST

వ్యాయామం ఎప్పుడు చేసినా మంచిదే. అయితే ఊబకాయం, మధుమేహం గలవారు సాయంత్రం వేళల్లో చేస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు.. అకాల మరణం, గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనంలో బయటపడింది. నలబై ఏళ్లు దాటిన 30వేల మందిని ఎనిమిదేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. చేతికి ధరించే పరికరాల సాయంతో ఎంతసేపు, ఎంత తీవ్రంగా, ఎప్పుడెప్పుడు వ్యాయామం చేస్తున్నారనే విషయాలను ఇందులో పరిశీలించారు. గుండె, శ్వాస వేగాన్ని పెంచే ఏరోబిక్‌ వ్యాయామాలతో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు గుర్తించారు. ఎలాంటి వ్యాయామం చేస్తున్నారో ఇందులో పేర్కొనలేదు గానీ ఇవి వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం, పరుగెత్తటం, వృత్తి పని, వేగంగా ఇల్లు తుడవటం వంటివేవైనా కావొచ్చని భావిస్తున్నారు.

రోజంతా ఎంతసేపు వ్యాయామం చేస్తున్నామనే దాని కన్నా ఎంత వేగంగా చేస్తున్నామనేది ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహం, ఊబకాయం, సాయంత్రం వేళల్లో రక్తంలో గ్లూకోజు ఎక్కువగా గలవారు సాయంత్రం వేళ వ్యాయామం చేయటం ద్వారా కొన్ని దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఒక్క వ్యాయామంతోనే ఊబకాయం తగ్గకపోవచ్చు. కానీ ఊబకాయంతో తలెత్తే ఇతరత్రా దుష్ప్రభావాలను తగ్గించుకోవటానికి తోడ్పడుతుంది. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి, జబ్బుల ముప్పు తగ్గించుకోవటానికి వ్యాయామం చేసే సమయాన్ని నిర్ణయించుకోవటం కూడా ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని