వ్యాయామంతో కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రోజూ కాకపోయినా వారానికి కనీసం రెండు, మూడు సార్లు చేసినా చాలు.

Published : 02 Apr 2024 00:05 IST

కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రోజూ కాకపోయినా వారానికి కనీసం రెండు, మూడు సార్లు చేసినా చాలు. ఇలాంటివారికి రాత్రిపూట నిద్ర బాగా పడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఇనుమడిస్తుందన్న సంగతి కొత్తేమీ కాదు. కంటి నిండా నిద్ర పట్టటానికి, నిద్రలేమి లక్షణాలు తగ్గటానికి శారీరక శ్రమ తోడ్పడుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు లింగ భేదం, వయసు, బరువు, శరీర సామర్థ్యం, మొత్తంగా ఆరోగ్యం, వ్యాయామ రకాలు ఎంతవరకు దోహదం చేస్తాయన్నది కచ్చితంగా తెలియదు. దీన్ని గుర్తించటానికే శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు? వీరిలో నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి? రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు? పగటిపూట ఎంతవరకు మగతగా ఉంటున్నారు? అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. వారానికి కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు (వారానికి గంట, అంతకన్నా ఎక్కువసేపు) వ్యాయామం చేసేవారిని చురుకుగా ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇలాంటివారికి నిద్రలేమి ముప్పు 42% తక్కువగా ఉంటోందని గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22-40 శాతం వరకూ తక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు