Hypertension - Exercise: బీపీ తగ్గాలా... ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తే సరి!

High Blood Pressure Control: అధిక రక్తపోటు తగ్గటానికి ఇంగ్లాండ్‌ పరిశోధకులు ఓ వ్యాయామాన్ని సూచించారు. అదేంటంటే? 

Updated : 06 Feb 2024 20:50 IST

అధిక రక్తపోటు తగ్గటానికి వ్యాయామం తోడ్పడుతుందన్నది తెలిసిన విషయమే. కానీ ఎలాంటి వ్యాయామం మేలు చేస్తుంది? ఇంగ్లాండ్‌ పరిశోధకులు దాన్నే గుర్తించారు.

వ్యాయామాలు బోలెడు. అధిక రక్తపోటు (High Blood Pressure) తగ్గటానికి ఏదో ఒక వ్యాయామాన్ని ఎవరైనా సూచిస్తే బాగుండునని చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఇలాంటివారి కోసమే ఇంగ్లాండు పరిశోధకులు సూక్ష్మంలో మోక్షంలా ఓ వ్యాయామాన్ని (Exercise) గుర్తించారు. అదే ఐసోమెట్రిక్‌ ఎక్సర్‌సైజ్‌. కదలకుండా ఒకే స్థితిలో ఉంటూ కండరాలను వంచి చేసే వ్యాయామాన్ని ఐసోమెట్రిక్‌ ఎక్సర్‌సైజ్‌ అంటారు. ఉదాహరణకు- గోడ కుర్చీ. దీన్ని వేసినప్పుడు శరీరమేమీ కదలదు. ఆ స్థితిలో అలాగే ఉండటానికి కడుపు, కాళ్లు, శరీర పైభాగం కండరాలు సంకోచిస్తుంటాయి. కానీ కండరాల పొడవేమీ మారదు. స్థిరంగా అలాగే ఉంటాయి. చాలారకాల యోగాసనాలు కూడా ఎసోమెట్రిక్‌ వ్యాయామం కోవలోకే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యాయామంతో సిస్టాలిక్‌ రక్తపోటు (పై సంఖ్య) 8.24 ఎంఎం హెచ్‌జీ మేరకు, డయాస్టాలిక్‌ రక్తపోటు 2.5 ఎంఎం హెచ్‌జీ మేరకు తగ్గుతున్నట్టు తేలింది.

గతంలో నిర్వహించిన 270 అధ్యయనాలను సమీక్షించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. గుండె, శ్వాస వేగాన్ని పెంచే పరుగు, సైకిల్‌ తొక్కటం వంటి ఏరోబిక్‌ వ్యాయమాలు.. బరువులను ఎత్తటం, బ్యాండులను లాగటం వంటి రెసిస్టెన్స్‌ వ్యాయామాలు.. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కాసేపు అతి వేగంగా చేసే ఇంటర్వెల్‌ ట్రెయినింగ్‌ వంటి వాటితో పోలిస్తే ఐసోమెట్రిక్‌ వ్యాయామంతో రక్తపోటు ఇంకాస్త ఎక్కువగా తగ్గుతుండటం గమనార్హం. అధిక రక్తపోటు (Hypertension) నార్మల్‌గా ఉన్నవారి దగ్గరి నుంచి ఎక్కువగా ఉన్నవారి వరకూ అందరికీ ఇది మేలు చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎలా మేలు చేస్తాయి?

మనలో చాలామంది ఐసోమెట్రిక్‌ వ్యాయామాలు చేస్తూనే ఉంటాం. కానీ అవి చేస్తున్నామనే సంగతి తెలియదు. ఉదాహరణకు- మోచేతిని వంచి చేత్తో టెన్నిస్‌ బంతిని 30 సెకండ్ల పాటు నొక్కి పట్టి ఉంచారనుకోండి. కొంతసేపు అలాగే ఉన్నప్పుడు చేయి కండరాలు బిగుసుకుంటాయి. దీంతో వాటి చుట్టుపక్కల రక్తనాళాలు సంకోచిస్తాయి. అప్పుడు పాక్షికంగా రక్త ప్రసరణ బిగుసుకుపోయి, ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకునే పదార్థాలు (అనరోబిక్‌ మెటబలైట్లు) పోగవుతాయి. దీన్ని శరీరం ఇష్టపడదు. బంతిని నొక్కటం ఆపగానే రక్త ప్రసరణ మామూలు స్థితికి వస్తుంది. మణికట్టు వద్ద ఏర్పడిన అయోమయ పరిస్థితిని చక్కబడే క్రమంలో ఒక్క ఉదుటున రక్త ప్రసరణ పుంజుకుంటుంది. అప్పుడు ఎర్ర రక్తకణాలు రక్తనాళాల గోడల మీద ఒత్తిడిని కలగజేసి.. నైట్రిక్‌ ఆక్సైడ్‌ విడుదలను ప్రేరేపిస్తాయి. రక్తనాళాలు విప్పారటానికి నైట్రిక్‌ ఆక్సైడ్‌ తోడ్పడుతుంది. ఫలితంగా రక్తపోటూ తగ్గుముఖం పడుతుంది.

ఐసోమెట్రిక్‌ వ్యాయామం ఏదో ఒక్క భాగానికే పరిమితమైనదే అయినా అధిక రక్తపోటు విషయంలో శరీరమంతా ప్రభావం చూపుతుండటం విశేషం. ఒక కాలును చాచటం, పిడికిలి బిగించటం, గోడ కుర్చీ.. ఈ మూడు వ్యాయామాలనే అధ్యయనంలో విశ్లేషించారు. అయితే మిగతా ఐసోమెట్రిక్‌ వ్యాయామాలకూ అధ్యయన ఫలితాలు వర్తిస్తాయని చెబుతున్నారు. వీటిని పదే పదే చేసినప్పుడు ఎక్కువగా నైట్రిక్‌ ఆక్సైడ్‌ విడుదలై రక్తపోటు తగ్గుతుంది. అలాగని బరువులు ఎత్తటం, పరుగెత్తటమూ తక్కువేమీ కాదు. ఇవీ కాసేపు రక్తనాళాలను బిగువుగా పట్టి ఉంచి, రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని