వ్యాయామమూ చికిత్సే

వ్యాయామాన్ని ఎంతసేపూ శారీరక శ్రమగానే భావిస్తుంటాం. కానీ కుంగుబాటు బాధితుల్లో ఇది చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నట్టు తాజాగా బయటపడింది.

Published : 20 Feb 2024 00:48 IST

వ్యాయామాన్ని ఎంతసేపూ శారీరక శ్రమగానే భావిస్తుంటాం. కానీ కుంగుబాటు బాధితుల్లో ఇది చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నట్టు తాజాగా బయటపడింది. వ్యాయామాల్లో ప్రత్యేకించి నడక, యోగా, పరుగు, బరువులు ఎత్తటం మరింత సమర్థంగా ప్రభావం చూపుతున్నాయి. కుంగుబాటు జీవితాన్ని పలు రకాలుగా దెబ్బతీస్తుంది. అన్ని విషయాల మీద ఆసక్తిని చంపేసి దాదాపు మనిషిని ఏకాకిగా మారుస్తుంది. గుండెజబ్బు, ఆందోళన, క్యాన్సర్‌ వంటి జబ్బులనూ తీవ్రం చేస్తుంది. చాలామంది మందులు, మానసిక చికిత్సతో కుదురుకుంటారు గానీ కొందరికివి అంతగా పనిచెయ్యవు. ఇలాంటి సమయాల్లో మందులు, మానసిక చికిత్సలతో పాటు వ్యాయామాన్ని జత చేస్తే మంచి ప్రభావం కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఎంత ఎక్కువగా, ఎంత తీవ్రంగా వ్యాయామం చేస్తే అంత ఎక్కువ ఫలితం చూపుతున్నట్టూ తేలింది.

ఎలా ఉపయోగపడుతుంది?

  • వ్యాయామం శరీరాన్నే కాదు.. మనసునూ బలోపేతం చేస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి సహజంగా హాయి భావన కలిగిస్తాయి. బాధలను తగ్గిస్తాయి.
  • కుంగుబాటుకు లోనయినప్పుడు ప్రతికూల భావనలు వెంటాడుతుంటాయి. ఇవి బాధలను మరింత ఎక్కువ చేస్తాయి. వీటిని అదేపనిగా తలచుకోవటం కన్నా మనసును ఇతర విషయాల మీదికి మళ్లించినప్పుడు ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఇందుకు వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది.
  •  క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అంతేకాదు.. ఆత్మ విశ్వాసమూ ఇనుమడిస్తుంది.
  • ఆరుబయట వ్యాయామం చేస్తున్నప్పుడు ఇతరులను కలుసుకోవటం వల్ల సామాజిక బంధాలు ఏర్పడతాయి. చుట్టుపక్కల వారు నవ్వుతూ పలకరించినా, మాట్లాడినా మూడ్‌ తేలిక పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని