కూర్చొని లేస్తే మోకాలి నొప్పి

సమస్య: నాకు 38 ఏళ్లు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. రెండు నెలల నుంచి ఎడమ మోకాలు నొప్పి పుడుతోంది. ముఖ్యంగా కుర్చీలోంచి లేచాక వెంటనే నిలబడలేకపోతున్నాను.

Updated : 28 Nov 2023 02:52 IST

సమస్యసలహా

సమస్య: నాకు 38 ఏళ్లు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. రెండు నెలల నుంచి ఎడమ మోకాలు నొప్పి పుడుతోంది. ముఖ్యంగా కుర్చీలోంచి లేచాక వెంటనే నిలబడలేకపోతున్నాను. ఇంట్లోనూ బాసింపట్టు వేసుకొని లేచినప్పుడూ నొప్పి పుడుతోంది. కొద్దిసేపటి వరకు నడవటం కష్టంగా ఉంటోంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?
శ్రీనివాస్‌, హైదరాబాద్‌

సలహా: ఇది తరచూ చూసే సమస్యే. దీనికి కారణం మోకీళ్లు, వాటి చుట్టూరా ఉండే కండరాలు బిగుసుకు పోవటం. వృద్ధుల్లోనే కాదు, శారీరకంగా చురుకుగా ఉండేవారిలోనూ దీన్ని చూస్తుంటాం. కాలి కండరాల సమతుల్యత దెబ్బతినటం, మోకాలికి దెబ్బలు, కీళ్లు అరగటం వంటివి దీనికి దారితీస్తుంటాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చునేవారిలోనూ ఇది కనిపిస్తుంటుంది. సాధారణంగా ఎక్కువసేపు కూర్చొని, లేచినప్పుడు కండరాలు తిన్నగా, వదులుగా అవటానికి కాస్త సమయం పడుతుంది. దీంతో లేచినప్పుడు నొప్పి పుడుతుంది. కొద్దిదూరం నడిచాక మామూలుగా అవుతుంది. మీకూ ఇదే కారణమని అనిపిస్తోంది. అందువల్ల మీరు గంటకోసారి అయినా కుర్చీలోంచి లేవటం మంచిది. మోకాళ్లను బలోపేతం చేసే, కండరాలను సాగదీసే వ్యాయామాలూ ఉపయోగ పడతాయి. ముందుగా కుర్చీలో కూర్చొని పాదాన్ని పైకి లేపి, కాలును తిన్నగా చాచాలి. పది సెకండ్ల పాటు అలాగే ఉంచి, నెమ్మదిగా కిందికి దించాలి. దీన్ని పడుకొనీ చేయొచ్చు. పడుకున్నప్పుడు కాలును తిన్నగా చాచి, కొద్దిగా పైకి లేపాలి. పది సెకండ్ల పాటు అలాగే ఉంచి, కిందికి తేవాలి. తువ్వాలు సాయంతోనూ వ్యాయామం చేయొచ్చు. వెల్లకిలా పడుకున్నప్పుడు తువ్వాలును గుండ్రంగా చుట్టి, మోకాలి కింద పెట్టుకోవాలి. తొడ కండరం సాయం తీసుకొని, మోకాలి కింది భాగంతో తువ్వాలును నొక్కాలి. ఈ వ్యాయామాలు మోకాలి కండరాలు సాగటానికి, సాఫీగా కదలటానికి, బలోపేతం కావటానికి తోడ్పడతాయి. మీరు ఆఫీసులో కూర్చునే విధానాన్నీ మార్చుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు మోకాలు, తుంటి ఒకే వరుసలో.. అంటే 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. చల్లటి వాతావరణంలోనూ మోకాలి కండరాలు బిగుసుకుపోయే ప్రమాదముంది. కాబట్టి ఆఫీసులో ఏసీ వాడుతున్నట్టయితే మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. విటమిన్‌ డి, క్యాల్షియం మాత్రలు కూడా వేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే మోకాలి ఎక్స్‌రే తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఎంఆర్‌ఐ కూడా అవసరమవ్వచ్చు. మోకాళ్లలో మెనిస్కస్‌, లిగమెంట్‌ సమస్యలున్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని