ఏఐతో గుండె రంధ్రం గుర్తింపు!

గుండె జబ్బులను గుర్తించటానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈసీజీ) పరీక్ష చేయటం తెలిసిందే. దీని ద్వారానే గుండె రంధ్రాలనూ గుర్తించగలిగితే? బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌, జపాన్‌లోని కీయో యూనివర్సిటీ అలాంటి వినూత్న విధానాన్నే రూపొందించాయి.

Published : 22 Aug 2023 00:39 IST

గుండె జబ్బులను గుర్తించటానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈసీజీ) పరీక్ష చేయటం తెలిసిందే. దీని ద్వారానే గుండె రంధ్రాలనూ గుర్తించగలిగితే? బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌, జపాన్‌లోని కీయో యూనివర్సిటీ అలాంటి వినూత్న విధానాన్నే రూపొందించాయి. డీప్‌ లెర్నింగ్‌ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే ఇది ఈసీజీలో దాగున్న గుండె రంధ్రం సంకేతాలను ఇట్టే గుర్తించేస్తుంది. అదీ సంప్రదాయ పద్ధతుల కన్నా మెరుగ్గా! గుండె రంధ్రాలనగానే పిల్లలే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇది పుట్టుకతో తలెత్తే లోపం. కొందరిలో చిన్నప్పుడే బయటపడుతుంది. కొందరికి పెద్దయ్యే వరకూ తెలియకపోవచ్చు. దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం, కొందరిలో పెద్దయ్యేవరకూ ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్ల చాలామందిలో సమస్య గుర్తించలేకుండానే ఉండిపోతుంటుంది. పైకి ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఇది గుండె మీద ఎక్కువ భారం పడేలా చేస్తుంది. గుండె లయ తప్పటం, పక్షవాతం, గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు వంటి వాటి ముప్పు పెంచుతుంది. తొలిదశలోనే గుండె రంధ్రాన్ని గుర్తిస్తే చిన్నకోత సర్జరీతోనే సరిచేయొచ్చు. సమస్యలను తగ్గించుకోవచ్చు, జీవనకాలాన్ని పెంచొచ్చు. చాలామందిలో డాక్టర్లు స్టెతస్కోప్‌తో గుండె చప్పుడును వినటం ద్వారానే రంధ్రాన్ని గుర్తిస్తుంటారు. కానీ కేవలం 30% మందిలోనే ఈ పద్ధతిలో సమస్య బయటపడుతోంది. ఎకోకార్డియోగ్రామ్‌తోనూ గుండె రంధ్రాన్ని తెలుసుకోవచ్చు. దీనికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ముందస్తు పరీక్షలకు (స్క్రీనింగ్‌) ఇది అంతగా ఉపయోగపడదు. మరో పద్ధతి ఈసీజీ. ఇది కేవలం నిమిషంలోనే పూర్తయ్యే పరీక్ష. అందువల్ల దీన్ని స్క్రీనింగ్‌కు వాడుకోవచ్చు. అయితే గుండె రంధ్రంతో ముడిపడిన లోపాల కోసం ఈసీజీని పరిశీలించేటప్పుడు మనుషులకు అంత ఎక్కువ సమాచారం లభించదు. ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధ నమూనాను రూపొందించారు. ఇది ఈసీజీని విశ్లేషించి, 93.7% వరకూ గుండె రంధ్రాన్ని సరిగ్గా గుర్తిస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని