ఎండ యోగం!

వడదెబ్బ, ఒంట్లో నీరు తగ్గటం, పిక్కలు పట్టేయటం, మడమలు, పాదాలు ఉబ్బటం, నిస్త్రాణ.. ఇలా చెబుతూ పోతే ఎండాకాలం తెచ్చిపెట్టే ఇబ్బందులు ఎన్నో. ఉదయం నుంచే ఉష్ణోగ్రత పెరగటం వల్ల బయటకు వెళ్లటానికీ మనసొప్పదు.

Published : 19 Mar 2024 00:59 IST

 

వడదెబ్బ, ఒంట్లో నీరు తగ్గటం, పిక్కలు పట్టేయటం, మడమలు, పాదాలు ఉబ్బటం, నిస్త్రాణ.. ఇలా చెబుతూ పోతే ఎండాకాలం తెచ్చిపెట్టే ఇబ్బందులు ఎన్నో. ఉదయం నుంచే ఉష్ణోగ్రత పెరగటం వల్ల బయటకు వెళ్లటానికీ మనసొప్పదు. జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయాలన్నా వెనకాడతారు. దీంతో రోజంతా బద్ధకంగా, అలసినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో యోగాసనాలు బాగా ఆదుకుంటాయి. ఇవి శరీర మూల ఉష్ణోగ్రతను తగ్గించటమే కాకుండా సౌష్టవాన్నీ మెరుగుపరుస్తాయి. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయి. అలాంటి కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం.


మత్స్యాసనం

 దీన్ని ‘సర్వ రోగ సంహరిణి’గా భావిస్తారు. ఇది ఊపిరితిత్తి కండరాలను సాగదీసి, బలోపేతం చేస్తూ గాఢంగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఛాతీ విప్పారటానికి.. భుజాలు, మెడ వదులు కావటానికి ఈ ఆసనం ఎంతగానో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

 ఎలా చేయాలి?: వెల్లకిలా పడుకొని అరచేతులను పిరుదుల కింద పెట్టాలి. శ్వాస తీసుకుంటూ తల, ఛాతీని కొద్దిగా పైకి లేపాలి. తర్వాత తలను వెనక్కి వాల్చి, మాడును నేలకు తాకించాలి. ఛాతీని అలాగే పైకి లేపి.. మోచేతుల సాయంతో శరీరాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత సేపు అలాగే ఉండి, యథాస్థితికి రావాలి.


మార్జాలాసనం

ఇది శరీరంలో అత్యవసర చక్రాలను విప్పారేలా చేస్తుంది. మెడలో బిగువును తగ్గిస్తుంది. ఇలా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. హాయి భావనను చేకూర్చే ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తుంది కూడా. ఫలితంగా శరీరం, మనసు ప్రశాంతత పొందుతాయి.
ఎలా చేయాలి?: ముందు వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత తొడలను లేపి, మోకాళ్ల మీద నిల్చోవాలి. అరచేతులను నేలకు తాకిస్తూ శరీరాన్ని ముందుకు వంచాలి. శ్వాసను వదులుతూ.. తలను వీలైనంత కిందికి వంచి, వెన్నెముకను పైకి లేపాలి. చేతుల మీద బరువు మోపుతూ శరీరం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఛాతీని విప్పారుస్తూ గాఢంగా శ్వాస తీసుకొని, వదలాలి. (ఈ ఆసనంలో రెండో దశ కూడా ఉంటుంది. పైకి లేపిన వెన్నెముకను కిందికి తీసుకొచ్చి, తలను పైకి లేపి ముందుకు చూడాలి. నిదానంగా ఒక దశ నుంచి మరో దశలోకి మారాలి.)


భుజంగాసనం

ఇది ఛాతీ, ఊపిరితిత్తుల కండరాలు సాగేలా చేస్తుంది. ఉత్సాహం, హుషారు కలిగిస్తుంది.
ఎలా చేయాలి? బోర్లా పడుకొని తలను నేలకు తాకించాలి. చేతులు భుజాల పక్కన ఉంచాలి. అరచేతులతో నేలను కిందికి నొక్కుతూ తల, ఛాతీ, మొండాన్ని పైకి లేపాలి. కాళ్లు, కటి భాగం నేలకు తాకించాలి. ఈ సమయంలో శరీర భంగిమ తాచు పాము పడగెత్తినట్టుగా కనిపిస్తుంది. శరీరం బరువును మోయటానికి చేతులను దన్నుగా వాడుకోవాలి. అయితే మొత్తం బరువును చేతుల మీదే వేయొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని