బరువు మందులు వేసుకుంటున్నా..

బరువు తగ్గటానికి తోడ్పడే సెమాగ్లుటైడ్‌ వంటి జీఎల్‌పీ-1 మందులు ఊబకాయులకు, అధిక బరువుతో ముడిపడిన సమస్యలు గలవారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగని వ్యాయామం, ఆహార నియమాల విషయంలో నిర్లక్ష్యం తగదు.

Updated : 13 Feb 2024 03:39 IST

బరువు తగ్గటానికి తోడ్పడే సెమాగ్లుటైడ్‌ వంటి జీఎల్‌పీ-1 మందులు ఊబకాయులకు, అధిక బరువుతో ముడిపడిన సమస్యలు గలవారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగని వ్యాయామం, ఆహార నియమాల విషయంలో నిర్లక్ష్యం తగదు. బరువు తగ్గటంలో శారీరక సవాళ్లను ఎదుర్కొనేవారికి మందులు సాయం చేసే మాట నిజమే అయినా జీవనశైలి మార్పులకు ప్రత్యామ్నాయమేమీ కావు. జీఎల్‌పీ-1 మందులు ఆకలిని, తిండి మీద యావను తగ్గిస్తాయి. కాబట్టి తక్కువగా తింటారు. ఇవి ఎక్కువసేపు పేగుల్లో ఆహారం ఉండిపోయేలా కూడా చేస్తాయి. ఫలితంగా చాలామంది వాంతి, వికారం, విరేచనాలు/మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి దుష్ప్రభావాలు తగ్గటానికి పోషకాహారం అత్యవసరం. కాబట్టి తగినంత ప్రొటీన్‌ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. సరిపడినన్ని నీళ్లు తాగటమూ ముఖ్యమే. లేకపోతే తలనొప్పి, నిస్సత్తువ వంటివి తలెత్తొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామమూ చేయాలి. బరువు తగ్గే క్రమంలో పలుచటి కండరమూ తగ్గే అవకాశముంది. జీఎల్‌పీ-1 మందులు వేసుకునేవారు వ్యాయామం చేయకపోతే సుమారు మూడో వంతు కండర మోతాదు తగ్గే ప్రమాదముంది. కండరం క్షీణిస్తే తగ్గిన బరువు తిరిగి పెరగకుండా చూసుకోవటం కష్టమవుతుంది. మరోవైపు జీవక్రియలు అస్తవ్యస్తం కావొచ్చు. ఎముకల పటుత్వమూ తగ్గొచ్చు. ఫలితంగా వృద్ధాప్యంలో తూలిపోవటం, బలహీనత వంటి సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి బరువు తగ్గటానికి ఒక్క మందుల మీదే ఆధారపడకుండా ఆహార, వ్యాయామాలూ పాటించటం తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని