నడక కాస్త వేగంగా..

క్రమం తప్పకుండా రోజూ నడిస్తే మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందని, మధుమేహం వచ్చినా గ్లూకోజు అదుపులో ఉంటుందని తెలిసిన విషయమే. అయితే ఇంకాస్త వేగంగా నడిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని తాజాగా బయటపడింది.

Published : 05 Dec 2023 00:50 IST

క్రమం తప్పకుండా రోజూ నడిస్తే మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందని, మధుమేహం వచ్చినా గ్లూకోజు అదుపులో ఉంటుందని తెలిసిన విషయమే. అయితే ఇంకాస్త వేగంగా నడిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని తాజాగా బయటపడింది.

వ్యాయామం, నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనటంలో సందేహం లేదు. రోజుకు 2,337 అడుగులేసినా గుండెజబ్బుతో మరణించే ముప్పు తగ్గుతున్నట్టు ఇటీవలే ఒక అధ్యయనం పేర్కొంది. అంతేకాదు.. రోజుకు సుమారు 4వేల అడుగులు నడిస్తే మధుమేహంతో పాటు ఇతరత్రా ఏ జబ్బుతోనైనా చనిపోయే ప్రమాదం తగ్గుతున్నట్టూ వెల్లడైంది. వారానికి 150 నిమిషాల సేపు.. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఏరోబిక్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాలు చేసేవారికి మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు మరో అధ్యయనంలో వెల్లడైంది. కేవలం వ్యాయామం, ఆహార నియమాలతోనే 61% వరకు మధుమేహం వెనక్కి మళ్లుతున్నట్టు ఇంకో పరిశోధన పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వ్యాయామ వేగం మీద అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా దృష్టి సారించారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిచేవారితో పోలిస్తే గంటకు 5-6 కిలోమీటర్ల వేగంతో నడిచేవారికి మధుమేహం ముప్పు 24% తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. అలాగని తక్కువ వేగంతో నడిస్తే లాభం లేదని కాదు. వీరికి కూడా మధుమేహం వచ్చే అవకాశం 15% తక్కువగానే ఉంటోంది. ఇంకాస్త వేగంగా.. అంటే గంటకు 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో నడిచేవారికైతే 39% వరకు ముప్పు తగ్గుతోంది. నిజానికి గంటకు ఒక కిలోమీటరు వేగం పెరుగుతున్నకొద్దీ మధుమేహం ముప్పు 9% తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత వేగానికి అంత ప్రయోజనమన్నమాట. మరి నడుస్తున్నప్పుడు వేగాన్ని ఎలా కొలుచుకోవాలని అనుకుంటున్నారా? గంటకు 8వేల అడుగులు వేస్తే 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్టే అనుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని