ఎంచక్కా గెంతేస్తానోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా... నేనో ఎలుకను. అలా అని మీ ఇళ్లలో ఉండేలాంటిదాన్ని కాదు. నేను ఎంచక్కా గెంతేస్తాను. ఇంకా నాకు చాలా ప్రత్యేకతలున్నాయి. అవన్నీ మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. సరేనా!

Published : 24 Feb 2023 00:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా... నేనో ఎలుకను. అలా అని మీ ఇళ్లలో ఉండేలాంటిదాన్ని కాదు. నేను ఎంచక్కా గెంతేస్తాను. ఇంకా నాకు చాలా ప్రత్యేకతలున్నాయి. అవన్నీ మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. సరేనా!

ఇంతకీ నా పేరేంటో మీకు చెప్పనేలేదు కదూ! నన్ను గోబీ జెర్బోవా అంటారు. నేను ఎలుకల జాతికి చెందిన జీవిని. నేను ఎక్కువగా చైనా, మంగోలియాలో జీవిస్తాను. ఎడారులు, గడ్డి భూముల్లో బతుకుతాను. నేనంటూ ఒక జీవిని ఉన్నానని మీకు 1925లో తెలిసింది. అమెరికాకు చెందిన గ్లోవర్‌ మోరిల్‌ అలెన్‌ అనే శాస్త్రవేత్త నన్ను కనిపెట్టాడు. నేను అప్పుడు అతనికి గోబీ ఎడారిలో కనిపించాను కాబట్టి నాకు గోబీ జెర్బోవా అని పేరు పెట్టారు.

కలుగుల్లో బతికేస్తాం...

మేం పగలంతా కలుగుల్లో తలదాచుకుంటాం. రాత్రైతే బయటకు వచ్చి ఆహారాన్వేషణ చేస్తాం. ఎండ నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికే ఈ ఏర్పాటు అన్నమాట. మేం విత్తనాలు, వేర్లు, దుంపలు, మిడతల్లాంటి చిన్న చిన్న పురుగులు, లార్వాలను ఆహారంగా తీసుకుంటాం. ఆరు సంవత్సరాల వరకూ జీవిస్తాం.

అవి గెంతలేవు...

మా వెనక కాళ్లు పెద్దగా బలంగా, ముందు కాళ్లు చిన్నగా ఉంటాయి. తోకేమో పొడవుగా ఉంటుంది. ఈ తోక మాకు బ్యాలెన్సింగ్‌ కోసం ఉపయోగపడుతుంది. మేం హాయిగా గెంతుతూ ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తుంటాం. మా ఎలుక జాతిలో నాదే అత్యంత వేగం. నేను గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలను. కానీ మాలో అప్పుడే పుట్టినవి తమకు 11 వారాల వయసు వచ్చేంత వరకు గెంతలేవు.

నీరు తాగం...

మేం నీళ్లు తాగం. మాకు కావాల్సిన నీటిని మేం తీసుకునే ఆహారం నుంచే గ్రహిస్తాం. ప్రయోగశాలలో మేం దాదాపు మూడు సంవత్సరాల వరకు కేవలం ఎండు విత్తనాలనే ఆహారంగా తీసుకొని బతికాం. మాకు అవకాశం ఉన్నప్పుడు పచ్చని చెట్ల ఆకులు, మొలకలు తింటాం. ఇందులోంచే ఎక్కువగా నీటిని గ్రహిస్తాం. నీరు దొరకని సమయాల్లో మా శరీరం నుంచి తేమ చాలా తక్కువ కోల్పోయేలా మా జీవక్రియలను మార్చుకుంటాం. నేస్తాలూ మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని