Published : 12 Jun 2021 00:43 IST

కొవిడ్‌ పుట్టి 40 ఏళ్లు!

ఏంటీ కొవిడ్‌కు 40 ఏళ్లా? వైరస్‌ వచ్చి రెండేళ్లేగా అవుతోంది? అని ఆశ్చర్యపోతున్నారా! అవును నేస్తాలూ 40 ఏళ్ల కిందటి నుంచే కొవిడ్‌ ఉంది. కానీ అది వైరస్‌ కాదు.. ఓ కంపెనీ పేరు. భలే విచిత్రంగా ఉందికదూ..! ఆలస్యమెందుకు చదివేయండి మరి!
అమెరికాలోని ఆరిజోనాలో నాలుగు దశాబ్దాల క్రితం కొవిడ్‌ అనే కంపెనీని స్థాపించారు. దీని పూర్తి పేరు Covid Inc. అయితే ఇందులో కరోనా వైరస్‌కు సంబంధించిన మందులూ, వ్యాక్సిన్లూ గట్రా ఏమీ ఉండవు. దీనికీ వైరస్‌కూ అసలు సంబంధమే లేదు. ఈ సంస్థలో హైక్వాలిటీ ఆడియో విజువల్‌ వాల్‌ప్లేట్స్‌, కేబుళ్లను విక్రయిస్తారు. అయితే కంపెనీ కార్యకలాపాలన్నీ డీలర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. అందుకే ఇప్పటి వరకూ ఈ సంస్థ గురించి సాధారణ ప్రజలకు పెద్దగా తెలియలేదు.
వెలుగులోకి వచ్చిందిలా!
కరోనా వచ్చాక ఈ కంపెనీని చూసి, అదొక కరోనా టెస్ట్‌ సెంటర్‌ ఏమో అనుకుని జనం, లోనికి వెళ్తున్నారు. ‘కరోనా టెస్ట్‌ చేస్తారా? మందులేమైనా ఇస్తారా? వ్యాక్సిన్లు వేస్తారా?’ అంటూ వాళ్లను అడుగుతున్నారు. ఆఖరుకు అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. దీంతో ఇది కాస్తా వార్తల్లోకి ఎక్కింది. తీరా ఆ సంస్థ సీఈఓని ఆరా తీస్తే సంగతేంటో తెలిసింది. ఆయన మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌కు కొవిడ్‌ అని పేరు పెట్టినప్పుడు మా కంపెనీకి కస్టమర్లు పెరుగుతారేమో అనుకున్నాం. కానీ వచ్చిన వాళ్లంతా కరోనా కంపెనీ కాదు. వేరేది అని తెలిసి తిట్టడం మొదలు పెట్టారు. కరోనాతో జనం అవస్థలు పడుతుంటే, మీ కంపెనీకి ఆ పేరే ఎందుకు పెట్టారని విసుక్కుంటూ వెళుతున్నారు. మా కంపెనీని పెట్టి 40 ఏళ్లయిందని ఎంత చెప్పినా నమ్మడం లేదు’’ అని బాధంతా వెళ్ల్లగక్కారు. మొదట్లో ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఇది వీడియోలకు సంబంధించింది కాబట్టి VidCo అని పేరు పెడదాం అనుకున్నారట. కానీ అప్పటికే ఆ పేరుతో చాలా సంస్థలు ఉండటంతో దాన్నే తిరగేసి Covid అని పెట్టారట. అది కాస్తా 40 ఏళ్లకు ఇలా వైరల్‌ అవుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు. మొత్తానికి అదీ సంగతి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు