మూడేళ్లకే మూడు రికార్డులు!

మూడేళ్ల వయసు.. అప్పుడప్పుడే నర్సరీలో చేరే వయసు. ఒక్కో అక్షరం నేర్చుకునే వయసు.. కానీ ఓ బుడతడు మాత్రం మూడేళ్లకే మూడు రికార్డులు సృష్టించాడు. అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇంతకీ ఎవరా బుడత..? ఏంటా రికార్డులు? తెలుసుకుందామా!

Updated : 08 Sep 2021 04:38 IST

మూడేళ్ల వయసు.. అప్పుడప్పుడే నర్సరీలో చేరే వయసు. ఒక్కో అక్షరం నేర్చుకునే వయసు.. కానీ ఓ బుడతడు మాత్రం మూడేళ్లకే మూడు రికార్డులు సృష్టించాడు. అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇంతకీ ఎవరా బుడత..? ఏంటా రికార్డులు? తెలుసుకుందామా!

ర్హాన్‌ అజిమ్‌ లలానీ ముంబయిలో పుట్టాడు. ప్రస్తుతం మూడు సంవత్సరాలు. ఈ పిల్లాడికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా చెబితే ఇట్టే నేర్చుకుంటాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. ఫలితమే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో మూడు ఘనతలు.

ముచ్చటగా మూడు

ఈ- కామర్స్‌, వాహనాలు, సోషల్‌ మీడియా, ఐటీ కంపెనీలు, సిమ్‌ కార్డులు, ఫుడ్‌ బ్రాండ్స్‌, ఎయిర్‌లైన్స్‌ ఇలా పలు రంగాలకు చెందిన 510 లోగోలను అర్హాన్‌ గుర్తు పట్టాడు. వీటన్నింటినీ కేవలం 10 నిమిషాల తొమ్మిది సెకన్లలోనే చెప్పి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను జనవరి 13న సాధించాడు.

ఒక్క రోజు విరామంతో..

మొదటి రికార్డు సాధించిన తర్వాత కేవలం ఒక్క రోజు విరామంతో.. అంటే జనవరి 15న అర్హాన్‌ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం ఒక నిమిషం 26 సెకన్లలోనే 78 రెస్టారెంట్ల లోగోలను గుర్తుపట్టాడు. పోటీ నిర్వాహకులనే అవాక్కయ్యేలా చేశాడు.

అయిదు రోజుల తర్వాత..

రెండు రికార్డులు తన సొంతమైనా ఈ బుడతడు అక్కడితో తృప్తి పడలేదు. అయిదు రోజుల తర్వాత ముచ్చటగా మూడోదాన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. జనవరి 20న వంద ఎయిర్‌లైన్స్‌ లోగోలను కేవలం ఒక నిమిషం 32 సెకన్లలోనే గుర్తించి అదరగొట్టాడు. పిడుగులాంటి ఈ బుడుగు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని