Published : 15 Oct 2021 01:44 IST

రాయడంలో తగ్గేదే లే!

పదకొండేళ్ల వయసు.. తరగతి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసు.. కానీ ఓ చిన్నోడు మాత్రం ఏకంగా పుస్తకాలే రాసేస్తున్నాడు అదీ క్రైం థిల్లర్‌.. అంతేనా ప్రస్తుతం అది బెస్ట్‌ సెల్లర్‌! ‘కలం పడితే తగ్గేదే లే’ అన్నట్లు దూసుకుపోతున్న ఆ చిరుత గురించి తెలుసుకుందామా మరి!

జోషుహ బిజోయ్‌.. స్వస్థలం కేరళ. ప్రస్తుతం మాత్రం పుణెలో ఆరో తరగతి చదువుతున్నాడు. అందరిలా అక్కడితో ఆగిపోతే నేడు ఇలా మన ‘హాయ్‌బుజ్జీ’ పేజీలోకి వచ్చేవాడే కాదు. ‘మర్డర్‌ అట్‌ లీకీ బారెల్‌’ అనే క్రైం థిల్లర్‌ రాశాడు. ఇది బిజోయ్‌ రాసిన మొదటి నవల. ఇది ప్రస్తుతం కిండెల్‌ ఎడిషన్‌లో ఇండియా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడాల్లో టాప్‌సెల్లర్‌గా ఉంది.

చదివే కొద్దీ చదవాలనిపించేలా..   

బిజోయ్‌ ఈ నవలను ఇంగ్లిష్‌లో రాశాడు. చదివే కొద్దీ మరింత చదవాలనిపించేలా... పాఠకుల్లో ఉత్సుకత కలిగించేలా కలం కదిలించాడు. ఈ నవల విడుదలైన మొదటి రోజే టాప్‌ సెల్లర్‌గా దూసుకువెళ్లి రికార్డు సృష్టించింది. అతిచిన్న వయసులో భారతదేశం నుంచి ఈ ఘనత సాధించేలా చేసింది. బిజోయ్‌ రచయితగా మారడం వెనక అమ్మానాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది.

పువ్వు పుట్టగానే..

బిజోయ్‌ వాళ్ల అమ్మ ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, నాన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు.. బిజోయ్‌కు చిన్నప్పటి నుంచే చదవడం అంటే చాలా ఇష్టం. కథలు, పద్యాలు ఆసక్తిగా చదివేవాడు. అదే ఈ చిన్నోడిలో రాయాలన్న తపనను రేకెత్తించింది.

కరోనా లాక్‌డౌన్‌లో..

కరోనా లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని ఈ బుడతడు సద్వినియోగం చేసుకున్నాడు. అప్పుడే ఈ నవలను రాయడం ప్రారంభించాడు. దీన్ని పూర్తి చేయడానికి ఏడునెలల సమయం పట్టింది. ఓ వైపు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతూనే.. పేజీల కొద్దీ హోం వర్క్‌ చేస్తూనే మరో వైపు తన కలం కదిలించాడు. రోజుకు మూడు గంటలు నవల రాయడానికి కేటాయించాడు. ప్రస్తుతం బిజోయ్‌ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఈ చిన్నారికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎంతో పొగుడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ టీచర్‌ అయితే చాలా ఆనందపడుతున్నారు. మిగతా పిల్లలతో పోల్చుకుంటే బిజోయ్‌లో రచనా నైపుణ్యాలు ఎక్కువున్నాయని అంటున్నారు. మన బిజోయ్‌ భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని మనమూ కోరుకుంటూ.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


ఏంటి మీరూ పుస్తకం.. పెన్ను పడుతున్నారా.. కథలు రాయడానికి..! తప్పేంలేదు.. ఎవరికి తెలుసు... మీరు రాసిన పుస్తకం కూడా బెస్ట్‌సెల్లర్‌ అవుతుందేమో..! అయితే మీకు కూడా ‘హాయ్‌బుజ్జీ’ తరఫున బెస్ట్‌ ఆఫ్‌ లక్‌!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు