వయసు ఏడేళ్లు.. రికార్డులు బోలెడు

ఓ బుడతడు రోలర్‌ స్కేటింగ్‌లో ప్రతిభ చూపుతూ ఔరా అనిపించుకుంటున్నాడు. చిన్నవయసులోనే బోలెడన్ని రికార్డులు అందుకుంటున్నాడు. ఇంతకీ ఎవరీ బుడతడు? ఆ వివరాలు మీకోసం..

Updated : 19 Nov 2021 00:52 IST

ఓ బుడతడు రోలర్‌ స్కేటింగ్‌లో ప్రతిభ చూపుతూ ఔరా అనిపించుకుంటున్నాడు. చిన్నవయసులోనే బోలెడన్ని రికార్డులు అందుకుంటున్నాడు. ఇంతకీ ఎవరీ బుడతడు? ఆ వివరాలు మీకోసం..

ఆ నేస్తం పేరు అథర్వ అగర్వాల్‌. వయసు ఏడేళ్లు. ఉండేది ముంబయిలోని మలాడ్‌. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు.

ఆసక్తితోనే సాధ్యం..

అథర్వకి మూడేళ్ల వయసప్పుడు వాళ్ల నాన్న విశాల్‌ సరదాగా స్కేటింగ్‌ కిట్‌ కొనుక్కొచ్చారు. అవి చూసి అథర్వ తెగ సంబరపడిపోయాడు. తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న రోలర్‌ స్కేటింగ్‌లో శిక్షణకు పంపించారు. అలా అయిదేళ్లు వచ్చేసరికి రోలర్‌ స్కేటింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు అథర్వ. ఇంకేముంది ఎక్కడ స్కేటింగ్‌ పోటీలు జరిగినా అథర్వ ముందుండేవాడు. ఆడిన ప్రతిచోటా కూడా రికార్డ్‌ పొందేవాడు. అలా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇలా మొత్తం తొమ్మిది రికార్డులను సొంతం చేసుకున్నాడు.

81 గంటలపాటూ స్కేటింగ్‌.. 

తెలుసా! సెప్టెంబరు చివరివారంలో కర్ణాటకలో శివ్‌గంగా రోలర్‌ స్కేటింగ్‌ క్లబ్‌ వాళ్లు రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు. అందులో మొత్తం 300 మంది పిల్లలు పాల్గొన్నారు. అయితే వాళ్లతో పోటీ పడ్డాడు మన అథర్వ. మూడురోజులపాటు మొత్తం 81 గంటలపాటు వాన, ఎండా, చలి ఏమీ లెక్కచేయకుండా నాన్‌స్టాప్‌ రోలర్‌ స్కేటింగ్‌ చేశాడు. అథర్వ పట్టుదలకు అందరూ అవాక్కయ్యారు. న్యాయనిర్ణేతలు సైతం ‘శభాష్‌ అథర్వ’ అంటూ మెచ్చుకున్నారు. అన్నట్టు.. ఈ పోటీలో గెలిచినందుకుగానూ మరో తొమ్మిది విభిన్న రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అథర్వ. అదన్నమాట సంగతి. ఇంత చిన్న వయసులోనే అన్నేసి రికార్డులు సాధించడం మాటలు కాదు కదా! నిజంగా అథర్వ గ్రేట్‌ కదూ నేస్తాలు.. మరింకేం తనని మెచ్చుకుంటూ అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని